
ఆరోగ్యవంతులే అసలైన సంపన్నులు
వనపర్తి టౌన్: ఆరోగ్యానికి మించిన సంపద లేదని, ప్రతి ఒక్కరు ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత అన్నారు. వనపర్తి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో యశోద ఆస్పత్రి సహకారంతో శనివారం జిల్లా న్యాయస్థానంలో ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో తగిన జాగ్రత్తలు, సరైన చికిత్స సకాలంలో తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని, తద్వారా జీవిత మనుగడపై, కుటుంబ పోషణకు భారం కావడంతోపాటు కుటుంబ సభ్యుల్లో ఆనందం లోపిస్తుందన్నారు. పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవారే అసలైన సంపన్నులు అన్నారు. సేవా దృక్పథంతో ఆస్పత్రి యాజమాన్యం ఉచిత వైద్య సేవలకు ముందుకు రావడం శుభపరిణామమని ప్రశంసించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు రజని, జానకి, రవికుమార్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కిరణ్‌కుమార్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.