
మత్తు నిర్మూలన అందరి బాధ్యత
వనపర్తి: జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలన అందరి బాధ్యతని.. డ్రగ్స్, గంజాయి నియంత్రణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిర్మూలన అవగాహన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయితో సమాజంలో యువశక్తి విచ్ఛిన్నమవుతుందని, దాడులు, నేరాలు పెరుగుతున్నాయన్నారు. దేశ సంపద, దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉందని.. విద్యార్థులు, యువతలో మార్పు రావాలని కోరారు. డ్రగ్స్ వినియోగంతో శరీరంలో శక్తి తగ్గుతుందని, మంచి భవిష్యత్‌ను కోల్పోతారని, సమాజంలో చెడు పేరు వస్తుందని వివరించారు. డ్రగ్స్ వినియోగం, రవాణా తీవ్రమైన నేరమని.. డ్రగ్స్‌కు అలవాటు పడిన వారి సమాచారమిస్తే కౌన్సెలింగ్ ఇచ్చి మార్పునకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా వైద్యాధికారి, జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ డా. డా. శ్రీనివాసులు, సీఐ కృష్ణ, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రెడ్‌క్రాస్ వైస్ చైర్మన్ అమర్, పాలకవర్గ సభ్యులు, అహ్మద్, జిల్లా కో–ఆర్డినేటర్ ఆర్.రాజేందర్‌కుమార్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సూపర్‌వైజర్ మహేష్, సభ్యుడు గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు ప్రజావాణికి 9 వినతులు
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ రావుల గిరిధర్ పాల్గొని ఫిర్యాదుదారుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకొని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. శాంతిభద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్‌శాఖ పని చేస్తుందని చెప్పారు.
డ్రగ్స్, గంజాయి వినియోగంతో జీవితం నాశనం
ఎస్పీ రావుల గిరిధర్