
పదోన్నతికి.. వైకల్యం!
అడ్డదారిలో ప్రమోషన్ పొందడానికి సులువైన మార్గం ‘అంగ వైకల్యం’.
అందులోనూ ‘చెవుడు’ఉన్నటుగ్లా ఎలాగో ఒకలా దొంగ సర్టిఫికెట్‌ను సంపాదిస్తే, పదోన్నతిని ఇట్టే పట్టొచ్చు.అనుకున్న సీటును కబ్జా చేసి, పాగా వేయొచ్చు... ఇదీ వైద్య ఆరోగ్యశాఖలోని కొందరి ఉద్యోగుల తీరు. ఉద్యోగులు చేస్తున్న ఈ అడ్డదారి ప్రయత్నాలు వైద్య ఆరోగ్య శాఖ (జోన్–4) ప్రాంతీయ కార్యాలయం
పరిధిలో చర్చనీయాంశంగా మారాయి.
కడప రూరల్: కడప వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయంలో పనిచేయడానికి, జోన్–4 పరిధిలోని రాయలసీమ జిల్లాల్లో పనిచేసే దాదాపుగా ప్రతి ఉద్యోగి ఆసక్తిని ప్రదర్శిస్తారు. ఈ శాఖ కీలకమైనందున ఇక్కడ పనిచేయడానికి ఉద్యోగుల మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. ఈ సందర్భంగా జరిగే కొన్ని సంఘటనలు తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి.
పక్కాగా ప్రణాళిక... చాలా మంది ఉద్యోగులు అవకాశం దొరికితే ఈ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సూపరిండెంట్‌గా పనిచేయడానికి ఉబలాటపడుతుంటారు. తిరుపతి వైద్య ఆరోగ్య శాఖకు చెందిన, ఒక విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఎప్పటి నుంచో ఇక్కడికి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 2023లో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులకు సాధారణ బదిలీలు నిర్వహించారు. అప్పుడు ఆ ఉద్యోగి ఎలాగైనా సరే ఈ కార్యాలయానికి ట్రాన్స్‌ఫర్ కావాలని, ఈఎన్‌టీ డాక్టర్ నుంచి తెచ్చిన చెవుడు సర్టిఫికెట్‌ను సమర్పించారు. ఈ విషయమై అప్పట్లోనే పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి ఆ శాఖ రీజనల్ డైరెక్టర్, ఈఎన్‌టీ వైద్యుడి ఇచ్చిన చెవుడు సర్టిఫికెట్ చెల్లదని నిరాకరించారు. తాజాగా ఈ కార్యాలయంలో రెండు ఆఫీస్ సూపరిండెంట్ పోస్టులు ఉన్నాయి. ఒక విభాగానికి ఆఫీస్ సూపరిండెంట్‌గా పనిచేస్తున్న గోపాల్‌రెడ్డి వచ్చే నెలలో ఉద్యోగ విరమణ పొందనున్నారు. దీంతో ఈ పోస్ట్‌పై కొందరి దృష్టి పడింది. ఇక్కడికి పదోన్నతిపై ఆఫీస్ సూపరింటెండెంట్‌గా రావడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో తిరుపతిలో పనిచేసే ఉద్యోగి ఒకరు. అతను ఇంతకు ముందులా కాకుండా ఈ సారి ఏకంగా అంగవైకల్యంను నిర్ధారించే ‘సదరం’నుంచే చెవుడు ఉన్నట్లుగా సర్టిఫికెట్ పొందినట్లు సమాచారం.
నిబంధనల మేరకు ఉద్యోగి సీనియారిటీ ఇతర సర్వీసు అంశాల ప్రకారం ప్రమోషన్ కల్పిస్తారు. అప్పుడు ఆశావహులైన ఉద్యోగులకు అనుకున్న సీటులో కూర్చోవడానికి వీలుపడదు. అదే ‘చెవుడు’లాంటి అంగ వైకల్యం సర్టిఫికెట్‌ను పొందితే, కేటగిరీకి చెందిన ఉద్యోగులకు పదోన్నతుల్లో ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రకారం అయితే తిరుపతిలో పనిచేస్తున్న ఉద్యోగికి ‘చెవుడు’సర్టిఫికెట్ ఉన్నందున, ఆ వ్యక్తికే ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి లభించే అవకాశం ఉంటుంది. అదే జరిగితే అర్హులకు అన్యాయం జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. నిజంగా చెవుడు ఉండి ప్రమోషన్ పొందితే నష్టం లేదు. బోగస్‌లాంటి సర్టిఫికెట్స్‌తో పదోన్నతి చేపడితే అర్హులకు అన్యాయం జరిగినట్లే కదా..? అనే ప్రశ్నలు ఆ శాఖ ఉద్యోగుల్లో తలెత్తుతున్నాయి. కాగా త్వరలో జరిగే ప్రమోషన్స్ కౌన్సెలింగ్‌లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారే అవకాశం ఉంది. అర్హులైన ఉద్యోగులకు న్యాయం జరిగేలా అటు ఉన్నతాధికారులు..ఇటు ఉద్యోగ సంఘాల నేతలు చర్యలు తీసుకోవాలని ఆ శాఖకు చెందిన ఉద్యోగులు కోరుతున్నారు.
అర్హులకు అన్యాయమే!