యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ టీమిండియాలో పునరాగమనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అతడు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, రెస్టాఫ్ ఇండియా టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయంపైనే ఈ విషయం ఆధారపడి ఉంది. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్.. ఇప్పటి వరకు జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు.
రెడ్‌బాల్ క్రికెట్‌లో రీఎంట్రీ
రంజీల్లో ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరకు చేయడం వల్ల.. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడంటూ బోర్డు ఇషాన్‌కు గట్టి షాకిచ్చింది. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి అతడిని తప్పించింది. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగిన ఇషాన్ ఇటీవలే బుచ్చిబాబు టోర్నీ ద్వారా రెడ్‌బాల్ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. సెంచరీతో ఆకట్టుకుని.. దులిప్ ట్రోఫీ-2024లో చోటు దక్కించుకున్నాడు.
రెస్టాఫ్ ఇండియా టీమ్‌కు ఎంపిక
బీసీసీఐ ఆధ్వర్యంలోని ఈ దేశీ రెడ్‌బాల్ టోర్నీలోనూ ఇషాన్ కిషన్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఇండియా-‘సి’ జట్టు తరఫున శతకంతో అలరించాడు. ఈ క్రమంలో ఇరానీ కప్-2024 మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా టీమ్‌కు ఎంపికయ్యాడు.
రిషభ్ పంత్‌కు విశ్రాంతి
రంజీ చాంపియన్ ముంబైతో అక్టోబరు 1- 5 వరకు జరుగనున్న మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా తలపడనుంది. ఆ వెంటనే అంటే.. అక్టోబరు 6- 12 వరకు టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది.
బంగ్లా సిరీస్ తర్వాత.. న్యూజిలాండ్‌తో టెస్టుల నేపథ్యంలో ఈ యోచన చేస్తున్నట్లు సమాచారం. కాబట్టి పంత్ స్థానంలో ఇషాన్‌ను బంగ్లాదేశ్‌తో టీ20సిరీస్‌కు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కు ఛాన్స్ ఇవ్వనున్న సెలక్టర్లు.. అతడికి బ్యాకప్‌గా ఇషాన్‌కు జట్టులోస్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
రెస్టాఫ్ ఇండియా నుంచి రిలీజ్ చేస్తేనే
అయితే, అదే సమయంలో.. ఇరానీ కప్ మ్యాచ్ ఉన్నందున రెస్టాఫ్ ఇండియా నుంచి ఇషాన్‌ను రిలీజ్ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఏదేమైనా.. ఒకప్పుడు జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న ఈ లెఫ్టాండర్.. స్వీయ తప్పిదాల వల్ల ఇప్పుడు జట్టులో అదనపు ప్లేయర్‌గానైనా చోటు దక్కించుకోవడం గగనమైపోయింది.
చదవండి: రంజీ ‘జట్టు’లో విరాట్ కోహ్లి, మరో టీమిండియా స్టార్ కూడా.. డీడీసీఏ ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment