ఇరానీ కప్-2024 మ్యాచ్‌లో టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబైతో జరుగుతున్న ఈ ఐదు రోజుల మ్యాచ్‌లో సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మొత్తంగా 121 బంతులు ఎదుర్కొని 93 పరుగులతో దుమ్ములేపాడు.
'శతకం చేజారినా
సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయినా.. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(191)తో కలిసి రెస్ట్ ఆఫ్ ఇండియాకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఇక ఇదే మ్యాచ్‌లో తన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతోనూ ధ్రువ్ జురెల్ అదరగొడుతున్నాడు. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో అతడు మూడు క్యాచ్‌లతో మెరిశాడు.
ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఆయుశ్ మాత్రే(19), హార్దిక్ తామోర్(0), యశ్ దయాల్ బౌలింగ్‌లో కెప్టెన్ అజింక్య రహానే(97) ఇచ్చిన క్యాచ్‌లు పట్టి.. వారిని పెవిలియన్‌కు పంపడంలో తోడ్పడ్డాడు. తద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టి తనపై నుంచి మరలకుండా చేసుకోగలిగాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.
ఇషాన్ కిషన్ విఫలం
మరోవైపు.. ఇరానీ కప్-2024 మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్‌తో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకే ఆడుతున్న మరో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ మాత్రం నిరాశపరిచాడు. ఐదో స్థానంలోబ్యాటింగ్‌కు దిగిన ఈ లెఫ్టాండర్ 60 బంతులు ఎదుర్కొని 38 పరుగులకే పరిమితమయ్యాడు. కాగా ఇషాన్ కిషన్ గత కొన్నాళ్లుగా టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే.
టీమిండియా సెలక్టర్ల దృష్టి మరలకుండా
ముఖ్యంగా టెస్టుల్లో స్థానం పొందాలన్న ఇషాన్ కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఇప్పటికే క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఈ జార్ఖండ్ బ్యాటర్‌కు ధ్రువ్ జురెల్ చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైన రిషభ్ పంత్ స్థానంలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ధ్రువ్.. తన తొలి మ్యాచ్‌లోనే మెరుగ్గా రాణించాడు. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. తాజాగా దులిప్ ట్రోఫీ-2024లోనూ వికెట్ కీపర్‌గా రాణించిన ధ్రువ్ జురెల్.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో పంత్ బ్యాకప్‌గా ఉన్నాడు.
ఇషాన్ రంజీల్లో రాణిస్తేనే
తాజాగా రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున అద్బుత ఇన్నింగ్స్‌తో అలరించాడు. స్వదేశంలో టీమిండియా తదుపరి న్యూజిలాండ్‌తో ఆడే సిరీస్‌కు ముందు సెలక్టర్ల ముందు సత్తా నిరూపించుకున్నాడు. దీంతో సెలక్టర్లు.. టెస్టుల్లో ఇషాన్ కిషన్‌ను వికెట్ కీపర్ రేసు నుంచి తప్పించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ ఏడాది రంజీల్లో గనుక ఇషాన్ రాణిస్తే తన రాత మారే అవకాశం ఉంటుంది.
భారీ ఆధిక్యం దిశగా ముంబై
కాగా రంజీ చాంపియన్- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ కప్ టైటిల్ కోసం పోటీ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈసారి రంజీ ట్రోఫీ గెలిచిన ముంబై.. ఇరానీ కప్ కూడా గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. లక్నోలో అక్టోబరు 1న మొదలైన ఈ ఐదు రోజుల మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందుకు రెస్ట్ ఆఫ్ ఇండియా 416 పరుగులతో బదులిచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.
చదవండి: IPL 2025: ‘ఆర్సీబీ రోహిత్ శర్మను కొని.. కెప్టెన్ చేయాలి’
Comments
Please login to add a commentAdd a comment