MF Hussain
-
వేలంలో కోట్ల రూపాయలు పలికిన టాప్ పెయింటింగ్స్
ఆర్ట్ ఒక జీవితావసరం. ఎవరికి?! అద్దం అవసరం ఎవరికైతే ఉంటుందో, వారందరికీ. జీవితానికి అద్దం పట్టే ఆర్ట్ జీవితంలానే ఉంటుంది తప్ప.. ప్రతిబింబంలానో, అనుసృజనలానో ఉండదు. నడిచిపోయిన కాలానికి నిలకడైన రూపం ఆర్ట్. అందుకే ఆర్టిస్టులకు అంత గౌరవం, ఆర్ట్ అంత అమూల్యం. ప్రపంచ ప్రసిద్ధ చెందిన ‘ఆక్షన్’ సంస్థలు ఏడాది పొడవునా ఈ చిత్ర పటాలను వేలానికి ఉంచుతూనే ఉంటారు. అలా ఇప్పటి వరకు అంతర్జాతీయ వేలం పాటల్లో అత్యధిక ధరను దక్కించుకున్న తొలి ఐదు భారతీయ తైలవర్ణ చిత్రాల విశేషాలు మీ కోసం.తయ్యబ్ మెహతా, ఎం.ఎఫ్. హుస్సేన్ ఇంచుమించుగా ఒక ఈడు వాళ్లు. హుస్సేన్ తర్వాత పదేళ్లకు జన్మించిన తయ్యబ్... హుస్సేన్ కన్నా రెండేళ్లు ముందుగా ‘సెలవు’ తీసుకున్నారు. కానీ, మానవాళికి తమ కుంచె వేళ్లకు ఆనవాళ్లుగా వాళ్లు వదిలివెళ్లిన తైలవర్ణ చిత్రాలు కాలాలకు అతీతమైనవి! తయ్యబ్ దాదాపు 70 ఏళ్ల క్రితం గీసిన ‘ట్రస్‌డ్ బుల్’ పెయింటింగ్ తాజా వేలంలో రూ.61.8 కోట్ల ధర పలికింది. ఏప్రిల్ మొదటి వారంలో ముంబైలోని ‘శాఫ్రాన్ఆర్ట్’ గ్లోబల్ సంస్థ తన 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆన్లైన్ వేలంలో ‘ట్రస్‌డ్ బుల్’ రెండవ అత్యంత ఖరీదైన భారతీయ పెయిటింగ్‌గా చరిత్రలో నిలిచింది. మొదటిది ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగ్ ‘గ్రామ్ యాత్ర’. న్యూయార్క్‌లో ఈ ఏడాది మార్చి మూడవ వారంలో జరిగిన ‘క్రిస్టీస్’ వేలంలో హుస్సేన్ ‘గ్రామ్ యాత్ర’ రూ.118 కోట్లు పలికింది. అమృతతో తయ్యబ్ సమస్థానంహుస్సేన్ ‘గ్రామ్ యాత్ర’ తర్వాత తయ్యబ్ ‘ట్రస్‌డ్ బుల్’ చిత్రం రెండో స్థానంలో ఉన్నప్పటికీ, ఏడాదిన్నర క్రితమే 2003 సెప్టెంబరులో అదే ‘శాఫ్రాన్ఆర్ట్’ సంస్థ నిర్వహించిన వేలంలో అదే మొత్తానికి (రు.61.8 కోట్లు) అమృతా శేర్ గిల్ పెయింటింగ్ ‘ది స్టోరీ టెల్లర్’ విక్రయం అయింది కనుక తయ్యబ్‌ది అమృతాతో సమస్థానం అని చెప్పటం కూడా గౌరవంగానే ఉంటుంది. అమృత ఎం.ఎఫ్. హుస్సేన్ కంటే కూడా వయసులో రెండేళ్లు, తయ్యబ్ కంటే పన్నెండేళ్లు పెద్దవారు. హుస్సేన్ 95 ఏళ్లు, తయ్యబ్ 83 ఏళ్లు జీవిస్తే, అమృతా 28 ఏళ్లకే కన్నుమూశారు!ఎందుకింత ‘అమూల్యం’?!పైకి వర్ణాలే. వెలుగు నీడలే. లోపల అవి ఉద్వేగాలు. లోలోతుల్లో హృదయ తరంగాలు. ఎం.ఎఫ్. హుస్సేన్ తన ‘గ్రామ్ యాత్ర’లో గ్రామీణ భారత వైవిధ్య చిత్రాలను లిఖించారు. అది లేఖనం కాదు. ఊపిరి పోయటమే! వంట చెయ్యటం, పిల్లల్ని చూసుకోవటం, గూడుబండిలో ప్రయాణం చెయ్యటం వంటి రోజువారీ గ్రామీణ దృశ్యాలో స్త్రీలను చిత్రించటానికి హుస్సేన్ శక్తిమంతమైన మట్టి రంగులను ఉపయోగించారు. తయ్యబ్ మెహ్తా ‘ట్రస్‌డ్ బుల్’ (కట్టిపడేసిన ఎద్దు) విభజనానంతర కాలంలో ప్రత్యక్షంగా ఆయన చూసిన ఒక భయానక సంఘటనకు ప్రతీకాత్మక చిత్రీకరణ. ‘‘ఆ సమయంలో నేను మొహమ్మద్ అలీ రోడ్డులో (బొంబాయి) నివసిస్తున్నాను. నిరుపేద ముస్లింలు ఉండే ప్రదేశం అది. నేనుండే పైగది కిటికీలోంచి వీధిలో ఒక యువకుడి వధించటం నేను కళ్లారా చూశాను. జన సమూహం అతడిని కొట్టి చంపింది. అతని తలను రాళ్లతో పగలగొట్టింది. బొంబాయిలోని ఒక వధ్యశాలకు ఎద్దులను తీసుకెళే దృశ్యం అప్పుడు నా మదిలో కదలాడింది. వాళ్లు ఆ జంతువును వధించే ముందు తాళ్లతో కాళ్లు కట్టేస్తారు. కొద్దిగానైనా కదలకుండా చేసేస్తారు. ఆ స్థితిలో ఉన్న ఎద్దును నేను ఆనాటి దేశకాల స్థితిని ప్రతిఫలించేలా ట్రస్‌డ్ బుల్గా చిత్రించాను..’’ అని ఆ తర్వాతి కాలంలో అనేక సందర్భాల్లో చెప్పారు తయ్యబ్ మెహ్తా. హుస్సేన్, అమృతా, తయ్యబ్‌ల చిత్రాల తర్వాత ఇప్పటి వరకు ప్రపంచ వేలంలో అత్యంత ఖరీదైన భారతీయ తైలవర్ణ చిత్రాలుగా నిలిచినవి ఎస్.హెచ్.రజా ‘జెస్టేషన్’, వి.ఎస్. గైతోండే ‘అన్టైటిల్డ్’. 2023 సెప్టెంబరులో ముంబైలోని పండోల్ సంస్థ వేలంలో రజా ‘జెస్టేషన్’ రూ.51.7 కోట్లకు, అదే ఏడాది ఏప్రిల్‌లో జరిగిన శాఫ్రాన్ఆర్ట్ వేలంలో గైతోండే ‘అన్టైటిల్డ్’ రూ. 47.5 కోట్లకు అమ్ముడయ్యాయి. రజా 94 ఏళ్ల వయసులో, గైతోండే 77 ఏళ్ల వయసులో తమ అమూల్యమైన చిత్రాలను మానవాళికి కానుకగా ఇచ్చి వెళ్లిపోయారు. అమృతా శేర్ గిల్ పెయింటింగ్ ‘ది స్టోరీ టెల్లర్’ థీమ్ కూడా హుస్సేన్ వేసిన ‘గ్రామ్ యాత్ర’ వంటిదే. అయితే ఆ చిత్రాన్ని ఆమె హుస్సేన్ కంటే ముందే వేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడేళ్లకు హుస్సేన్ ‘గ్రామ్ యాత్ర’ను గీస్తే, దేశానికి స్వాతంత్య్రం రావటానికి పదేళ్ల ముందే అమృతా ‘ది స్టోరీ టెల్లర్’ను గీశారు. రోజువారీ పనులలో నిమగ్నమై ఉన్న గ్రామీణ మహిళల సమూహాన్ని అందులో చిత్రీకరించారు అమృత. ఈస్ట్ అండ్ వెస్ట్ సంస్కృతుల కలయిక ఆమె రంగుల వాడుక. ఎస్.హెచ్. రజా ‘జెస్టేషన్’ వృత్తం కేంద్రబిందువుగా త్రిభుజాలు, చతురస్రాలు, వికర్ణ రేఖలతో కూడి ఉంటుంది. ఐదు దశాబ్దాలు ఫ్రాన్స్‌లో జీవించిన తర్వాత ఆయన తన మాతృభూమికి తిరిగి రావటాన్ని ఆ చిత్రం సూచిస్తుంది. సూక్ష్మార్థంలో – మనిషి తన చరమాంకంలో తిరిగి బిడ్డగా మారి తల్లి కడుపులోకి నిక్షిప్తం కావాలని కాంక్షించటం అందులో కనిపిస్తుంది. ఇక వి.ఎస్. గైతోండే తన ‘అన్టైటిల్డ్’ పెయింటింగ్‌తో కళాత్మక తాత్వికునిగా ప్రసిద్ధి చెందారు. ‘అన్టైటిల్డ్’ శూన్యానికి ఏకవర్ణ ఆకృతిని ఇవ్వటం అంటారు ఆర్ట్ గురించి తెలిసినవాళ్లు. వీక్షకులు ఈ చిత్రంలోని అదృశ్యాన్ని అనుభూతి చెందుతారని కూడా అంటారు. ఎందుకీ చిత్రాలు ఇంత అమూల్యమైనవి అనుకున్నాం కదా. అది చిత్రం విలువ మాత్రమే కాదు, అంతకుమించి, చిత్రానికి రసాస్వాదకులు ఇచ్చే మర్యాద కూడా! ఆ రెండూ కలసి చిత్రం ఖరీదును తరతరాలకూ పెంచుకుంటూ పోతూనే ఉంటాయి.∙సాక్షి, స్పెషల్ డెస్క్ -
రికార్డ్ ధర పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్, రూ.118 కోట్లు
ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. 1950ల నాటి ఈ లెజెండరీ ఆర్టిస్టు మోడ్రన్ ఆర్ట్‌కు పెట్టింది పేరు.మార్చి 19న న్యూయార్క్‌లో జరిగిన క్రిస్టీ వేలంలో గతంతో పోలిస్తే రెట్టింపు ధర పలికింది. 2023లో ముంబైలో జరిగిన వేలంలో దాదాపు రూ.61.8 కోట్లు పలికిన పెయింటింగ్ పోలిస్తే 13.8 మిలియన్ల డాలర్లకు (రూ.118 కోట్లకు పైగా) ధర పలికింది. ఇది అత్యంత ఖరీదైన వేలంగా సరి కొత్త రికార్డును సృష్టించింది.గతంలో రికార్డు సృష్టించిన అమృతా షేర్-గిల్ 1937 నాటి "ది స్టోరీ టెల్లర్" పెయింటింగ్ కంటే హుస్సేన్ ఆర్ట్ దాదాపు రెట్టింపు ధర సాధించింది. గతంలో, హుస్సేన్ అత్యంత ఖరీదైన పెయింటింగ్, అన్టైటిల్డ్ (పునర్జన్మ) గత సంవత్సరం లండన్‌సుమారు రూ. 25.7 కోట్లకు అమ్ముడైంది. ఒకే కాన్వాస్‌లో దాదాపు 14 అడుగుల విస్తీర్ణంలో 13 ప్రత్యేకమైన చిత్రాలతో'గ్రామ తీర్థయాత్ర' పెయింటింగ్‌ను తీర్చిదిద్దారు హుస్సేన్. హుస్సేన్ పెయింటింగ్స్‌లో దీన్ని ప్రముఖంగా పేర్కొంటారు. దీనిపై క్రిస్టీస్ సౌత్ ఆసియన్ మోడరన్ అండ్ కాంటెంపరరీ ఆర్ట్ హెడ్ నిషాద్ అవారి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన పనితనానికి కొత్త బెంచ్‌మార్క్ విలువను నిర్ణయించడంలో తాము భాగం కావడం ఆనందదాయకమన్నారు. ఇదొక మైలురాయి అని ప్రకటించారు.1954లో భారతదేశాన్ని వదిలి వెళ్ళిందీ ఈ పెయింటింగ్. ఉక్రెయిన్‌లో జన్మించిన నార్వేకు చెందిన వైద్యుడు లియోన్ ఎలియాస్ వోలోడార్స్కీ దీనిని కొనుగోలు చేశారు. ఎలియాస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కోసం థొరాసిక్ సర్జరీ శిక్షణా కేంద్రాన్ని ఢిల్లీలో స్థాపించారు. వోలోడార్స్కీ 1964లో దీన్ని ఓస్లో యూనివర్సిటీ హాస్పిటల్‌కు అప్పగించారు. ఈ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం సంస్థలో భవిష్యత్ తరాల వైద్యుల శిక్షణకు తోడ్పడుతుంది.కాగా 1915 సెప్టెంబర్ 17న మహారాష్ట్రలోని పంధర్పూర్లో జన్మించారు హుస్సేన్. ఇండియాలో టాప్ ఆర్టిస్ట్‌గా పేరు సాధించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన కళాకృతులు ఆదరణ సంపాదించాయి. అయితే దేవుళ్ళు , దేవతలపై వేసిన చిత్రాలు వివాదాన్ని రేపాయి. కేసులు, హత్యా బెదిరింపుల నేపథ్యంలో విదేశాల్లో తలదాచుకున్నాడు. 2011 జూన్ 9న 95 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. -
భవిష్యత్తులో ఉచిత వైద్య కార్యక్రమాలు
ప్రముఖ భారతీయ కళలలను సేకరించే వ్యక్తిగా, దాతగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్మన్ శివ్‌నాడార్ సతీమణి కిరణ్ నాడార్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా ఆమె ఎంఎఫ్ హుస్సేన్ ఐకానిక్ పెయింటింగ్ ‘అన్ టైటిల్డ్ (గ్రామ్ యాత్ర)’ను 13.8 మిలియన్ డాలర్ల(సుమారు రూ.120 కోట్లు)కు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. ఇది ఆధునిక భారతీయ కళ కొనుగోలులో కొత్త రికార్డును నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సమకాలీన కళకు పెరుగుతున్న విలువను, గుర్తింపును నొక్కి చెబుతుంది. భారతదేశ కళాత్మక వారసత్వాన్ని పరిరక్షించడంపై ఉన్న ఆసక్తిని తెలియజేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.దేశంలోని అత్యంత ప్రసిద్ధ ఆధునిక చిత్రకారుల్లో ఎంఎఫ్ హుస్సేన్‌కు అరుదైన గౌరవం ఉంది. ఆయన గ్రామీణ భారతదేశం సారాన్ని ‘అన్టైటిల్డ్ (గ్రామ్ యాత్ర)’లో చిత్రీకరించారు. ఈ పెయింటింగ్‌లో ఉపయోగించిన రంగులు, బోల్డ్ స్ట్రోక్స్, సంక్లిష్టమైన కథా దృశ్యాలు ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయని కొందరు తెలియజేస్తున్నారు. కిరణ్ నాడార్ ఈ కళాఖండాన్ని తాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (కేఎన్ఎంఏ)లో ఉంచనున్నారు. ఇప్పటికే ఈ మ్యూజియంలో దాదాపు 7,000 కళాకృతులను భద్రపరిచారు. భవిష్యత్తులో దీని అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉచితంగా వైద్య శిక్షణ కార్యక్రమాలకు ఖర్చు చేస్తానని కిరణ్ తెలిపారు. కళల సంరక్షణకు కిరణ్ నాడార్ చేస్తున్న కృషిని చాలామంది అభినందిస్తున్నారు.ఇదీ చదవండి: వంటలో రారాజులు.. సంపదలో కింగ్లుబ్రిడ్జ్ ప్లేయర్‌గా గుర్తింపు..కిరణ్ నాడార్ దాతగానే కాకుండా బ్రిడ్జ్ ప్లేయర్‌గా గుర్తింపు పొందారు. ఈ విభాగంలో అంతర్జాతీయ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 2018 ఆసియా క్రీడల్లో కాంస్యంతో సహా వివిధ పోటీల్లో పతకాలు గెలుచుకున్నారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలోని శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా అనేక దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. -
ప్రియాంక.. పెయింటింగ్... రూ.2 కోట్లు
ముంబై: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా దగ్గరున్న ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను యెస్ బ్యాంకు సహ వ్యవస్థాపకుడు రాణాకపూర్‌తో బలవంతంగా రూ.2 కోట్లకు కొనిపించారన్న వార్తలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వీటిని కాంగ్రెస్ ఆదివారం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు ఆశ్చర్యకరమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మీడియాతో అన్నారు. ‘‘ఆర్థిక కుంభకోణంలో చిక్కిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం? అలాంటి వ్యక్తి ఆరోపణలను కూడా కేంద్రం ఉత్సాహంగా ప్రోత్సహిస్తోందంటే కచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసమే. ఇది రాజకీయ కక్షపూరిత చర్యే’’ అంటూ ధ్వజమెత్తారు. ఆరోపణలకు మద్దతుగా ఇప్పుడు జీవించి లేని అహ్మద్ పటేల్, మురళీ దేవరా పేర్లను తెలివిగా వాడుకున్నారని దుయ్యబట్టారు. ఈడీకి రాణా చెప్పింది ఇదీ... రూ.5,000 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జిషీటులో రాణాకపూర్ సంచలన ఆరోపణలే చేశారు. ప్రియాంక గాంధీ దగ్గరున్న ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను రూ.2 కోట్లకు కొనాలంటూ కాంగ్రెస్ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చిందన్నారు. ‘‘నాకస్సలు ఇష్టం లేకపోయినా అప్పటి కేంద్ర మంత్రి మురళీ దేవరా తదితరుల ఒత్తడి వల్ల కొనక తప్పలేదు. పెయింటింగ్ కొనకుంటే కాంగ్రెస్‌తో సంబంధాలు బాగుండబోవని దేవరా నన్ను పిలిచి మరీ హెచ్చరించారు. నాకు పద్మభూషణ్ అవార్డు కూడా రాదన్నారు. వాళ్ల ఒత్తిడి వల్లే రూ.2 కోట్లకు పెయింటింగ్‌ను కొన్నా. ఆ డబ్బుల్ని కాంగ్రెస్ చీఫ్‌సోనియాగాంధీకి న్యూయార్క్‌లో జరిగిన చికిత్స కోసం వాడినట్టు సోనియా ఆంతరంగికుడు అహ్మద్ పటేల్ తర్వాత నాకు స్వయంగా చెప్పారు’’ అని వెల్లడించారు. ప్రియాంకకు రాణా చెల్లించిన రూ.2 కోట్లు కూడా కుంభకోణం తాలూకు మొత్తమేనని ఈడీ భావిస్తోంది. ఈ కుంభకోణంలో రాణాకపూర్ తదితరులను 2020లో ఈడీ అరెస్టు చేసింది. ఈ ఉదంతంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘కాంగ్రెస్, గాంధీ కుటుంబం దోపిడి దారులు. వారి హయాంలో చివరికి పద్మ పురస్కారాలను కూడా అమ్ముకున్నారు’’ అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఎద్దేవా చేశారు. -
ఉనికి కోల్పోనున్న ఎంఎఫ్ హుస్సేన్ కళాసౌధం
ప్రస్తుతం కూల్చివేస్తున్న ‘సినిమా ఘర్’ ఎంఎఫ్ హుస్సేన్ కలల సౌధం. ఈ భవనంలోని పోర్టికోలో కూర్చుని తన విటేజ్ కారును చూస్తూ కాఫీ తాగడం ఆ ప్రసిద్ధ చిత్రకారుడికిఅలవాటు. తన మనసుకు కష్టం కలిగినా.. ఆనందం వచ్చినా ఇక్కడే గడిపేవారు. ఎన్నో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చిత్రాలను ఆయన ఇక్కడే గీసారు. ఈ ప్రాంతంలో ఈ భవనం ఓ ల్యాండ్ మార్క్‌గా ఉండేది. ఇక్కడే ఓ బస్టాప్ సైతం చాన్నాళ్లు కొనసాగింది. సినిమా ఘర్కూల్చివేతతో ఇప్పుడు ఇవన్నీకనుమరుగు కానున్నాయి బంజారాహిల్స్: తన కుంచెతో అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్ది పేరు, ప్రతిష్టలతో పాటు వివాదాలను సైతం మూటగట్టుకున్న ‘ఇండియన్ పికాసో’గా సుప్రసిద్ధుడైన భారతీయ చిత్రకారుడు మగ్బూల్ ఫిదా హుస్సేన్(ఎంఎఫ్ హుస్సేన్) కళాసౌధం ‘సినిమా ఘర్’ కూలిపోతోంది. హుస్సేన్ 1999లో బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ప్రధాన రహదారిలో ఈ కట్టడాన్ని నిర్మించారు. ఆనాడు ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీదీక్షిత్ ఈ సినిమాఘర్ను ప్రారంభించారు. పర్షియన్ శిల్పకళా నైపుణ్యంతో ప్రత్యేకమైన గోడలు, అందంతో పాటు ఆకర్షణీయమైన మార్బుల్‌తో చూడగానే వినూత్నంగా కనిపించేలా ‘సినిమాఘర్’ను తీర్చిదిద్దారు. లోపల ఇంద్రధనస్సులోని అన్ని రంగులతో గోడలను మలిచారు. ఎన్నోసార్లు ఎంఎఫ్ హుస్సేన్ ఇక్కడ చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సినిమాఘర్‌లో 50 సీటింగ్ కెపాసిటీతో ‘సౌందర్య టాకీస్’ పేరుతో మినీ థియేటర్ ఏర్పాటు చేశారు. అలాగే సినిమా, డ్యాన్స్, ఆర్ట్, మ్యూజిక్, కంప్యూటర్, సైన్స్, టెక్నాలజీకి సంబంధించిన 2 వేల పుస్తకాలతో ‘ప్యారిస్ సూట్’ పేరుతో లైబ్రరీ కూడా ఏర్పాటైంది. ఇక సినిమా మ్యూజియం ప్రత్యేక ఆకర్షణ. ఎంఎఫ్ హుస్సేన్ వేసిన పెయింటింగ్స్‌ను ప్రదర్శించేందుకు ఓ ఎగ్జిబిషన్ హాలు కూడా సుందరంగా నిర్మించారు. హైదరాబాద్ అంటే అమితంగా ఇష్టపడే ఎంఎఫ్ హుస్సేన్ దేÔశంలో ఎన్నోచోట్ల సినిమాఘర్ నిర్మాణానికి అవకాశాలు వచ్చినా ఇక్కడ మాత్రమే ఆ కోరిక తీర్చుకున్నారు. విదేశాల్లో ఉండే ఆయన స్వదేశానికి తిరిగివచ్చి సినిమాఘర్లోనే చివరి మజిలీని గడపాలనుకునేవారు. తనకు మనసు బాగాలేనప్పుడు సినిమాఘర్‌లో కాసేపు కూర్చోవడం ద్వారా మనసు తేలికపడుతుందని హుస్సేన్ బతికుండగా భావించేవారు. నెలలో వారం రోజులు ఇక్కడే ఒంటరిగా గడిపేవారాయన. ఎన్నో కళాత్మక పెయింటింగ్స్‌ను ఇక్కడ ఉండగానే గీశారు. 2002లో ఏడాది పాటు సినిమాఘర్ మూతపడ్డప్పుడు కళాభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో 2004, జనవరి 26వ తేదీన దీన్ని తిరిగి తెరిచారు. ఆ సమయంలో ఎంఎఫ్ హుస్సేన్ చివరిసారిగా హైదరాబాద్‌కు వచ్చారు. చిత్రకారుడిగా ఘనకీర్తి పొందిన హుస్సేన్ కొన్ని వివాదాలతో ప్రాణభీతి కారణంగా 2007లో లండన్ వెళ్లిపోయి ఇక తిరిగి రాలేదు. ఎంఎఫ్ హుస్సేన్ నెలరోజుల సుదీర్ఘ అస్వస్థతతో 2011, జూన్ 9వ తేదీన లండన్‌లో తన 95 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. దాంతో తన చివరి మజిలీని నగరంలోని సినిమా ఘర్‌లో గడపాలని భావించినా ఆయన కోరిక మాత్రం తీరలేదు. సినిమాఘర్ స్థానంలోవాణిజ్య సముదాయం ఎంఎఫ్ హుస్సేన్ మరణానంతరం సినిమాఘర్ ఘనకీర్తి మెల్లమెల్లగా కనుమరుగవడం మొదలైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, నలుగురు కొడుకులు సంతానం. సినిమాఘర్ ప్రాపర్టీని ఇద్దరు కూతుళ్లు రైసా హుస్సేన్, అఖిలా హుస్సేన్‌తో పాటు చిన్నకొడుకు ఒవైసీ హుస్సేన్‌కు రాసిచ్చారు. వీరంతా ముంబై, దుబాయ్‌లో స్థిరపడ్డారు. తండ్రి మరణానంతరం ఇందులోని ఒక్కో కళాఖండాలను ఆయన సంతానం ముంబైకి తరలించారు. దీంతో ఇప్పుడు ఈ భవనం పూర్తిగా ఖాళీ అయిపోయింది. తండ్రి జ్ఞాపకార్థం ఉంచుకోవాల్సిన ఈ కళాక్షేత్రాన్ని.. తమకు ఇ భవనం అవసరం లేదని ఇటీవల సంజయ్ గుప్తా అనే వ్యాపారికి విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తి ఈ కళా సౌధాన్ని కూల్చివేసి ఓ వాణిజ్య భవనాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో ఒకప్పుడు కళాభిమానులను రంజింపజేసిన సినిమాఘర్ ఇక తన ఉనికిని కోల్పోయినట్టే. ఎంఎఫ్ హుస్సేన్ గీచిన చిత్రాలు గుండెల్లోని భావోధ్వేగాలను తట్టి లేపుతాయని అభిమానులు చెబుతుంటారు. అలాంటి సినిమాఘర్ ఇక లేదన్న విషయాన్ని కళాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కట్టడం కూల్చివేత ప్రక్రియ మొదలైంది. మరికొద్ది రోజుల్లో కట్టడం పూర్తిగా కనుమరుగు కానుంది. -
ప్రముఖ చిత్రకారుడు శంషాద్ హుస్సేన్ ఇక లేరు
లివర్ క్యాన్సర్‌తో ఢిల్లీలో కన్నుమూత సాక్షి, హైదరాబాద్: ప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ పెద్ద కుమారుడు, ప్రముఖ కళాకారుడు శంషాద్ హుస్సేన్(70) శనివారంరాత్రి ఢిల్లీలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కళాప్రదర్శన లు నిర్వహించారు. లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి ఫైన్ ఆర్ట్స్ పట్టా పొందిన శంషాద్... హైదరాబాద్‌లోనూ పదేళ్లు తన కళను కొనసాగించారు. చిత్రాల్లో పలురకాల మనస్తత్వాలను ప్రతిబింబించారు. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ దిగ్భ్రాంతి... శంషాద్ మృతిపట్ల ‘హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ’ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయనకు హైదరాబాద్‌తోనూ విడదీయలేని అనుబంధం ఉందని సొసైటీ అధ్యక్షుడు రమణారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1980ల్లో లక్ష్మాగౌడ్, సూర్యప్రకాశ్, తోట వైకుంఠం వంటి ప్రసిద్ధ చిత్రకారులతో శంషాద్ కలసి పనిచేశారని గుర్తు చేసుకున్నారు. -
కాళ్లతో పరీక్షలు రాసి టెన్త్‌లో 54%
ఠాణే: అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నా పనులు చేసుకోవడానికి మరొకరి సాయం అవసరమవుతున్న ఈ రోజుల్లో పుట్టుకతోనే చేతులు లేని ఆ బాలుడు కాళ్లతో పరీక్షలు రాసి టెన్త్‌లో 54 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. జిల్లాలోని నందోరి గ్రామంలో ఉన్న గిరిజన కుటుంబంలో పుట్టిన వసంత్ రావుత్ ఈ ఫీట్ సాధించి అందరి మన్ననలను పొందుతున్నాడు. ఈ సందర్భంగా స్థానిక జీవన్ వికాస్ పాఠశాల విద్యార్థి అయిన రావుత్ మీడియాతో మాట్లాడుతూ..‘ ఎంఎఫ్ హుస్సేన్ సాబ్ అంత పెద్ద ఆర్టిస్ట్‌ను కావాలనేది నా జీవితాశయం. ఇంటర్ పూర్తికాగానే ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో సీటు సంపాదించేందుకు కృషిచేస్తా. పుట్టుకనుంచి చేతులు లేకపోవడంతో కాళ్లతోనే రాయడం నేర్చుకున్నా. టెన్త్‌లోనూ నా పరీక్షలు రాయడానికి వేరే ఎవరినైనా పెట్టుకోమని మా సార్లు నాకు సలహాఇచ్చారు. అయితే నాపై నాకున్న నమ్మకమే నేను టెన్త్ 54 శాతంతో పాసయ్యేలా చేసింది. నిజానికి ఈసారి టెన్త్ పాసవ్వనేమోననే అనుమానముండేది. కంప్యూటర్ సబ్జెక్ట్ అంటే నాకు చాలా భయముండేది. అయితే మా కంప్యూటర్ సార్ నాకు సబ్జెక్ట్‌పై భయం పోగొట్టడంతో పరీక్ష బాగా రాశాను. అలాగే చిత్రలేఖనంపై నా ఆసక్తిని గమనించి మా ఆర్ట్స్ టీచర్ నాపై ప్రత్యేక శ్రద్ధ చూపించి కాలితో బొమ్మలు ఎలా వేయాలో నేర్పించారు. రోజూ నేను స్కూలుకు వచ్చేందుకు నా స్నేహితుడు జయంత్ దుమాడే చాలా సహకరించాడు. మేం ఇద్దరం పాఠశాల మంజూరు చేసిన ఆటో రిక్షాలో రోజూ స్కూల్‌కు వస్తుండేవాళ్లమ’ని చెప్పాడు.ఎంఎఫ్ హుస్సేన్ అంతటి చిత్రకారుడిని కావాలనేది తన చిరకాల వాంఛ అని ముక్తాయించాడు.