
మోత మోగితే.. వేటు!
శబ్ద కాలుష్యం కలిగించే వాహనాలపై పోలీసుల కొరడా
●
సామాన్యులకు
ఇబ్బందులు కలగొద్దని..
ద్విచక్ర వాహనాలకు అతి శబ్ధం వచ్చే సైలెన్సర్లు బిగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎస్పీకి అందిన ఫిర్యాదుల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాం. జిల్లాకేంద్రంలో 20 రోజుల్లో 66 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగించాం. ఇతర ప్రాంతాల్లో మరో ఆరు తొలగించినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో శబ్ధ కాలుష్యంతో పాటు రాష్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తాం. సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు. – సురేందర్, ట్రాఫిక్ ఎస్‌ఐ, వనపర్తి
వనపర్తి: జిల్లావ్యాప్తంగా నెల రోజులుగా జిల్లా పోలీసుశాఖ శబ్ద కాలుష్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. జిల్లాకేంద్రంలో రిజర్వ్ ఎస్‌ఐ సురేందర్ నేతత్వంలో ప్రారంభమైన శబ్ద కాలుష్యంపై కఠినంగా వ్యవహరిస్తూ 66 ద్విచక్ర వాహనాలు, మిగతా ప్రాంతాల్లో మరో ఆరు బుల్లెట్లకు ప్రత్యేకంగా బిగించిన సైలెన్సర్లను గుర్తించి తొలగించారు. కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లను పక్కనబెట్టి బయట మార్కెట్లో అతి శబ్ధం వచ్చే ప్రత్యేక సైలెన్సర్లను బిగించి ప్రజలు, వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు.. ఎస్పీ రావుల గిరిధర్ స్పెషల్ డ్రైవ్‌కు ఆదేశించారు. జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను రాష్ట్ర పోలీసులకు పంపడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు రిజర్వ్ ఎస్‌ఐతో ఆరుగురు సిబ్బందిని నియమించారు. వీరు నిత్యం రద్దీ ప్రాంతాల్లో పర్యటిస్తూ ట్రాఫిక్‌ను నియంత్రించడంతో పాటు శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వాహనాల సైలెన్సర్లను తొలగించారు. ఎంత వత్తిడి వచ్చినా జిల్లా పోలీస్‌బాస్ ట్రాఫిక్ సిబ్బంది విధులకు అడ్డుతలగకుండా తాజాగా ద్విచక్ర వాహనాలకు సంబంధించిన 66 సైలెన్సర్లను జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట రోడ్డుపై రోడ్ రోలర్‌తో తొక్కించేశారు. అలాగే ఆయా వాహనాలకు రూ.వెయ్యి చొప్పున జరిమానాలు సైతం విధించడంతో పాటు కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లు బిగించాలని ట్రాఫిక్ ఎస్‌ఐ సురేందర్ వివరించారు.
సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కిస్తున్న
అధికారులు (ఫైల్)
జిల్లాకేంద్రంలో 66.. వేర్వేరు ప్రాంతాల్లో ఆరు ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగింపు..
ఒక్కో వాహనానికి రూ.వెయ్యి జరిమానా
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినా చర్యలు
తిరిగి వినియోగించకుండా..
అతి శబ్దం వచ్చే వాహనాల సైలెన్సర్లు తొలగించిన పోలీసులు వాటిని యజమానులకు అప్పగించకుండా, మరోమారు వినియోగించకుండా, వాహనదారులకు అవగాహన కల్పించే విధంగా బహిరంగంగా రోడ్డు రోలర్‌తో తొక్కించారు. ఈ ఘటనతో జిల్లాకేంద్రంలో శబ్ధ కాలుష్యం, ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిలో భయం మొదలైందని చెప్పవచ్చు.
ప్రధాన కూడళ్లలో నిఘా..
ట్రాఫిక్ నిబంధనకు విరుద్ధంగా ప్రధాన కూడళ్లలో వాహనాలను ఇష్టారీతిగా తిరుగుతుండటంతో ఎస్పీ ప్రత్యేక చొరవతో ఎక్కడి వాహనాలు అటువైపు వెళ్లేలా రోడ్డు మధ్యలో ప్లాస్టిక్ స్తంభాలతో డివైడర్లను ఏర్పాటు చేయించారు. ఇన్నాళ్లు కూడళ్లలో ఇష్టానుసారంగా పర్యటించిన వాహనదారులు సైతం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది తెలిపారు.

మోత మోగితే.. వేటు!