India’s 1st Missile tracking ship Dhruv to be launched on Sept 10 2021 - Sakshi
Sakshi News home page

గూఢచారి ‘ధ్రువ్‌’ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలివే.. 

Published Sat, Sep 4 2021 8:22 AM | Last Updated on Sat, Sep 4 2021 2:42 PM

Ins Dhruv Specialties - Sakshi

ఐఎన్‌ఎస్‌ ధ్రువ్‌

సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. అధునాతన సాంకేతికతతో రూపొందించిన గూఢచారి నౌక ఐఎన్‌ఎస్‌ ధ్రువ్‌ను ఈ నెల 10న జాతికి అంకితం చేయనున్నట్లు నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ అజిత్‌ దోవల్‌ ప్రకటించారు. విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డులో ఈ నౌకని రూపొందించారు. 2015లో నౌక నిర్మాణం ప్రారంభించగా 2020 అక్టోబర్‌లో పూర్తయింది. మొత్తం రూ.1,500 కోట్లతో ధ్రువ్‌ నిర్మితమైంది.

డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలు, ఇండియన్‌ నేవీ ఇంజనీర్లు, నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌టీఆర్‌వో) శాస్త్రవేత్తలు, హిందుస్థాన్‌ షిప్‌యార్డు (హెచ్‌ఎస్‌ఎల్‌) నిపుణులు ఈ నౌక నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. శత్రు క్షిపణుల్ని సమర్థవంతంగా గుర్తించగల సామర్థ్యంతోపాటు అనేక ప్రత్యేకతలు ఈ నౌకకు ఉన్నాయి. శత్రు దేశాలైన చైనా, పాకిస్తాన్‌లతో పాటు ఇతర భూభాగాల నుంచి క్షిపణులను ప్రయోగిస్తే వాటిని ధ్రువ్‌ ద్వారా ట్రాక్‌ చేయవచ్చు. అంతేకాకుండా మనకు నష్టం జరగకుండా శత్రు క్షిపణులను ఏ ప్రాంతంలో ధ్వంసం చేయాలన్న విస్తృత సమాచారాన్ని సైతం అందించగల సామర్థ్యం ధ్రువ్‌ సొంతం. సాధారణ మిసైల్స్‌తో పాటు న్యూక్లియర్‌ మిసైల్స్‌ జాడల్ని కూడా ఇది సులభంగా గుర్తిస్తుంది.

ధ్రువ్‌ నౌక మరిన్ని ప్రత్యేకతలివే.. 
దేశాన్ని మొత్తం నిశిత పరిశీలన చేసే శాటిలైట్‌ మానిటర్లను ఇందులో ఏర్పాటు చేశారు. 
ఈ నౌక రాకతో అత్యాధునిక అధునాతన సముద్ర నిఘా వ్యవస్థలున్న పీ–5 దేశాల సరసన భారత్‌ చేరింది.   
ఇందులో సెన్సార్లతో కూడిన త్రీ డోమ్‌ షేప్డ్‌ సర్వైలెన్స్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్‌ ఎరే రాడార్స్‌ టెక్నాలజీని వాడారు. 
అందుకే భారత నౌకాదళం ఐఎన్‌ఎస్‌ ధ్రువ్‌ని ‘ఈసీజీ ఆఫ్‌ ఇండియన్‌ ఓషన్‌’ అని పిలుస్తోంది. 
అంతేకాకుండా.. దీని ద్వారా 14 మెగావాట్లు విద్యుత్‌ ఉత్పత్తి చేసే సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.

సాగరతీరంలో విజయ జ్వాల
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): పాక్‌తో 1971లో జరిగిన యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వార్షికోత్సవం స్వర్ణిమ్‌ విజయ్‌ వర్ష్‌లో భాగంగా వెలిగించిన విక్టరీ ఫ్లేమ్‌ శుక్రవారం ఈఎన్‌సీకి చేరుకుంది. ఈ విక్టరీ ఫ్లేమ్‌ను అధికారికంగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, ఈఎన్‌సీ వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌ తీసుకున్నారు. విక్టరీ ఫ్లేమ్‌ రాక సందర్భంగా శుక్రవారం బీచ్‌రోడ్డులోని విక్టరీ ఎట్‌ సీ వద్ద వేడుకలు జరిగాయి. నేవీ సిబ్బంది నిర్వహించిన కవాతు అందర్నీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా 1971 యుద్ధంలో పాల్గొన్న వారి అనుభవాలను హోంమంత్రి తెలుసుకున్నారు.

విక్టరీ ఫ్లేమ్‌ను స్వీకరిస్తున్న హోంమంత్రి సుచరిత, ఈఎన్‌సీ వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌   

యుద్ధంలో అమరులైన వారిని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. 1971లో విజయం సాధించి 50 ఏళ్లవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ వద్ద 2020 డిసెంబర్‌ 16న నాలుగు విజయ జ్వాలలను వెలిగించారు. ఇవి దేశవ్యాప్తంగా ప్రయాణిస్తున్నాయి. దక్షిణ కార్డినల్‌ కోసం విక్టరీ ఫ్లేమ్‌ ఐఎన్‌ఎస్‌ సుమిత్రలో పోర్ట్‌ బ్లెయిర్‌ నుంచి విశాఖపట్నం చేరుకుంది. ఇది నగరంలోని వివిధ పాఠశాలలకు వెళ్తుంది. అనంతరం రాజమహేంద్రవరం, విజయవాడ, నల్గొండ మీదుగా హైదరాబాద్‌ చేరుకుంటుంది. ఈ ఏడాది డిసెంబర్‌ 16న ఈ నాలుగు విజయ జ్వాలలు కలుస్తాయి.

ఇవీ చదవండి:
వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ..
మాయ‘లేడి’: చాటింగ్‌తో మొదలై.. నగ్నంగా వీడియో కాల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement