
భార్యాభర్తల సంబంధం అనేది చాలా సున్నితమైనది. ఇది ప్రేమ అనే బంధంతో ముడిపడి ఉంటుంది. చిన్నపాటి దారంతో మెలివేసి ఉంటుంది. ఈ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి చిన్న పొరపాటు సరిపోతుంది. ప్రేమ దారంతో ముడిపడాల్సిన బంధం.. అనుమానం అనే ఆయుధంతో దాడి చేస్తే కాపురాలు నాశనం అవుతాయి. ఆ బంధాలు శాశ్వతంగా నిలబడువు. ఈ ఘటనలో అదే జరిగింది.
వారిది పెద్దగా అన్యోన్యమైన దాంపత్యం కాదు. పెళ్లై ఐదేళ్లే అవుతుంది. అప్పట్నుంచీ ఇంట్లో రోజూ చికాకులు. భార్యాభర్తల మధ్య గొడవలు. ఒకరి కంఫర్ట్ జోన్ లోకి ఇంకొకరు రాలేకపోయారు. దాంతో భర్త ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. తాను చేయని తప్పుకు భార్య నిందించడంతోపాటు కేసును కూడా పెట్టడంతో భర్త ప్రాణాలు వదిలేశాడు. సమాజం, కుటుంబం తానేమిటీ అన్న విషయాన్ని నమ్మాలంటే అది తన ఆత్మహత్య ద్వారానే సాధ్యమవుతుందని భావించి విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు.
34 ఏళ్ల మోహిత్ త్యాగి అనే వ్యక్తికి పెళ్లైన దగ్గర్నుంచీ భార్య నుంచి ఏవో వేధింపులకు గురవుతూనే ఉన్నాడట. 2020, డిసెంబర్‌లో ప్రియాంక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మోహిత్.. ఆపై నరకం చూసాడట.
తనకు రెండో పెళ్లి కావడంతో భార్య తన ఆస్తి కోసం, తన సంపాదన కోసమే చేసుకుని ప్రతీరోజూ నరకం చూపించేదని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ భార్య ప్రియాంకను, ఆమె తరఫు బంధువులు పేర్లు పేర్కొంటూ సూసైడ్ నోట్ రాశాడు. తాను చనిపోవడానికి నిర్ణయించుకున్న కొన్ని సెకన్ల ముందే ఆ నోట్ తన ఫ్రెండ్స్ అందరికీ పంపించాడు. ఆ వెంటనే విషం తాగాడు. రెండు రోజుల మృత్యువుతో పోరాడి చనిపోయాడు.
2024లో మోహిత్ తల్లి చనిపోయిన క్రమంలో భార్య ప్రియాంక బాగా గొడవపడిందట. ఆ సమయంలోనే భార్య కొంతమందిని ఇంటికి తీసుకొచ్చి రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల విలువైన బంగారాన్ని మొత్తం అపహరించిందట. ఈ విషయాన్ని మోహిత్ సోదరుడు తాజాగా వెల్లడించాడు.
సూసైడ్ నోట్ లో ఏముందంటే..
నాపై అనుమానంతో ఒక తప్పుడు కేసును భార్య పెట్టించింది. ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒక ప్లాన్ ప్రకారమే నన్ను పెళ్లి చేసుకుంది. అనేక సార్లు గర్భం వస్తే దాన్ని తీయించుకుంది. నన్ను చాలా హింసించింది. నేను ఇక తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నాపై పోలీస్ కేసు పెట్టడంతో నా జీవితం ఇక అనవసరం. నేనూ ఏ తప్పూ చేయలేదు. నేను చనిపోతున్నందుకు నాకు బాధేమీ లేదు.
కాకపోతే నాకు పుట్టిన కొడుకు పరిస్థితి ఏమౌంతుందో అని ఆలోచిస్తున్నా. నాకు అదొక్కటే విచారంగా ఉంది. వీరంతా నా కొడుకును చంపేసే అవకాశం కూడా ఉంది. మీరు నిజాన్ని నమ్మాలంటే నాకు చావు ఒక్కటే శరణ్యం’ అని పేర్కొన్నాడు. భార్య ప్రియాంక, ఆమె తరుఫు బంధువులే తన చావుకు కారణమని తెలిపాడు. తన చావు తర్వాత భార్య ప్రియాంక కచ్చితంగా చింతిస్తుందని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఏప్రిల్ 15వ తేదీన సూసైడ్ చేసుకోగా, రెండు రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.