
రైతు ప్రయోజనాలకే ‘భూ భారతి’
అమరచింత/ఆత్మకూర్: రైతు ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం అమరచింత మండలం నాగల్‌కడ్మూర్, ఆత్మకూర్ మండలం జూరాల గ్రామ రైతువేదికల్లో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలో రైతుకు, భూమికి ఉన్న సంబంధాన్ని ఎవరూ విడదీయలేరన్నారు. ఒక చిన్న వ్యాపారి తన వ్యాపారంలో నష్టం వస్తే మానేస్తారని.. కాని భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతు మాత్రం పంట నష్టం కలిగినా తిరిగి అప్పు చేసి పంటలు సాగు చేస్తారని కొనియాడారు. రైతు తన భూమి భద్రత విషయంలో నిశ్చింతగా ఉంచడానికి తీసుకొచ్చిందే భూ భారతి చట్టమన్నారు. 2020లో తెచ్చిన ధరణి రైతులను గందరగోళానికి గురి చేసి అనేక సమస్యలకు కారణమైందని.. పట్టాదారు పాసు పుస్తకంలో పేరు, భూ విస్తీర్ణంలో తేడాలుంటే ఏళ్ల తరబడి కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగేవారని చెప్పారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మేధావులు, కలెక్టర్లతో 14 నెలలు చర్చించి రైతులు సులువుగా తమ భూ వివరాలు తెలుసుకునేలా భూ భారతి చట్టం తీసుకొచ్చిందని వివరించారు. భూ భారతితో రైతు దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోపు సమస్య పరిష్కరించే అవకాశం ఉందని.. గడువు ముగిస్తే నేరుగా అర్జిదారునికే చెల్లుబాటు అయ్యేలా సాఫ్ట్‌వేర్ ధ్రువీకరిస్తుందని తెలిపారు. తప్పులకు పాల్పడితే తహసీల్దార్లపై వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. అమరచింతలో జరిగిన కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ రవికుమార్ యాదవ్, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, అమ్మాపురం సంస్థానదీశులు రాజా శ్రీరాంభూపాల్, డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్‌ఖాన్, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రి నిర్మాణానికి స్థల పరిశీలన..
ఆత్మకూర్ శివారు పీజేపీ క్యాంపు వద్ద 50 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే, కలెక్టర్ సోమవారం స్థల పరిశీలన చేశారు. త్వరలోనే ప్రతిపాదనలు పంపించి ఆస్పత్రి నిర్మాణానికి మార్గం సుమగం చేస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ చాంద్‌పాషా, ఎంపీడీఓ శ్రీపాద్, కల్లు గీత కార్మిక విభాగం చైర్మన్ కేశం నాగరాజుగౌడ్, గంగాధర్‌గౌడ్, రహ్మతుల్లా, పరమేష్, తులసిరాజ్, శ్రీను, రామలక్ష్మారెడ్డి, రఫీక్, నాగేష్, రైతులు పాల్గొన్నారు.