
సాక్షి, విజయవాడ: మతాలు గురించి మాట్లాడే హక్కు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఉందా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భక్తి, మతంతో రాజకీయాలు చేయాలని పవన్ కల్యాణ్ చూస్తున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 40 దేవాలయాలను కూలదోస్తే పవన్ కల్యాణ్, బీజేపీ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. కాగా దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజులు జరిగితే పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పుష్కరాల సమయంలో చంద్రబాబు ప్రచార పిచ్చికి 30 మంది చనిపోతే పవన్ ఎందుకు నోరు మెదపలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు పవన్ కల్యాణ్ కంటికి కనిపించటం లేదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఒక మతానికో, కులానికో చెందిన వారు కాదని.. పిచ్చోడిలా పవన్ ప్రవర్తిస్తే ప్రజలు ఒప్పుకోరని ఆయన ధ్వజమెత్తారు.
హిందుమతం ముసుగులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. గతంలో క్రిస్టియన్ మతం గురించి పవన్ కల్యాణ్ గొప్పగా మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. పవన్ కల్యాణ్‌కు ప్రజలు రెండు చోట్ల బుద్ది చేప్పినా ఆయన తీరు మారలేదని మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో పవన్ కీలుబొమ్మలా మారాడని, పవన్ ఓ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 100 మంది చంద్రబాబులు వచ్చిన సీఎం జగన్‌ను ఏమి చేయలేరని అన్నారు. సీఎం జగన్, పార్లమెంటు సభ్యులు విజయసాయి రెడ్డిల గురించి మాట్లాడే అర్హత బుద్దా వెంకన్నకు లేదన్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు షిఫ్ట్‌ల వారిగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని తెలిపారు. బీజేపీలో ఉండి టీడీపీ మాటలు మాట్లాడుతున్న సుజనా చౌదరి వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అలాగే చంద్రబాబుకు, పవన్‌కు ఇసుక, ఇంగ్లీష్, రాజధాని తప్ప మాట్లాడానికి ఏమి కనిపించడం లేదని ఎమ్మెల్యే విష్ణు ఎద్దేవా చేశారు.