
స్టార్ హీరోలందరూ ఒక్కచోటకు చేరారు. 80వ దశకంలో వెండితెరపై సందడి చేసిన అగ్రనటులందరూ ఒకేచోట కలిసి ఎంతో ఘనంగా రీయూనియన్ (The 80s Stars Reunion) పార్టీ చేసుకున్నారు. 80's రీయూనియన్ అంటూ ప్రతి ఏడాది సెలబ్రిటీలందరూ ఒకేచోటకు చేరి సంతోషంగా గడుపుతారన్న విషయం తెలిసిందే! ఈ ఏడాది అక్టోబర్ 4న చెన్నైలో ఘనంగా గెట్ టు గెదర్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈసారి కోలీవుడ్ స్టార్ జంట రాజ్‌కుమార్ సేతుపతి- శ్రీప్రియ తమ ఇంట్లోనే ఈ పార్టీని ఏర్పాటు చేశారు.
31 మంది స్టార్స్
టాలీవుడ్ నుంచి చిరంజీవి (Chiranjeevi Konidela), వెంకటేశ్, నరేశ్ ఈ పార్టీలో పాల్గొన్నారు. కోలీవుడ్, మాలీవుడ్, సాండల్‌వుడ్, అలాగే బాలీవుడ్ నుంచి కూడా స్టార్స్ వచ్చారు. జాకీ ష్రాఫ్, మీనా, శరత్‌కుమార్, నదియా, రాధ, సుహాసిని, రమ్యకృష్ణ, జయసుధ, సుమలత, ఖుష్బూ, లిస్సీ, శోభన, మేనక, సురేశ్, భాను చందర్, ప్రభు, రెహ్మాన్, రేవతి తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. దాదాపు 31 మంది నటీనటులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈసారి చిరుత థీమ్ ప్లాన్ చేశారు. అందరూ చీతా ప్రింట్స్ ఉన్న డ్రెస్సులోనే మెరిశారు.

మొదటిసారి కలిసినట్లే ఉంది: చిరు
80s స్టార్స్ రీయూనియన్‌కు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 80's స్నేహితులతో ప్రతి రీయూనియన్ మధుర జ్ఞాపకాల వీధిలో ఒక నడకలా ఉంటుంది. నవ్వులు, ఆప్యాయత, పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఆనందం, ప్రేమతో గడుస్తుంది. ఎన్ని సార్లు కలిసినా, ప్రతి సారి కొత్తగా, మొదటిసారి కలిసినట్టే సంతోషంగా అనిపిస్తుంది అన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
అప్పుడు మొదలైంది
80's స్టార్స్ రీయూనియన్ 2009లో ప్రారంభమైంది. లిస్సీ, సుహాసిని తొలిసారి ఈ పార్టీ ఏర్పాటు చేశారు. 2019లో మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో 10వ రీయూనియన్ పార్టీ నిర్వహించారు. 2022లో చివరిసారి గెట్ టు గెదర్ జరిగింది. అప్పుడు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, నటి పూనమ్ ధిల్లాన్ పార్టీ హోస్ట్ చేశారు. 2023లో రీయూనియన్ జరగలేదు. 2024లో చెన్నైలో వరదల కారణంగా పార్టీ వాయిదా వేశారు. ఇన్నాళ్లకు మళ్లీ పార్టీ చేసుకుని ఎంజాయ్ చేశారు. పార్టీలో సరదా ఆటలు, పాటలు, డ్యాన్సులు ఉండనే ఉంటాయి. ఇలా ప్రతి ఏడాది జరగే ఈ “80s Stars Reunion” స్నేహం, ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం విలువలకు ప్రతీకగా నిలుస్తోంది.

చదవండి: ట్రెండింగ్‌లో దెయ్యం సినిమా..'సుమతి వలవు' మూవీ రివ్యూ