కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలి
వనపర్తి: కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కేటాయించిన రైస్‌మిల్లులు, గోదాములకు తరలించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వ్యవసాయ, కో–ఆపరేటివ్, పౌరసరఫరాలశాఖ, మార్కెటింగ్‌శాఖ అధికారులతో ధాన్యం తరలింపుపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యం ఎంత.. మిల్లులు, గోదాములకు తరలించింది ఎంత.. ఇంకా కేంద్రాల్లోనే తరలింపునకు సిద్ధంగా ఉన్న ధాన్యం ఎంత అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడకుండా రవాణా కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు లారీలు పంపించాలని, అలసత్వం ప్రదర్శిస్తే అనుమతి రద్దుచేసి ఇతరులకు ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లును ఆదేశించారు. గోపాల్‌పేట, పెద్దమందడి, పొల్కెపాడు కేంద్రాల్లో ధాన్యం తరలింపునకు సిద్ధంగా ఉందని.. వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి మిల్లు, గోదాంకు సన్న, దొడ్డురకం ధాన్యం 60:40 నిష్పత్తిలో పంపించాలని.. ప్రతి కేంద్రంలో రైతులకు కనీస మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి బి.రాణి, పౌరసరఫరాలశాఖ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి
ప్రజావాణికి 80 వినతులు..
ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి దరఖాస్తుదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ దరఖాస్తుదారులకు తగిన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి, జిల్లా ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజావాణికి 80 ఫిర్యాదులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. అనంతరం రెడ్‌క్రాస్ సొసైటీ రూపొందించిన యాంటీ డ్రగ్స్ అవగాహన వాల్‌పోస్టర్‌ను వైద్యసిబ్బందితో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


