ఆ నలుగురు పుచ్చకాయ తిని చనిపోలేదు! | Mumbai Family Case: Not Watermelon Mystery Continue After Forensic Report | Sakshi
Sakshi News home page

ఆ నలుగురు పుచ్చకాయ తిని చనిపోలేదు!

May 2 2026 11:24 AM | Updated on May 2 2026 1:40 PM

Mumbai Family Case: Not Watermelon Mystery Continue After Forensic Report

ముంబై కుటుంబం మృతి కేసులో ట్విస్ట్‌ చేసుకుంది. ఆ నలుగురు పాడైపోయిన పుచ్చకాయ తినడం ద్వారా చనిపోలేదని నిర్ధారణ అయ్యింది. అయితే వాళ్ల శరీరంలోని ప్రధాన అవయవాలన్నీ మాత్రం రంగు మారినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మిస్టరీ కేసు విచారణ మరో మలుపు తిరిగినట్లైంది.  

గత వారం ఆ కుటుంబం మటాన్‌ పులావ్‌ తిని.. ఆపై పుచ్చకాయ తిని తీవ్ర అస్వస్థకు లోనైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఒక్కొక్కరుగా చనిపోయారు. అయితే వాళ్లలో ఫుడ్‌ పాయిజన్‌ లక్షణాలు కనిపించాయన్న వైద్యుల ప్రకటనతో కలకలం రేగింది. పులావ్‌ తిన్న మిగతా వాళ్లకు ఏం కాకపోవడంతో.. అందరి దృష్టి పుచ్చకాయ వైపునకు మళ్లింది. 

బహుశా.. కలుషితమైన పుచ్చకాయ తిని వాళ్లంతా మరణించి ఉంటారన్న ప్రచారం జోరందుకుంది. సమ్మర్‌లో చాలా మంది తినే పుచ్చకాయ ఇంత పని చేసిందా? అనే చర్చ నడిచింది. వాటర్‌మిలన్‌ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇది మహారాష్ట్రలో పుచ్చకాయల సేల్‌ పడిపోవడానికి ఒక కారణం అయ్యింది కూడా.  అయితే.. 

తాజాగా ఈ కేసు ఫోరెన్సిక్‌ నివేదిక బయటకు వచ్చింది. అందులో పుచ్చకాయలో ఎలాంటి కల్తీ ఆనవాళ్లు లేవని తేలింది. అలాగని ఇది సాధారణ ఫుడ్‌ పాయిజన్‌ అయ్యి ఉండకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. 

ఆ నలుగురిలో గుండె, లివర్‌, బ్రెయిన్‌, పేగులు ఆకుపచ్చరంగులోకి మారిపోయి ఉన్నాయి. దీంతో వాళ్లపై విష ప్రయోగం ఏదైనా జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అబ్దుల్లా శరీరంలో మోర్ఫిన్‌ అనే శక్తివంతమైన పెయిన్‌కిల్లర్‌ ఆనవాలు లభ్యమైంది. ఇది సాధారణంగా వైద్యులు చెబితేనే వాడాలి. దీంతో ఈ అంశంపైనా అధికారులు ఇప్పుడు దృష్టిసారించారు. పోస్ట్‌మార్టం అనంతరం.. ఆ అవయవాలను పరీక్షల(కెమికల్‌) కోసం పంపారు. ఫలితాలు వచ్చాకే ఏది అనేదానిపై ఓ క్లారిటీ రానుంది. 

మొబైల్‌ రిపేర్‌ షాప్‌ నడిపించే అబ్దుల్లా డొకాదియా.. అతని భార్య, ఇద్దరు పిల్లలు. గత శనివారం రాత్రి ఇంట్లో దావత్‌ చేశారు. మరో ఐదుగురు బంధువుల్ని పిలిచి మటావ్‌ పులావ్‌ పెట్టారు. వాళ్లు వెళ్లిపోయాక అర్ధరాత్రి సమయంలో ఈ నలుగురు పుచ్చకాయ తిన్నారు. ఉదయం 5గం. టైంలో ఒకరి తర్వాత ఒకరికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 12 గంటల వ్యవధిలో అంతా ప్రాణాలు కోల్పోయారు. 

పుచ్చకాయ ఆందోళనలపై.. మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ తాజాగా ఓ ప్రకటన చేసింది. ఈ నాలుగు మరణాలకు పుచ్చకాయకు సంబంధం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటించింది. అయితే పుచ్చకాయ కలుషితం కాకపోతే గనుక ఎవరైనా విషాన్ని ఇంజెక్ట్‌ చేసి ఉంటారా? అనే కోణంలోనూ దర్యాప్తు నడుస్తోంది. 

ఇదీ చదవండి: పుచ్చకాయ.. ఆ టైంలో తింటేనే సూపర్‌!

Advertisement
 
Advertisement
Advertisement