
‘వక్ఫ్ సవరణ చట్టంతో నష్టమేమి లేదు’
వనపర్తి టౌన్: వక్ఫ్ సవరణ చట్టంతో దర్గా, మసీదు, మదర్సా ఆస్తులకు నష్టమేమి లేదని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్‌పాషా అన్నారు. శనివారం జిల్లా అధ్యక్షుడు నారాయణ అధ్యక్షతన నిర్వహించిన వక్ఫ్ సవరణ వర్క్‌షాపులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో పూర్తిగా ముస్లింలు ఉన్న దేశాలు ఆఫ్ఘనిస్తాన్, సిరియా, సౌదీఅరేబియా, ఇరాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో వక్ఫ్ చట్టాలు లేవని, మొత్తం ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయని చెప్పారు. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ ఓటు బ్యాంక్ కోసమే బిల్లు ఏర్పడిందని ఆరోపించారు. రక్షణ, రైల్వే శాఖల తర్వాత అత్యధిక భూములు వక్ఫ్ ఆధీనంలో ఉన్నాయని, 2013 ముందు వక్ఫ్ ఆధీనంలో వేల ఎకరాలు ఉంటే.. 2013 తర్వాత అధికారం కోల్పోతామని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్ల కోసం బిల్లు తీసుకొచ్చి లక్షలాది ఎకరాలను ధారాదత్తం చేసిందన్నారు. అక్రమాలను సరిచేయడానికి ప్రయత్నిస్తున్న నరేంద్రమోదీపై ముస్లింలలో వ్యతిరేకత తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. నాయకుడు పోతుగంటి భరత్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ముస్లిం మత పెద్దలు, వివిధ వర్గాల ప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులతో సుదీర్ఘ చర్చల అనంతరం వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చారని చెప్పారు. ఈ బిల్లు ద్వారా దేశంలోని ముస్లింలకు పూర్తిగా అవగాహన కల్పించడానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపుమేరకు త్వరలోనే జిల్లా, మండల స్థాయిలో వర్క్‌షాపులు నిర్వహించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలం, హేమారెడ్డి, రామన్‌గౌడ్, సీతారాములు, సుమిత్రమ్మ, విష్ణువర్ధన్‌రెడ్డి, కల్పన, పెద్దిరాజు, మనివర్ధన్, ప్రవీణ్‌కుమార్, అశ్విని రాధ, రాఘవేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన
వైద్య సేవలు
కొత్తకోట/ మదనాపురం: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీంద్రనాయక్ అన్నారు. శనివారం ఆయన కొత్తకోట, మదనాపురంలోని పీహెచ్‌సీలను ఆకస్మికంగా తనిఖీ చేసి.. రోగులకు అందిస్తున్న వైద్యసేవల గురించి ఆరాతీశారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు వారితో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి వార్డుల్లో ఉన్న రోగులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని రికార్డులు, గర్భిణుల కోసం ఏర్పాటు చేసిన వెయిటింగ్ గది, అక్కడ ఉన్న పేషెంట్ వార్డులు, వ్యాక్సిన్లను పరిశీలించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా లేదా ఆరా తీశారు. ఆయా కార్యక్రమాల్లో డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ సాయినాథ్‌రెడ్డి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి పరిమళ, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ ఝాన్సీ, ఆయా పీహెచ్‌సీల వైద్యాధికారులు ఆసియాబేగం, భవాని, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

‘వక్ఫ్ సవరణ చట్టంతో నష్టమేమి లేదు’