
ప్రేమలో పడ్డారు, ప్రేమను ఫీలవుతున్నారు అంటూ ఒక పాత పాట ప్రకటించి ఉండవచ్చు కానీ మన దేశానికి ఇది వర్తిస్తుందా అని నాకు సందేహం. కామసూత్ర రోజుల్లో చుంబనం, సరస సల్లాపాల కళలో మనం నిష్ణాతులమై ఉండవచ్చు కానీ ఆ అత్యున్నత కళా సాధన మనకు ఇప్పుడు చాలా దూరంలో ఉన్నట్లుంది. ఈరోజుల్లో లవ్ జిహాద్ వ్యతిరేక స్పందన, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి నియమించిన యాంటీ రోమియో దళాల ప్రయాస కలసి యువతీయువకుల ప్రేమాతురతను అణిచివేస్తూ ప్రణయ భావనను శృంఖలాబద్ధం చేస్తున్నాయి.
మన భారతీయ జూలియట్ల హృదయాలు ‘ఓ రోమియో, ఓ రోమియో! ఎందుచేత నీవు ప్రణయ మూర్తివి’ అంటూ విలపించవచ్చు. కానీ ఇప్పుడు అతడు ఆ ప్రణయ ప్రదర్శనకు సిద్ధపడతాడా అని నాకు సందేహం. ఇప్పుడు ప్రేమ స్థానంలో భయం ఆవహించింది. బహుశా రోమియో మమ్మీతో ఇంట్లో గడుపుతూ ఉండవచ్చు. కలవరం కలిగించే ఈ వాస్తవాలకేసి ఒకసారి చూడండి. యూపీ సీఎం యోగి నియమించిన యాంటీ రోమియో దళాలు ఇంతవరకు 21,37,520 మంది రోమియోలను ప్రశ్నిం చాయి. వీరిలో 9,33,099 మందిని హెచ్చరించి వదిలిపెట్టారు. మరో 3,003 మంది రోమియోలపై 1,706 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. 2017 మార్చి 22 నుంచి డిసెంబర్ 15 మధ్యన రోమియోలపై రోజుకు సగటున ఆరు కేసులు పెట్టారన్నమాట.
యాంటీ రోమియో దళంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. వీరు ఉత్తరప్రదేశ్ యూనివర్సిటీలు, కాలేజీలు, సినిమా హాళ్లు, పార్కులు, బహిరంగ స్థలాల్లో గస్తీ తిరుగుతారు. దీనిఫలితంగా యువతీయువకుల మధ్య కౌగిలింతలు, చుంబన క్రియలకు తావు లేకుండా పోయింది. నవయవ్వనంలో పొంగిపొరలే ప్రేమోత్సాహానికి పూర్తిగా అడ్డుకట్టలేసినట్లయింది.
దీనికి భిన్నంగా, ప్రేమికుల దినోత్సవం నాడు నేను తొలిసారిగా అందుకున్న ఎర్రగులాబీ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇది ముప్ఫై ఏళ్ల క్రితం నాటిది. లండన్ వీకెండ్ టెలివిజన్‌లో నేను నిర్మాతగా ఉండేవాడిని. ఆ రోజు మధ్యాహ్నం ఫోన్ మోగింది. అది తొమ్మిది అంతస్తుల కింద ఉన్న రిసెప్షన్ నుంచి వచ్చింది.
‘కరణ్’ ఉత్సాహంతో కూడిన స్వరం వినిపించింది. ‘మీరు నమ్మలేకపోవచ్చు కానీ మీకోసం ఒక వేలంటైన్ ఎర్రగులాబీని ప్రత్యేకంగా పంపారు!’. నిమిషాలలోపే జిగేలుమంటూ రిసెప్షన్‌కి చెందిన ఓ యువతి నా వద్దకు నడుచుకుంటూ వచ్చింది. ఆమె కుడిచేతిని చాచింది. ఆ చేతిలో ఒక విడి ఎర్రగులాబీ ఉంది. గులాబీ కాడ నుంచి ఒక దళసరి కాగితం ముక్క వేలాడుతూ ఉంది. ‘ఎవరో ఊహించు?’ అని దానిపై రాసి ఉంది.
దాన్ని చూడగానే నాకు మతి పోలేదు కానీ నాలో ఏదో తుళ్లింత బయలుదేరింది. నన్ను రహస్యంగా ప్రేమించేవారు ఉన్నారన్నమాట అని నాకు నేను చెప్పుకున్నాను. నా సహోద్యోగులు నన్ను చూసి నవ్వడం, ఆటపట్టించడం ప్రారంభించారు. ‘దాన్ని ఎవరు పంపి ఉంటారని అనుకుంటున్నావు?’ అంటూ ఊరించసాగారు. కానీ నా జీవితంలో అలాంటి అనుభవం లేదు.
నన్ను నేను నిగ్రహించుకోలేక వెంటనే ఫోన్ చేసి నిషాకు కాల్ చేశాను. ‘ఊరూ పేరూ లేని వ్యక్తి నాకు ఒక గులాబీ పంపారు. ఎవరు పంపి ఉంటారని అనుకుంటున్నావు? కాస్త ఊహించగలవా’ అని అడిగాను. నిషా వెంటనే నవ్వేసింది. ఆమె సంతోషంగా ఉన్నట్లనిపించింది. కానీ నా రహస్య ప్రేమికురాలు ఎవరై ఉంటారో ఆమెకు కూడా ఆలోచన లేనట్లుంది.
ఆ రోజంతా నాకు ఆకాశంలో తేలిపోయినట్లయింది. నాకు నేను పొంగిపోతున్నట్లు అనిపించింది. ఏ విషయంపైనా నేను దృష్టి పెట్టలేకపోయాను. ఆరోజు వేగంగా గడిచిపోయింది.
ఆ సాయంత్రం నేను ఇంటికెళ్లాక ఆ గులాబీని డ్రాయింగ్ రూమ్‌లోని బల్లపై గాజు పళ్లెంలో ఉంచాను. నా వెనుకే వచ్చిన నిషా వెంటనే ఆ గులాబీనీ చూసి ‘ఇప్పటికీ పులకరింతగానే ఉందా?’ అంటూ పెద్దగా నవ్వుతూ అడిగింది. ‘కావచ్చు. నాకూ ఒక ప్రేమికురాలు ఉంది. తను ఎవరా అని సంభ్రమంగా ఉంది’ అన్నాను.
నిషాకు నా సంభ్రమం కాస్త అతిగా తోచిందనుకుంటాను. ‘ఇడియట్. ఆ గులాబి పంపింది నేను. ప్రేమికుల దినాన నీకు గులాబి ఎవరు పంపుతారు?’ అనేసింది.
నేను దిగ్భ్రమ నుంచి తేరుకుంటూండగా, నిషా ఫోన్ అందుకుని ఈ కథను తన స్నేహితురాళ్లతో పంచుకోవడం మొదలెట్టింది. ఈ జోక్‌కి నేనే కారణం అయి ఉండవచ్చు. కానీ అంతకు ముందు ఆరుగంటల వరకు నాకు ఆ గులాబీ తుళ్లింత కలిగించడమే కాకుండా మధుర భావనలతో నన్ను ముంచెత్తింది మరి.
ఇది అమాయకత్వపు సరదా ఘటనయినా యోగి, లవ్ జిహాద్ నిరసనకారులకు ఒక ముగింపు పలకాల్సి ఉంటుంది. ముందు జరిగే పరిణామాలపై ఆందోళన చెందాల్సి వస్తే, ప్రేమించే కాంక్షను కూడా కోల్పోతారు. పోలీసు నిఘా వెంటాడుతున్నప్పుడు తరుణ వయస్కుల సరస సల్లాపాలు గాలికి ఎగిరిపోతాయి. ప్రియతమా! మన ప్రపంచం ఎంత ఆనంద రహితంగా మారుతుందో చూశావా?
- కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : karanthapar@itvindia.net