
మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు
వనపర్తి: జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్, మైనర్లు డ్రైవింగ్ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని, అలాంటి వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్ ఆవరణలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ట్రాఫిక్ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రంకెన్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్‌లో పట్టుబడిన మైనర్లు, వారి తల్లదండ్రులకు ప్రతి శనివారం కౌన్సెలింగ్ నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కౌన్సెలింగ్ ద్వారా వారి ప్రవర్తన మార్చుకోవడానికి, తిరిగి బాధ్యత గల పౌరులుగా మారే అవకాశం కల్పిస్తున్నామన్నారు. మైనర్లు బైక్ నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులకు శిక్షలు కఠినంగా ఉంటాయని, లైసెన్స్ సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఇక ముందు మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే మైనర్లు, తల్లిదండ్రులు లేదా యజమానిని మోటార్ వాహనాల చట్టం–2019 199ఏ ప్రకారం సంబంధిత కోర్టులో హాజరుపరుస్తామన్నారు. వాహన యజమానికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.25 వేల జరిమానా వరకు విధిస్తారన్నారు. కార్యక్రమంలో వనపర్తి సీఐ కృష్ణ, పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్, ట్రాఫిక్ ఎస్‌ఐ సురేందర్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.