భారత క్రికెట్ జట్టులో పునరాగమనమే లక్ష్యంగా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ముందుకు సాగుతున్నాడు. స్వీయ తప్పిదాల వల్ల జట్టులో చోటు కోల్పోయిన అతడు.. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే బుచ్చిబాబు టోర్నమెంట్ ద్వారా దేశవాళీ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చిన ఈ జార్ఖండ్ చోటా డైనమైట్.. సెంచరీతో చెలరేగాడు.
తదుపరి దులిప్ ట్రోఫీలో
మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 114, 41 (నాటౌట్) పరుగులతో ఇషాన్ అలరించాడు. ఈ టోర్నీలో జార్ఖండ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్ తదుపరి దులిప్ ట్రోఫీలోనూ ఆడనున్నాడు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమ్-డిలో వికెట్ కీపర్‌గా సేవలు అందించనున్నాడు.
ఈ రెడ్‌బాల్ టోర్నీలోనూ నిరూపించుకుంటే ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇవ్వడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ మాత్రం ఆ అవకాశం లేదంటున్నాడు. ఇప్పట్లో ఇషాన్‌కు టీమిండియా సెలక్టర్ల పిలుపురాదని.. జాతీయ జట్టులో చోటుపై ఆశలు పెట్టుకోవడం మాని.. ఐపీఎల్‌పై దృష్టి సారించాలని అతడికి హితవు పలికాడు.
అప్పటిదాకా నో ఛాన్స్.. ఐపీఎల్‌పై ఫోకస్ పెడితే మంచిది
చాంపియన్స్ ట్రోఫీ-2025 వరకు ఇషాన్ కిషన్ పేరును బీసీసీఐ సెలక్టర్లు పరిశీలించకపోవచ్చునని అభిప్రాయపడ్డాడు. ‘‘ఆస్ట్రేలియా సిరీస్ దాకా ఇషాన్ కిషన్ వేచి చూడాల్సిందే. అయితే, అంతకంటే ఎక్కువగా అతడు ఐపీఎల్‌పైన ఫోకస్ పెడితే మంచిది. నాకు తెలిసి చాంపియన్స్ ట్రోఫీ వరకు కూడా ఇషాన్ రీఎంట్రీ కుదరకపోవచ్చు’’ అని పాక్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
పంత్ రాకతో ఇషాన్‌కు చిక్కులు
కాగా గతేడాది జట్టుతో పాటు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్ కిషన్ అర్ధంతరంగా స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. మానసిక ఆందోళన కారణం చూపి సెలవు తీసుకున్న ఇషాన్.. తిరిగి జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేశాడు. ఫలితంగా సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయాడు.
ఈ నేపథ్యంలో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించే క్రమంలో డొమెస్టిక్ క్రికెట్‌పై దృష్టి సారించాడు. అయితే, బంగ్లాదేశ్‌తో సెప్టెంబరు 19 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం నేపథ్యంలో స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (పునరాగమనం), ధ్రువ్ జురెల్ రూపంలో కీపర్ కోటాలో ఇషాన్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. మరోవైపు కేఎస్ భరత్ కూడా రేసులో ఉండే అవకాశం ఉంది.
చదవండి: బుమ్రా ఓకే.. రోహిత్, కోహ్లికి రెస్ట్ అవసరమా?: టీమిండియా దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment