
‘కింగ్’ కోహ్లి టీనేజ్‌లో భారత్‌ను అండర్–19 ప్రపంచకప్ విజేతగా నిలిపాడు. 2008లో అతని సారథ్యంలోనే యువ భారత్ ‘కప్’ తెచ్చింది. తర్వాత సీనియర్ జట్టు సభ్యుడైన కొన్నాళ్లకే 2011లో ధోని నేతృత్వంలోని టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిచింది.
తర్వాత చాంపియన్స్ ట్రోఫీ, గతేడాది టి20 ప్రపంచకప్, ఈ ఏడాది మరో చాంపియన్స్ ట్రోఫీ ఇలా చాలా ఐసీసీ ట్రోఫీల్లో కోహ్లి కీలక ఆటగాడయ్యాడు. తదుపరి 2027 వన్డే ప్రపంచకప్ బరిలో నిలిచేందుకు ఫిట్‌నెస్‌తో ఉన్నాడు.
అయితే అతని 2008 సహచరుల్లో ఇద్దరు తన్మయ్ శ్రీవాస్తవ, అజితేశ్ అర్గల్‌లు ఇప్పుడు ఫీల్డ్ అంపైర్లుగా మారారు. 35 ఏళ్ల తన్మయ్, 37 ఏళ్ల అజితేశ్‌లకు కాలం కలిసివస్తే... ఐసీసీ ఎలైట్ అంపైర్లయితే... కోహ్లి ఆడే మ్యాచ్‌లకు, 2027 మెగా ఈవెంట్‌కు ఫీల్డ్ అంపైర్లుగా బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదు.
ఇదే జరిగితే 22 గజాల పిచ్‌పై వికెట్ల ముందు కోహ్లి ఆడుతుంటే... వికెట్ల వెనుక (నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో) ఒకప్పటి సహచరులు అంపైరింగ్ చేయడాన్ని చూడొచ్చు. ఇక ప్రస్తుత విషయానికొస్తే తన్మయ్, అజితేశ్‌లు 2023లో బీసీసీఐ అంపైరింగ్ పరీక్షల్లో పాసయ్యారు.
ఇప్పటికే రంజీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలకు అంపైరింగ్ చేశారు. తాజాగా వీరికి ప్రమోషన్ లభించింది. వీళ్లిద్దరు ఇప్పుడు భారత్ ‘ఎ’, ఆ్రస్టేలియా ‘ఎ’ జట్ల మధ్య జరుగుతున్న సిరీస్‌కు కాన్పూర్‌లో అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
చదవండి: ICC Womens World Cup 2025: పాక్‌పై భారత్ గెలుపు.. మహిళలూ మురిపించారు