సాక్షి, విశాఖపట్నం: పాకిస్తాన్ పీచమణిచి.. 1971 యుద్ధంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడిన చిరస్మరణీయ విజయానికి విశాఖ కీలక వేదికగా నిలిచింది. భారత జాతి గర్వించదగ్గ గెలుపును అందించిన విశాఖ పేరు వింటేనే ఉత్తరాంధ్ర వాసులకే కాదు.. యావత్ తెలుగు ప్రజల గుండె ఉప్పొంగుతుంది. అలాంటిది.. సముద్ర రక్షణలో శత్రువుల్ని సమర్థంగా ఎదుర్కొనే యుద్ధ నౌకకు విశాఖపట్నం పేరు పెడితే ఆ ఆనందం సాగరమంత అవుతుంది. అందుకే.. నౌకాదళ అధికారులు ఐఎన్‌ఎస్ విశాఖపట్నం పేరుతో భారీ యుద్ధ నౌకను సిద్ధం చేశారు. త్వరలోనే దీన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఆ ఐఎన్‌ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక విశేషాలివీ. (చదవండి: పసిడికి పెట్టింది పేరు.. నరసాపురం గోల్డ్ మార్కెట్)
విశాఖపట్నం పేరెందుకు పెట్టారంటే..
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రాజెక్ట్–15బీ పేరుతో నాలుగు స్టెల్త్ గైడెడ్ మిౖసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలైన విశాఖపట్నం, మోర్ముగావ్, ఇంఫాల్, సూరత్ పేర్లను పెట్టాలని సంకల్పించి తొలి షిప్‌ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు.
చదవండి: పర్యాటకానికి 'జల'సత్వం
ముంబైలో తయారీ
2011 జనవరి 28న ఈ ప్రాజెక్ట్ ఒప్పందం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ నేవల్ డిజైన్, ఇండియన్ నేవీకి చెందిన అంతర్గత డిజైన్ సంస్థలు షిప్ డిజైన్లని సిద్ధం చేశాయి. 2013 అక్టోబర్‌లో విశాఖపట్నం యుద్ధనౌక షిప్ తయారీకి వై–12704 పేరుతో ముంబైలోని మజ్‌గావ్ డాక్స్ లిమిటెడ్ (ఎండీఎల్) శ్రీకారం చుట్టింది. 2015 నాటికి హల్‌తో పాటు ఇతర కీలక భాగాలు పూర్తి చేసింది. తయారు చేసే సమయంలో పలుమార్లు ప్రమాదాలు కూడా సంభవించాయి. 2019 జూన్‌లో షిప్‌లోని ఏసీ గదిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు మరణించాడు. అయితే.. షిప్ తయారీలో మాత్రం ఎక్కువ నష్టం వాటిల్లలేదు. 2020లో రెండుసార్లు విజయవంతంగా సీ ట్రయల్స్ పూర్తి చేసిన అనంతరం తూర్పు నౌకాదళానికి ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నౌకను అక్టోబర్ 28న అప్పగించారు. డిసెంబర్‌లో దీనిని జాతికి అంకితం చేయనున్నారు.
శత్రువుల పాలిట సింహస్వప్నమే
ఇది సముద్ర ఉపరితలంపైనే ఉన్నా.. ఎక్కడ శత్రువుకు సంబంధించిన లక్ష్యాన్నైనా ఛేదించి మట్టుబెట్టగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్ విశాఖను శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు.
యుద్ధ నౌక విశేషాలివీ..
బరువు 7,400 టన్నులు
పొడవు 163 మీటర్లు
బీమ్ 17.4 మీటర్లు
డ్రాఫ్ట్ 5.4 మీటర్లు
వేగం గంటకు 30 నాటికల్ మైళ్లు
స్వదేశీ పరిజ్ఞానం - 75 శాతం
పరిధి - ఏకధాటిన 4 వేల నాటికల్ మైళ్ల ప్రయాణం
సెన్సార్స్ ,ప్రాసెసింగ్ వ్యవస్థలు- మల్టీ ఫంక్షన్ రాడార్, ఎయిర్ సెర్చ్ రాడార్
ఆయుధాలు:
32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ రాపిడ్ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్స్ నాలుగు, రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు
విమానాలు:
రెండు వెస్ట్‌ల్యాండ్ సీ కింగ్ విమానాలు లేదు రెండు హెచ్‌ఏఎల్ ధృవ్ విమానాల్ని తీసుకెళ్లగలదు
Comments
Please login to add a commentAdd a comment