Randeep Singh Surjewala
-
‘ఇండియా’ కూటమి బహిరంగ సభ వాయిదా
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అక్టోబర్‌లో నిర్వహించ తలపెట్టిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ వాయిదా పడింది. మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ శనివారం ఈ విషయం ప్రకటించారు. బహిరంగ సభ ఎప్పుడు నిర్వహించాలన్నది ఇంకా నిర్ణయించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా చెప్పారు. భోపాల్‌లో ఉమ్మడిగా భారీ సభ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని ఇండియా కూటమి పక్షాలు ఇటీవలే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. -
‘ఆధార్–ఓటర్ ఐడీ లింక్’పై హైకోర్టుకు వెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్– ఓటరుకార్డు అనుసంధానంపై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలాకు సుప్రీంకోర్టు సూచించింది. గతేడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంలో వివాదాస్పద అంశాలున్నాయంటూ సూర్జేవాలా దాఖలు చేసిన పిటిషన్ సోమవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. ఆధార్‌తో ఓటర్ గుర్తింపు కార్డు అనుసంధానంతో పౌరులు కాని వారికి కూడా ఓటు వేసే హక్కు ఉంటుందని పిటిషనర్ పేర్కొన్నారు. విచారణ సందర్భంగా ధర్మాసనం..‘మీరు ఢిల్లీ హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు?’ అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. వచ్చే 6 నెలల్లో మూడు రాష్ట్రాల్లో కీలకమైన ఎన్నికలు జరగనున్నందున తమ పిటిషన్ ఎంతో ముఖ్యమైందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. పలు హైకోర్టుల్లో ప్రొసీడింగ్స్ ఉంటే కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే వాటన్నింటినీ కలిపి ఒకే హైకోర్టుకు బదిలీ చేసే ఆస్కారం ఉందని ధర్మాసనం పేర్కొంది. ‘ఎన్నికల సవరణచట్టం–2021లోని సెక్షన్లు 4, 5ల చెల్లుబాటును పిటిషనర్ సవాల్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో దీనికి సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని పేర్కొన్న ధర్మాసనం, హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛను పిటిషనర్‌కు ఇస్తున్నామని పేర్కొంది. -
చిక్కుల్లో కాంగ్రెస్ నేత.. వీడియో వైరల్
దేశంలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీనీ వీడుతున్నారు. మరోవైపు.. బీజేపీపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్ధలను, ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని అన్నారు. ఈ క్రమంలో మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణాన్ని ప్రస్తావించబోయి పొరపాటున సీతాదేవి పేరును చెప్పడం వివాదాస్పదంగా మారింది. అయితే, రాజ్యాంగ వ్యవస్ధలను నిర్వీర్యం చేస్తూ వాటి ప్రాధాన్యతకు కేంద్రం తూట్లుపొడుస్తోందని సూర్జేవాలా ఆరోపించారు. ఈ క్రమంలో సీతాదేవి వస్త్రాపహరణం తరహాలోనే బీజేపీ ప్రజాస్వామ్య విలువలను ఊడదీయాలని కాషాయ పార్టీ కోరుకుంటోందని రణ్‌దీప్ దుయ్యబట్టారు. బీజేపీ ప్రయత్నాలు ఫలించబోవని, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని ఆయన కామెంట్స్ చేశారు. కాగా, కౌరవ సభలో పాండవుల సమక్షంలో ద్రౌపది వస్త్రాపహరణం గురించి ప్రస్తావించబోయిన సుర్జేవాలా పొరపాటున సీతాదేవీ పేరును పలికారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇక, సూర్జేవాలా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #WATCH | Udaipur, Rajasthan | "..Truth, democracy, law & morals will win. BJP wants to do 'cheer haran' of democracy, just like 'cheer haran' of Goddess Sita. But they'll lose (in RS polls) & their masks will fall off," Congress leader Randeep Surjewala said in a press conference pic.twitter.com/xYXk2N5uJf — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 9, 2022 ఇది కూడా చదవండి: రాజ్యసభ ఎన్నికలు: ఎన్సీపీ నేతలకు షాక్.. -
కాంగ్రెస్‌కు బిగ్ షాకిచ్చిన ప్రశాంత్ కిషోర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బిగ్ షాకిచ్చారు. కాంగ్రెస్‌లో చేరాలంటూ పార్టీ అధిష్టానం అందించిన ఆఫర్‌ను పీకే నిరాకరించారు. తాను పార్టీలో చేరడం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సుర్జేవాలా ధ్రువీకరించారు. పీకే నిర్ణయాన్ని గౌరవిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా కొంతకాలంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు ఇటీవల పీకే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర నాయకులతో భేటీ అవ్వడంతో కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖరారైనట్లేనని అంతా భావించారు. అంతేగాక కాంగ్రెస్‌లో చేరి బాధ్యతలు చేపట్టాలని పీకేను సోనియా గాంధీ ఆహ్వనించారు. ఈ మేరకు పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే సోనియా ప్రతిపాదనను నిర్ధ్వందంగా తిరస్కరించారు. Following a presentation & discussions with Sh. Prashant Kishor, Congress President has constituted a Empowered Action Group 2024 & invited him to join the party as part of the group with defined responsibility. He declined. We appreciate his efforts & suggestion given to party. — Randeep Singh Surjewala (@rssurjewala) April 26, 2022 -
హైదరాబాద్‌కు కాంగ్రెస్ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ కమిటీ సభ్యుడు రణదీప్‌సింగ్ సూర్జేవాలా సోమవారం హైదరాబాద్‌కు వచ్చారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డి.కె.శివకుమార్, ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా విడిగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాయచూర్‌లో జరిగే ఓ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి వెళ్తూ ఈ ముగ్గురు మార్గమధ్యలో హైదరాబాద్‌లో బసచేశారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, కర్ణాటక కాంగ్రెస్ సహ ఇన్చార్జి మధుయాష్కీగౌడ్ నివాసానికి వెళ్లిన వీరు కొంతసేపు అక్కడ విశ్రాంతి తీసుకుని రాయచూర్‌కు వెళ్లారు. వీరిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. -
బెడ్రూం, వాష్‌రూంపై కూడా మోదీ సర్కార్ నిఘా: కాంగ్రెస్ ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: పెగాసెస్ ట్యాపింగ్ కుంభకోణంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ బీజేపీ సర్కార్‌పై విరుచుకుపడింది. రాజ్యాంగ కార్యనిర్వాహకులు, కేంద్ర మంత్రులు, సీనియర్ ప్రతిపక్ష నాయకులు, న్యాయ మూర్తులు, జర్నలిస్టులు, ఇతరుల సెల్ఫోన్లను అక్రమంగా హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తా కథనాలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఘాటుగా స్పందించారు. ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్వేర్ పెగాసస్ ద్వారా మోదీ ప్రభుత్వం ఇక బెడ్ రూం సంభాషణలుకూడా వింటుందని ఆరోపించారు. బీజేపీ స్నూపింగ్‌కు పెట్టింది పేరనీ, అది భారతీయ జాసూసీ పార్టీ అంటూ విమర్శించారు. జాతీయ భద్రతను పణంగా పెట్టి విదేశీ కంపెనీకి డేటాను అప్పగించడమంటే కచ్చితంగా ఇది రాజద్రోహమే అని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పదవినుంచి తొలగించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. స్పైవేర్ పనితీరును, మన ఫోన్లను ఎలా ప్రభావితం చేస్తుందో లాంటి వివరాలపై కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా సోమవారం స్పందించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ తోపాటు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సెక్యూరిటీ కీలక అధికారులు, చివరికి మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా ఫోన్లపై కూడా నిఘా పెట్టడం సిగ్గు చేటన్నారు. అంతేకాదు ఇక మన కుమార్తె లేదా భార్య ఫోన్లను పెగాసస్ ద్వారా ట్యాప్ చేస్తుందన్నారు. వాష్రూమ్లోఉన్నా..పడకగదిలో ఉన్నా, మీ భార్యతోను, కుమార్తెతోనో మాట్లాడుతూ ఉన్నా.. ఆసంభాషణపై కూడా మోదీ ప్రభుత్వం నిఘా పెట్టగలదని సుర్జేవాలా విలేకరుల సమావేశంలో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇజ్రాయెల్‌లోని ఎన్ఎస్ఓ గ్రూపుకు చెందిన ‘పెగసస్’ అనే స్పైవేర్ టెర్రరిస్టు కార్యకలాపాలు, ఇతర నిఘా కార్యకలాపాల కోసం ఎన్ఎస్ఓ గ్రూప్ ప్రభుత్వ సంస్థలకు విక్రయిస్తుందని,ఇపుడువీరందరినీ టెర్రరిస్టులుగా భావిస్తున్నారా మండిపడ్డారు. అటు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాకూడాపెగాసస్ వ్యవహారంపై ట్విటర్ ద్వారా విమర్శలు గుప్పించారు.పెగసస్ నిఘా చాలా దారుణమన్నారు. రాజ్యాంగబద్ధంగా భారతీయ పౌరులకు ప్రాథమిక హక్కుగా లభించిన గోప్యతా హ్యక్కుపై మోదీ సర్కార్ తీవ్రమైన దాడిని ప్రారంభించినట్లు కనిపిస్తోందన్నారు. ఇది ప్రజల స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి తీరని అవమానమని ట్వీట్ చేశారు. కాగా ఫోన్ల ట్యాపింగ్ విషయాన్ని కేంద్రం తోసిపుచ్చింది. అటు స్పైవేర్ పెగాసస్ ద్వారా ప్రముఖుల ఫోన్లపై నిఘా వార్తలను ఎన్ఎస్ఓ గ్రూప్ కూడా తోసిపుచ్చింది.నిరాధార ఆరోపణలను చేసినందు వల్ల తాము పరువు నష్టం దావా వేయనునున్నట్టు వెల్లడించింది. पेगासस के जरिए जासूसी से जुड़े खुलासे बहुत ही घिनौनी कारगुजारियों की तरफ इशारा करते हैं। अगर ये सच है, तो मोदी सरकार संविधान द्वारा देशवासियों को दिए गए निजता के अधिकार पर गंभीर और खतरनाक हमला कर रही है। इससे लोकतंत्र तो नष्ट होगा ही, ये देशवासियों.. #Pegasus 1/2 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 19, 2021 -
రాఫెల్ ఒప్పందంపై మళ్లీ మొదలైన రగడ..
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ద విమానాలపై రగడ మళ్లీ మొదలైంది. రాఫెల్ ఒప్పందంపై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ (జెపిసి) దర్యాప్తు చేయాలని ఆయన కాంగ్రెస్ పార్టీ శనివారం డిమాండ్ చేసింది. 59 వేల కోట్ల విలువైన 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం 2106లో భారత్–ఫ్రాన్స్ ఒప్పందం మధ్య కుదిరింది. ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంలో అవినీతి బాహాటంగా బయటపడిందన్నారు. రిలయన్స్-డసాల్ట్ డీల్‌లో అన్ని సాక్ష్యాధారాలను ఫ్రెంచ్ వెబ్సైట్ ‘మీడియాపార్ట్’ బయటపెట్టిందన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు ఇక జేపీసీ దర్యాప్తునకు అనుమతిస్తారా? అని ప్రశ్నించారు. తాజా నివేదికల ఆధారంగా ఫ్రాన్స్ జాతీయ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్ కార్యాలయం జ్యుడిషియల్ దర్యాప్తుకు ఆదేశించినట్లు మీడియాపార్ట్ తెలిపింది. ఇన్ఫ్రా, డసాల్ట్ ఏవియేషన్ కలిసి డసాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ (డీఆర్ఏఎల్) అనే జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేశాయని, దీనికి సంబంధించిన ఒప్పందం వివరాలన్నిటినీ ఈ వెబ్సైట్ వెల్లడించిందని తెలిపారు. ఈ అంశాలను అప్పటి ఫ్రెంచ్ ప్రధాన మంత్రి ఫ్రాంకోయీస్ హొల్లాండ్ స్టేట్మెంట్ బలపరుస్తోందని తెలిపారు. డసాల్ట్ ఇండస్ట్రియల్ పార్టనర్‌గా రిలయన్స్‌ను నియమించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుందని హొల్లాండ్ చెప్పారన్నారు. ఈ విషయంలో ఫ్రాన్స్‌కు ఎటువంటి అవకాశం లేదని చెప్పారన్నారు. -
‘అసంతృప్త నేతలపై చర్యలు లేవు’
సాక్షి, న్యూఢిల్లీ : పార్టీలో సంస్ధాగత అంశాలను పరిశీలించి పరిష్కరిస్తామని, పార్టీ పునర్నిర్మాణం నిరంతరం కొనసాగే ప్రక్రియని సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ చీఫ్ సోనియా గాంధీ స్పష్టం చేశారని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా పేర్కొన్నారు. సోమవారం సుదీర్ఘంగా సాగిన సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ నేతలెవరిపైనా ఎలాంటి చర్యలూ ఉండవనీ, వారంతా తమ కుటుంబంలో భాగమని సోనియా వెల్లడించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద కుటుంబమని, పలు సందర్భాల్లో ఎన్నో విభేదాలు ఎదురైనా చివరికి తామంతా ఒక్కటిగా నిలిచామని సమావేశం చివరిలో సోనియా పేర్కొన్నారని సుర్జీవాలా చెప్పారు. దేశంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ప్రస్తుతం పార్టీ శ్రేణుల ముందున్నదని ఆమె చెప్పారని అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ కొనసాగుతారని పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. నూతన అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యే వరకూ ఆమె మరికొన్ని నెలల పాటు పదవిలో కొనసాగుతారని వెల్లడించారు. పార్టీ తాత్కాలిక చీఫ్‌గా సోనియానే కొనసాగాలని పార్టీ నేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని అన్నారు. మరోవైపు సీడబ్ల్యూసీ భేటీలో సోనియా గాంధీ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించగానే రాహుల్ సీనియర్ నేతల తీరును తప్పుపట్టారు.బీజేపీతో కలిసి కుట్రపూరితంగానే పార్టీ ప్రక్షాళన కోరుతూ సోనియాకు లేఖ రాశారని సీనియర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీతో సంబంధాలను నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు. ఇక సీనియర్ నేతలను అనునయించేందుకు వారిపై తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని రాహుల్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. చదవండి : సోనియా రాజీనామా : సీడబ్ల్యూసీ భేటీలో ట్విస్ట్ -
‘ఆయన బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పుతో పాటు సంస్ధాగత ఎన్నికల్లో పారదర్శకత కోరుతూ దాదాపు 100 మంది పార్టీ నేతలు తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారని పేర్కొన్న సంజయ్ ఝాపై ఆ పార్టీ వేటువేసింది. పార్టీ నుంచి సంజయ్ ఝాను సస్సెండ్ చేసిన అనంతరం ఆయన బీజేపీ ఆదేశాలతో వదంతులు వ్యాప్తి చేస్తున్నారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. సంజయ్ ఝా చెబుతున్నట్టు పార్టీ అధ్యక్షురాలికి అలాంటి లేఖను ఎవరూ రాయలేదని స్పష్టం చేసింది. సంజయ్ తమ పార్టీ సభ్యుడు కాదని, ఫేస్బుక్-బీజేపీ సంబంధాల నుంచి దేశం దృష్టిని మరల్చేందుకే ఆయన బీజేపీ ఆదేశాలతో వదంతులను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించింది. సోనియా గాంధీకి 100 మంది కాంగ్రెస్ నేతలు లేఖ రాశారనే వార్తలను ఆ పార్టీ నేతలు ఎవరూ ధ్రువీకరించలేదు. కాగా పార్టీలో నాయకత్వ మార్పును కోరడంతో పాటు పార్టీ సంస్ధాగత ఎన్నికల్లో పారదర్శకతను కోరుతూ చట్టసభ సభ్యులు సహా దాదాపు 100 మంది పార్టీ నేతలు సోనియా గాంధీకి లేఖరాశారని సంజయ్ ఝా పేర్కొనడం కలకలం రేపింది. సోనియాను ఆశ్రయించిన నేతలంతా పార్టీ దుస్థితిపై కలత చెందారని సంజయ్ వ్యాఖ్యానించారు. కాగా ఫేస్బుక్-బీజేపీ సంబంధాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ నేతలు వాట్సాప్ గ్రూప్‌ల్లో ఇలాంటివి ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా ఆరోపించారు. మరోవైపు బీజేపీకి ఫేస్బుక్ వత్తాసు పలుకుతోందని, సోషల్ మీడియా వేదికగా విద్వేష ప్రచారం, సందేశాలను పోస్ట్ చేసేందుకు బీజేపీ నేతలను ఎఫ్బీ అనుమతిస్తోందన్న వాల్‌స్ర్టీట్ జర్నల్ కథనం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎఫ్బీ, వాట్సాప్‌లను బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు ఆరోపించారు. చదవండి : ప్రజాస్వామ్యానికి పరీక్షా సమయం -
చైనా పేరెత్తడానికి భయమెందుకు?
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్న చైనా పేరును ఎత్తడానికి పాలకులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ ఘాటు విమర్శలు చేసింది. భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనా బలగాలను వెనక్కి పంపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేసింది. దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని పేర్కొంది. అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ తీసుకున్న నిర్ణయాలపై దేశమంతా ఏకతాటిపైకి వచ్చి పాలకులను ప్రశ్నించాలని పిలుపునిచ్చింది. ప్రజల స్వేచ్చా, స్వాతంత్ర్యాలను హరిస్తున్న వాళ్లపై ఒక్కటిగా పోరాడటమే నిజమైన జాతీయవాదం అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాల శనివారం నరేంద్ర మోదీ సర్కారు తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని చైనా పేరును ప్రస్తావించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.(ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన మోదీ) కాగా 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ.. ‘‘ భారత ఆర్మీ, పారా మిలిటరీ, పోలీసు బలగాల సేవల పట్ల మనమంతా గర్వపడుతున్నాం. శత్రువుల దాడి నుంచి ఎల్లవేళలా మనల్ని కాపాడుతూ రక్షణగా నిలుస్తున్నందున 130 కోట్ల మంది భారతీయులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారిని తలచుకుని గర్విస్తున్నారు. కానీ మన పాలకులు మాత్రం ఎందుకో చైనా పేరును ఎత్తడానికి చాలా భయపడుతున్నారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించిన విషయాన్ని దాచిపెడుతున్నారు. దీని గురించి మనమంతా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. (కనీస వివాహ వయస్సు నిర్ధారణకై కమిటీ) అదే విధంగా ఆత్మనిర్భర్ గురించి ప్రసంగాలు చేస్తున్న వారు, దానికి పునాది వేసింది పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభబాయ్ పటేల్ సహా స్వాతంత్ర్య సమరయోధులు అని గుర్తు పెట్టుకోవాలి. రైల్వే, ఎయిర్‌పోర్టులు వంటి 32 ప్రభుత్వ రంగ సంస్థలను ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారో మనం సర్కారును నిలదీయాలి. ఎల్ఐసీ, ఎఫ్‌సీఐని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారో ప్రశ్నించాలి. స్వేచ్ఛను హరిస్తున్న వారిపై పోరాటానికి సిద్ధం కావాలి’’ అంటూ మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. కాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గైర్హాజరు కారణంగా సీనియర్ నేత ఏకే ఆంటోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాహుల్ గాంధీ, సూర్జేవాల తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న శత్రుదేశ సైన్యాలకు భారత జవాన్లు దీటుగా జవాబిస్తున్నారని, వారి త్యాగఫలితంగానే మనమంతా సురక్షితంగా ఉన్నామని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే. -
చైనాపై మోదీ ట్వీట్; ‘సమాధానం చెప్పాల్సిందే’
న్యూఢిల్లీ : గతంలో చైనాపై మోదీ చేసిన ట్వీట్‌ను గుర్తు చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశిథరూర్, రణదీప్ సింగ్ సుర్జేవాలా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. అప్పటి కేంద్రాన్ని ఉద్ధేశిస్తూ మోదీ స్వయంగా చేసిన తన ట్వీట్‌పై ప్రస్తుతం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా 2013లో చైనా-భారత్ బలగాలను ఉద్ధేశించి గుజరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ఓ ట్వీట్ చేశారు. ‘లడఖ్ నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించుకుంది. కానీ తమ సొంత భూభాగం నుంచి భారత బలగాలు ఎందుకు వైదొలుగుతున్నాయి. మనం ఎందుకు వెనక్కి తగ్గాము’. అని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. (సీఎం నివాసాన్ని తాకిన కరోనా) ఈ ట్వీట్ ప్రస్తుతం సరిహద్దుల్లో గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతకు దగ్గరగా ఉంది. గల్వన్ లోయ వద్ద పెట్రోలింగ్ పాయింట్స్ ప్రాంతంలో ఇరు దేశ సైన్యాలు తాత్కాలిక నిర్మాణాలు నిలిపివేసి, వెనక్కు వెళ్లేందుకు ఇరు వర్గాలు అంగీకరించినట్లు అధికార వర్గాలు ఆధివారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల ముఖ్య నేతల మధ్య జరిగిన ఒప్పందం మేరకు తమ బలగాలను వెనక్కి పిలిపించాయి. ఈ క్రమంలో ఒకప్పటి మోదీ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు చర్చకు దారీతీశారు. (‘ప్రభుత్వ అసమర్థతకు పోలీసులు బలి’) కాంగ్రెస్ నేత శశి థరూర్.. నరేంద్ర మోదీ2013 ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘మోదీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. ప్రధాని తన ప్రశ్నకు సమాధానం చెప్పాలి’. అని ప్రశ్నించారు. ఇదే క్రమంలో రణదీప్ సుర్జేవాలా కూడా స్పందించారు. ‘ప్రధాని.. మీ మాటలు మీకు గుర్తుందా? ఈ పదాలకు ఏమైనా విలువ ఉందా? భారత బలగాలు తమ భూభాగంలో ఎందుకు ఉపసంహరించుకుంటున్నాయో మీరు చెబుతారా? దేశం సమాధానం కోరుకుంటుంది’. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
‘చైనా అక్కడ బంకర్లు నిర్మించింది’
న్యూఢిల్లీ: గల్వన్ వ్యాలీలో ఈ నెల 15న జరిగిన ఘర్షణల నేపథ్యంలో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ విమర్శల వర్షం కురిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా చైనా చొరబాట్ల విషయంలో బీజేపీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత సోమవారం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనాతో జరిగిన ఘర్షణల గురించి.. యథాతథ స్థితికి సంబంధించి వాస్తవాలను కప్పిపుచ్చడం కోసం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘తప్పుడు సమాచారం, దారి మళ్లించడం, పరధ్యానం’ అనే క్రూరమైన విధానాన్ని తెరమీదకు తీసుకొచ్చారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. (చైనా సరిహద్దుల్లో భారత్ బలగాల ప్రదర్శన) రణ్‌దీప్ సింగ్ మాట్లాడుతూ.. ‘జూన్ 15 నాటి సంఘటనకు సంబంధించి అసలు వాస్తవం ఏంటంటే.. చైనా గల్వాన్ వ్యాలీతో సహా పీపీ-14లో కూడా తీవ్రమైన అతిక్రమణలకు పాల్పడింది. దారుణం ఏంటంటే చైనా పీపీ-14ను తిరిగి స్వాధీనం చేసుకోవడమే కాక అక్కడ పెద్ద సంఖ్యలో గుడారాలు ఇతర నిర్మాణాలు చేపట్టింది’ అన్నారు. అంతేకాక ‘పాంగోంగ్ త్సో సరస్సు ప్రాంతంలో ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 మధ్య భుభాగంలోకి కూడా చైనా దళాలు చొచ్చుకురావడమే కాక అక్కడ భారీ సంఖ్యలో శత్రు నిర్మాణాలు, బంకర్లను నిర్మించాయని తెలిపారు. చైనీస్ చొరబాటు చర్యలు డెప్సాంగ్ మైదానం వరకు విస్తరించాయి’ అన్నారు. ఎల్ఏసీ మీదుగా వై-జంక్షన్ వరకు 18 కిలోమీటర్ల మన భూభాగం (ఈ ప్రాంతాన్నే బాటిల్‌నెక్ అంటారు) వరకు చైనా చొరబాట్లు విస్తరించాయని రణ్‌దీప్ సింగ్ అన్నారు. (డ్రాగన్‌కు చెక్ : రంగంలోకి అమెరికా బలగాలు) లడఖ్‌లోని గల్వాన్ లోయలో చైనాతో ఇటీవల జరిగిన ఘర్షణలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ రోజువారీ దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. చైనా, భారత్ దళాల మధ్య హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకలు సోషల్ మీడియాలో ‘#SpeakUpForOurJawans’ పేరుతో ఆన్లైన్ ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
ప్రధాని మోదీ సోషల్ మీడియా సన్యాసం!
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో అనునిత్యం చురుగ్గా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆదివారం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు సోమవారం వెల్లడించారు. ‘ఈ ఆదివారం నుంచి ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నా’ అని సోమవారం ఆయన సంచలన ట్వీట్ చేశారు. ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారనే వివరాలను ఆయన వెల్లడించలేదు. సంబంధిత వర్గాలను సంప్రదించగా, భవిష్యత్ ప్రణాళిక త్వరలో వెల్లడించే అవకాశముందని తెలిపాయి. మోదీ తాజా నిర్ణయం సంచలనాత్మకంగా మారింది. గంటలో 26వేల సార్లు రీట్వీట్ అయింది. క్షణక్షణానికో కామెంట్ వచ్చింది. నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వివిధ ఎమోజీలతో స్పందించడం ప్రారంభించారు. నిర్ణయం మార్చుకోవాలని కోరుతూ అదే సోషల్ మీడియా కేంద్రంగా ’నో సర్’ అని వేలాదిగా అభ్యర్థనలు వెల్లువెత్తాయి. ‘నో సర్’ ట్రెండవుతున్న హ్యాష్ట్యాగ్గా మారింది. ‘ప్రపంచవ్యాప్తంగా మీ అభిమానులున్నారు. కావాలంటే చిన్న బ్రేక్ తీసుకోండి. కానీ పూర్తిగా వదిలేయవద్దు’ అని ఓ నెటిజన్ అభ్యర్థించారు. ‘నేను మోదీజీ అభిమానిని. ఆయన వదిలేస్తే.. సోషల్ మీడియాను నేనూ వదలేస్తా’ అని మరో యూజర్ హెచ్చరించారు. మరోవైపు, మోదీ ట్వీట్‌పై మీమ్స్ కూడా ప్రారంభమయ్యాయి. బ్లాక్‌బస్టర్ సినిమా ‘3 ఇడియట్స్’ సినిమా సీన్ నేపథ్యంలో ‘జానే నహీ దేంగే తుఝే’ అనే పాటను ప్లే చేస్తూ ఒక మీమ్‌ను రూపొందించారు. విద్వేషం వదలండి: మరోవైపు, విపక్షాల నుంచి కామెంట్స్ కూడా వచ్చాయి. ‘ద్వేషాన్ని విడనాడు.. సోషల్ మీడియాను కాదు’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ప్రధాని మోదీని ట్యాగ్ చేశారు. ‘మీరు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం కాదు.. వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేసే, బెదిరించే, హెచ్చరించే మీ ఆర్మీకి ఈ సలహా ఇవ్వండి– ఇట్లు భారత పౌరులు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జెవాలా వ్యంగ్య ట్వీట్ చేశారు. టాప్ ’సోషల్’ స్టార్: ట్విటర్, ఫేస్‌బుక్‌ల్లో మోదీ చాలా చురుగ్గా ఉంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఈ విషయాన్ని ఇటీవల ప్రస్తావించారు. ట్విటర్లో మోదీకి 5.33 కోట్లమంది ఫాలోవర్లున్నారు. 5 కోట్లకు పైగా ట్విటర్ ఫాలోవర్లు ఉన్న తొలి భారతీయుడు మోదీనే. ఫేస్బుక్లో 4.4 కోట్ల మంది, ఇన్‌స్ట్రాగామ్‌లో 3.52 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతుంటారు. ప్రధాని కార్యాలయ ట్వీటర్ అకౌంట్‌ను 3.2 కోట్ల మంది అనుసరిస్తున్నారు. సెప్టెంబర్ 2019లో ప్రపంచవ్యాప్తంగా ట్విటర్లో అత్యధికులు ఫాలో అవుతున్న మూడో నేత నరేంద్ర మోదీనే. తొలి రెండు స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉన్నారు. -
ట్రంప్ పర్యటన : మోదీకి ఐదు సూటి ప్రశ్నలు!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించింది. ట్రంప్ పర్యటన భారత్‌కు ఏమేరకు లాభిస్తుందో చెప్పగలరా అని ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్‌సింగ్ సుర్జేవాలా ట్విటర్ వేదికగా ఐదు ప్రశ్నలు వేశారు. అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాలు, హెచ్ 1బీ వీసాలు, జాతీయ భద్రత, ఆయిల్ ధరలు, స్టీల్ ఎగుమతి అంశాలపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. (చదవండి : భారత్‌కు పయనమైన అమెరికా అధ్యక్షుడు) 1.హెచ్ 1 బీ వీసాల జారీలో నిబంధనలు కఠినతరం చేశారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో 70 శాతం (85 వేలు) మందికి వీసాలు వచ్చేవి. 30 శాతం తిరస్కరణకు గురయ్యేవి. ట్రంప్ నిర్ణయాల వల్ల నేడు తిరస్కరణ మరో 24 శాతం పెరిగింది. ఈ పర్యటన తర్వాత హెచ్ 1 బీ వీసాల జారీని ట్రంప్ సరళతరం చేస్తారా? 2.1974 నుంచి భారత్‌కు ఉన్న ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ) 2019లో తొలగించారు. దీనివల్ల 5.6 బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రభావం పడింది. నమస్తే ట్రంప్ కార్యక్రమం జీఎస్పీ పునరుద్ధరణకు దోహదం చేస్తుందా? 3.ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. వాటిల్లో ఇరాన్ నుంచి భారత్ చములు కొనుగోలు చేయొద్దని నిబంధన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి భారత్ దిగుమతి నిలిపేస్తే.. ఆ స్థానంలో అమెరికా మనకు చమురు సరఫరా చేస్తుందా? ఇరాన్ నుంచి కాకుండా భారత్‌కు తక్కువ ధరకు చుమురును మోదీ తీసుకురాగలరా? 4.అమెరికా ప్రమోజనాలే తమకు తొలి ప్రాధాన్యం అని ట్రంప్ వాదిస్తుంటే.. భారత్‌కు తొలి ప్రాధాన్యం అన్న విధానంపై మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారు? 5. భారత్ ఎగుమతులపై అమెరికా టారిఫ్‌లు పెంచడం వల్ల 761 మిలియన్ డాలర్లుగా స్టీల్ ఎగుమతులు 50 శాతం మేర తగ్గిపోయాయి. అదే సమయంలో అమెరికా నుంచి మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఉత్పత్తుల కొనుగోలు ఒప్పందానికి భారత్ సంసిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిఫలంగా భారత స్టీల్ ఎగుమతులపై అగ్రరాజ్యం ఏమైనా ప్రోత్సహకాలు కల్పిస్తుందా? అని సుర్జేవాలా ప్రశ్నించారు. (చదవండి : ట్రంప్‌ను విలన్‌తో పోల్చిన కాంగ్రెస్ నేత) ఇక 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం హైజాక్ విషయాన్ని గుర్తు చేసిన సుర్జేవాలా.. తాలిబన్లతో అమెరికా చేసుకునే ఒప్పందం భారతదేశ రక్షణను వెక్కిరిస్తుంది కదా అని పేర్కొన్నారు. తాలిబన్లతో అమెరికా ఒప్పందం శాంతిని పెంపొందిస్తుందని రష్యా కూడా చెప్తున్న నేపథ్యంలో భారత్‌పై తాలిబన్ల చర్యలన్నీ మర్చిపోవాలా అని ప్రశ్నించారు. (చదవండి : హౌడీ X నమస్తే) -
అయోధ్య తీర్పు: ‘బీజేపీకి డోర్లు క్లోజ్’
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తాము అనుకూలమని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అయోధ్యలో వివాదస్పద స్థలంపై సుప్రీంకోర్టు వెలువరించిన నేపథ్యంలో రాజకీయ నాయకులు, పెద్దలు సంయమనం పాటించాలని లౌకికవాద విలువలను కాపాడాలని కోరింది. ‘సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. మేము రామమందిర నిర్మాణానికి సానుకూలంగా ఉన్నాం. మందిర నిర్మాణానికి ఈ తీర్పు తలుపులు తెరవడమే కాదు.. అయోధ్య అంశాన్ని రాజకీయం చేసిన బీజేపీ, ఇతరులకు తలుపులు మూసేసింద’ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. ‘అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది. లౌకిక విలువలకు కట్టుబడాలని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని మతాల వారిని కోరుతున్నాం. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ శాంతి, సౌభ్రాతృత్వాలను కలిగివుండాలని ఆకాంక్షిస్తున్నట్టు’ సీడబ్ల్యూసీ ఒక ప్రకటన విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు వెలువరించినా అందరూ శాంతి సామరస్యాలతో ఉండాలని అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ విజ్ఞప్తి చేశారు. (చదవండి: అయోధ్య తీర్పు.. ఎల్కే అద్వానీదే ఘనత) -
కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. మరో వైపు పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఓ నెల రోజుల పాటు కాంగ్రెస్ నాయకులేవరు టీవీ చర్చల్లో పాల్గొనకూడదనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. .@INCIndia has decided to not send spokespersons on television debates for a month. All media channels/editors are requested to not place Congress representatives on their shows. — Randeep Singh Surjewala (@rssurjewala) May 30, 2019 ‘ఓ నెల రోజుల పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధులను టీవీ చర్చలకు పంపకూడదని పార్టీ నిర్ణయించింది. ఈ సదర్భంగా అన్ని మీడియా సంస్థలకు, ఎడిటర్స్‌కు ఒక విన్నపం. మీ చానెళ్లలో ప్రసారమయ్యే చర్చా కార్యక్రమాలకు కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించకండి’ అంటూ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. అయితే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న దానిపై కాంగ్రెస్ పార్టీ సరైన వివరణ ఇవ్వలేదు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 52 స్థానాల్లో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. -
రాహుల్ జూలై 12న హాజరు కావాల్సిందే..!
అహ్మదాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్‌పార్టీ ఘోరంగా దెబ్బతినడంతో డీలా పడిన రాహుల్ గాంధీకి మరో చిక్కొచ్చిపడింది. అహ్మదాబాద్ జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ (ఏడీసీబీ) వేసిన పరువునష్టం దావాలో ఆయన జూలై 12న తమముందు హాజరు కావాల్సిందేనని అహ్మదాబాద్ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. తొలుత మే 27కు ముందే హాజరు కావాలని కోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే, కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు గుజరాతి నుంచి ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేయడంలో ఆలస్యం .. అదే సందర్భంలో మే 27న భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి కావడంతో రాహుల్ శాంతివనానికి వెళ్లడం వంటి కారణాలతో కోర్టు కొంత సడలింపునిచ్చింది. ఈకేసులో రాహుల్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సుర్జేవాలా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అసత్య ఆరోపణలు.. చిక్కులు.. నోట్లరద్దు (నవంబర్ 8, 2016) ప్రకటన వెలువడిన ఐదు రోజుల అనంతరం అహ్మదాబాద్ జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ అక్రమాలకు పాల్పడిందని, రూ.745.59 కోట్ల రద్దయిన నోట్లను మార్పిడి చేసిందని రాహుల్ గాంధీ, సుర్జేవాలా ఆరోపణలు చేశారు. దీనిపై ఏడీసీబీ బ్యాంక్ చైర్మన్ అజయ్ పటేల్, మరో ముగ్గురు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదైంది. అసత్య ఆరోపణలు చేసి బ్యాంక్ నైతికతను దెబ్బతీశారని ఫిర్యాదు దారులు కోర్టుకు విన్నవించగా.. కోర్టు విచారణ చేపట్టింది. ప్రాథమిక సాక్ష్యాధారాల ఆధారంగా రాహుల్, సుర్జేవాలాకు నోటీసులిచ్చింది. అహ్మదాబాద్ జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లలో అమిత్‌షా ఒకరు కావడం గమనార్హం. -
‘ఆమె వ్యాఖ్యలు దేశానికి అవమానకరం’
సాక్షి, న్యూఢిల్లీ : మహాత్మ గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా భోపాల్ బీజేపీ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా సింగ్ కొనియాడటం పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సాధ్వి ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలు దేశానికి అవమానకరమని, గాంధీ సిద్ధాంతంపై దాడి అని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా ఆక్షేపించారు. భారత ఆత్మను నాథూరాం గాడ్సే వారసులు, పాలక బీజేపీ శ్రేణులు దెబ్బతీశారని ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మ గాంధీని హత్య చేసిన గాడ్సేను నిజమైన జాతీయవాదిగా బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారని..ఇది దేశానికి అవమానకరమని, గాంధీ సిద్ధాంతానికి తూట్లుపొడవడమేనని సుర్జీవాలా పేర్కొన్నారు. సాధ్వి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీని చంపిన గాడ్సే ఓ హంతకుడని, ఆయనను కీర్తించడం దేశభక్తి కాదని, రాజద్రోహమని దిగ్విజయ్ సింగ్ అన్నారు. బీజేపీ వివరణ.. ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలతో బీజేపీ ఏకీభవించదని, దీనిపై పార్టీ ఆమె వివరణ కోరుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా సింగ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. కాగా మహాత్మ గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడని, ఆయన దేశభక్తుడిగానే ఉంటారని సాధ్వి ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
‘మా తప్పిదంతోనే ఆమె పార్టీని వీడారు’
సాక్షి, ముంబై: తమ నాయకత్వ తప్పిదం కారణంగానే ప్రియాంక చతుర్వేది కాంగ్రెస్ పార్టీని వీడారని, ఈ పరిణామం పార్టీపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని ఒప్పుకుంటున్నానని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇన్చార్జి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. కీలక నేతలు పార్టీని విడిచిపెట్టిన ప్రతిసారి బాధగానే ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పార్టీకి రాజీనామా చేసి శివసేనలో చేరిన విషయం తెలిసిందే. దీనిపై సూర్జేవాలా స్పందిస్తూ, ఎవరు పార్టీని వీడినా తమకు బాధగానే ఉంటుందని చెప్పారు. ఎవరైనా భవిష్యత్తు పురోగతి వైపు అడుగులు వేయడం సహజమేనని, చతుర్వేది సహా అలాంటి వారందరికీ మంచి జరగాలని తాము అశిస్తున్నానని పేర్కొన్నారు. గతంలో తనపట్ల దురుసుగా ప్రవర్తించిన వారిని పార్టీని బహిష్కరించి.. ఎన్నికల వేళ మళ్లీ పార్టీలో చేర్చుకోవడంపై ప్రియాంక చతుర్వేది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కోసం చెమటోడ్చినవారికన్నా, దుష్టులకే పెద్ద పీట వేస్తున్నారని మండిపడుతూ.. రెండు రోజుల క్రితం ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి గురువారం ఆమె తన రాజీనామా లేఖను పంపించారు. శుక్రవారం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కలిసి ఆ పార్టీలో చేరారు. -
‘యెడ్డీ డైరీ’ కలకలం
సాక్షి బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గతంలో సీఎం పదవి కోసం బీజేపీ అగ్రనాయకులకు ముడుపులు ఇచ్చారంటూ తాజాగా ఎన్నికల వేళ బయటపడిన డైరీ కాగితాలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మార్మోగుతున్నాయి. ఇదంతా కాంగ్రెస్ కుట్ర అని యడ్యూరప్ప ఆరోపిస్తుంటే, ఈ విషయంపై లోక్‌పాల్‌తో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ‘ద క్యారవాన్’ అనే మేగజీన్ ఈ సంచలన విషయాలను ‘యెడ్డీ డైరీస్’ శీర్షికన కథనంగా ప్రచురించింది. డైరీ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ నేతలంతా అవినీతిపరులేనని ఆరోపించారు. ‘బీజేపీలోని కాపలాదారులంతా దొంగలే’ అంటూ రాహులో ఓ ట్వీట్ చేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ డైరీ అంశంపై లోక్‌పాల్ చేత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. యడ్యూరప్ప బీజేపీ పెద్దలకు లంచాలు ఇవ్వడం నిజమో, అబద్ధమో ప్రధాని చెప్పాలని కోరారు. 2017లో డైరీ దొరికితే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సరైన దర్యాప్తుæ జరగాలని కర్ణాటక సీఎం కుమారస్వామి అన్నారు. శివకుమార్ ఇంట్లో దొరికాయి 2017లో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఇంట్లో సోదాల సందర్భంగా ఈ డైరీ కాగితాలు ఆదాయపు పన్ను (ఐటీ) విభాగానికి దొరికినట్లు క్యారవాన్ పేర్కొంది. 2009లో కర్ణాటక సీఎం అయ్యేందుకు యడ్యూరప్ప బీజేపీ అగ్రనేతల్లో ఎవరెవరికి లంచాలు ఇచ్చారో, అందుకోసం ఏయే ఎమ్మెల్యే దగ్గర ఆయనెంత తీసుకున్నారో ప్రస్తావిస్తూ యడ్యూరప్ప తన డైరీలో రాసుకున్నట్లుగా ఉందని కథనంలో క్యారవాన్ పేర్కొంది. కర్ణాటక బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజేను తాను కేరళలోని ఓ గుడిలో వివాహం చేసుకున్నట్లుగా కూడా ఆ డైరీలో యడ్యూరప్ప రాసినట్లు ఉందంది. నకిలీవి అయ్యుండొచ్చు: ఐటీ విభాగం ఈ కాగితాలపై ఐటీ విభాగం శుక్రవారం స్పందించింది. శివకుమార్ ఇంట్లో తమకు దొరికింది డైరీలోని కొన్ని పేపర్ల జిరాక్స్‌లు మాత్రమేనని స్పష్టం చేసింది. ఆ జిరాక్స్‌లు ఎక్కడి నుంచి వచ్చాయో, వాటి ఒరిజినల్ కాగితాలు ఎక్కడ ఉన్నాయో తెలియదనీ, జిరాక్స్ కాగితాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం హైదరాబాద్‌కు అప్పట్లోనే పంపినా ఒరిజినల్స్ లేనిదే జిరాక్స్‌లతో తామేమీ చెప్పలేమని ఫోరెన్సిక్ విభాగం చెప్పిందని ఐటీ విభాగం ఓ ప్రకటనలో వెల్లడించింది. తాము అప్పుడే యడ్యూరప్పను కూడా పిలిచి విచారించామనీ, ఆ డైరీ తాను రాసింది కాదనీ, అసలు తనకు డైరీ రాసే అలవాటే లేదని ఆయన చెప్పారంది. ఒరిజినల్ కాగితాలు ఎక్కడా లభించనందున ఆ జిరాక్స్‌లు నకిలీవి అయ్యుండొచ్చంది. ఆ డైరీ నిజం కాదు: యడ్యూరప్ప డైరీలో తాను రాసినట్లుగా చెబుతున్న విషయాలన్నీ అవాస్తవాలేనని యడ్యూరప్ప కొట్టిపారేశారు. బెంగళూరు డాలర్స్ కాలనీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలవి దివాలాకోరు రాజకీయాలని మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేసి లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ నేతలు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఆ డైరీలోని అంశాలు ఫోర్జరీ చేసినవీ, నకిలీవని ఐటీ అధికారులు నిర్ధారించినట్లు యడ్యూరప్ప చెప్పారు. కాంగ్రెస్ ఆరోపణలకు బీజేపీ ఎదురుదాడి చేసింది. ఆ డైరీ నకిలీదని, డైరీ పేరిట కాంగ్రెస్ చేస్తున్నదంతా నాటకమని, అదంతా ఒక పథకం ప్రకారం సాగుతున్నదని ఆరోపించింది. డైరీలోని చేతిరాత, నకిలీ అని, అది యడ్యూరప్ప సంతకమే కాదని బీజేపీ స్పష్టం చేసింది. ఎవరెవరికి ఎంతెంత? క్యారవాన్ కథనం ప్రకారం ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీ కేంద్ర కమిటీకి రూ. 1000 కోట్లు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, రవాణా మంత్రి నితిన్ గడ్కరీలకు చెరో రూ. 150 కోట్లు, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు రూ. 100 కోట్లు, బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలకు చెరో రూ. 50 కోట్లు లంచంగా ఇచ్చినట్లు యడ్యూరప్ప డైరీలో రాసుకున్నారు. పలువురు జడ్జీలకు రూ. 250 కోట్లు, న్యాయవాదులకు రూ. 50 కోట్లు ఇచ్చినట్లు రాసుకొచ్చారు. న్యాయమూర్తులు, న్యాయవాదుల పేర్లను డైరీలో పేర్కొనలేదు. అలాగే గడ్కరీ కొడుకు వివాహ వేడుకలకు రూ. 10 కోట్లు ఖర్చు చేశానని డైరీలో యడ్యూరప్ప రాశారు. తాను ముఖ్యమంత్రి అవ్వడంలో రాష్ట్ర మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారని డైరీలో యడ్యూరప్ప రాశారు. ఆయన ఆర్థికంగా ఆదుకున్నారని పేర్కొన్నారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మంది ఆర్థిక సాయం చేశారని వారి పేర్లను వివరాలతో సహా రాసుకొచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలు నరేంద్ర స్వామి రూ. 20 కోట్లు, గోళిహట్టి శేఖర్ రూ. 10 కోట్లు, బాలచంద్ర జారకిహోళి రూ. 20 కోట్లు, డి.సుధాకర్ రూ. 20 కోట్లు, శివనగౌడ నాయక్ రూ. 20 కోట్లు, వెంకటరమణప్ప రూ. 20 కోట్లు, నారాయణ స్వామి రూ. 20 కోట్లు, ఆనంద్ అస్నోటికర్ రూ. 20 కోట్లు ఆర్థిక సాయం చేసినట్లు డైరీలో రాసి ఉంది. అయితే వీరంతా తాము ఎలాంటి సాయం చేయలేదని ఒక్కొక్కరిగా చెప్పుకుంటూ వస్తున్నారు. -
డైరీ లీక్స్ : బీజేపీ నేతలకు రూ 1800 కోట్ల ముడుపులు
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో పాలక బీజేపీని ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్‌కు సరికొత్త అస్త్రం అందివచ్చింది. బీజేపీ అగ్రనేతలకు కర్నాటక మాజీ సీఎం, పార్టీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప నుంచి రూ 1800 కోట్ల ముడుపులు ముట్టాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఓ వార్తాపత్రిక కథనాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా బీజేపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా పలువురు బీజేపీ జాతీయ నేతలు, పెద్దసంఖ్యలో న్యాయమూర్తులు, అడ్వకేట్లకు డబ్బు ఇచ్చినట్టు యడ్యూరప్ప తన డైరీల్లో రాసుకున్నారని ఈ కథనం వెల్లడించడం కలకలం రేపింది. ఈ వార్తా కథనంపై బీజేపీ నేతలు స్పందించాలని సుర్జీవాలా డిమాండ్ చేశారు. ఈ కథనం వాస్తవమా..కాదా అనేది బీజేపీ తక్షణమే వివరణ ఇవ్వాలని కోరారు. యడ్యూరప్ప సంతకంతో కూడిన ఈ డైరీ 2017 నుంచి ఆదాయ పన్ను అధికారుల వద్ద ఉన్నప్పటికీ దీనిపై లోతైన విచారణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. -
జనం సొమ్ముతో ఆ కంపెనీని ఆదుకుంటారా..?
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్కు ఇచ్చిన రుణాలను వాటాలుగా మార్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ బ్యాంకులకు సూచిస్తూ ప్రజల సొమ్మును ప్రైవేట్ ఎయిర్‌లైన్‌కు మళ్లించాలని ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ను ఆదుకునేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలని కేంద్రం కోరుతున్న సంగతి తెలిసిందే. దివాళా తీసిన జెట్ ఎయిర్వేస్ను కాపాడేందుకు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం బెయిలవుట్ ప్రతిపాదనన పట్ల కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్బీఐ, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు జెట్ ఎయిర్వేస్కు ఇచ్చిన రూ 8500 కోట్ల రుణాన్ని వాటాలుగా మలుచుకోవాలని ప్రధాని సూచించడంతో సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్లో ఆయా బ్యాంకులకు 50 శాతం వాటా దక్కుతుందని సుర్జీవాలా పేర్కొన్నారు. దివాళా తీసిన జెట్ ఎయిర్వేస్ వంటి కార్పొరేట్ సంస్థకు బెయిలవుట్ ప్యాకేజ్ ఇచ్చేందుకు మోదీ సర్కార్ ఎందుకు తొందరపడుతోందని ఆయన ప్రశ్నించారు. రుణభారంతో సతమతమవుతున్న రైతులను విస్మరించి విదేశీ ఇన్వెస్టర్ల నియంత్రణలో ఉన్న ఈ కంపెనీని ప్రజల సొమ్ముతో ఆదుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు ప్రజల ధనానికి రక్షకులు మాత్రమేనని, ఇలాంటి నిర్ణయాలు వాటంతటవే తీసుకోలేవని సుర్జీవాలా చెప్పారు. -
మోదీపై కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు టోకరా వేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయేందుకు కాపలాదారని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ అనుమతించారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని మోదీ బృందంలో నలభై మంది దొంగలున్నారని.. మోదీ బాబా నలభై దొంగలని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా మంగళవారం ట్విటర్లో తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల విశ్వాసం కోల్పోయారని ట్వీట్ చేశారు. విజయ్ మాల్యాను దేశం నుంచి పారిపోయేందుకు సహకరించిన కాపలాదారు (మోదీ) దొంగ అన్నారు. మోదీ బాబా, నలభై దొంగలు చేసిందేమీ లేదని, చెప్పుకునేందుకు ఏమీ లేక ట్విటర్లో వారి పేర్లు మార్చుకుంటున్నారని విమర్శించారు. నినాదాలను పదేపదే మార్చేందుకు ప్రయత్నించే మోదీ తన బ్రాండ్‌ను పెంచుకునేందుకు ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు పాల్పడుతుంటారని ఎద్దేవా చేశారు. -
ఆ సమయంలో షూటింగ్ బిజీలో మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించడంతో దేశమంతా విషాదంలో మునిగితే ఘటన జరిగిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార చిత్రం షూటింగ్లో కొనసాగారని కాంగ్రెస్ ఆరోపించింది. పుల్వామా ఘటనలో మరణించిన జవాన్ల మృతదేహాలను లెక్కిస్తుండగానే, ప్రధాని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో బోటులో విహరిస్తూ ప్రచార చిత్రానికి బాలీవుడ్ స్టార్లా ఫోజులిచ్చారని దుయ్యబట్టింది. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం ప్రధానికి తెలిసినా ప్రచార చిత్రం షూటింగ్లో కొనసాగడాన్ని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా తప్పుపట్టారు. ప్రధాని మోదీ రాజధర్మాన్ని విస్మరించారని ఆరోపించారు. ప్రధాని బాధ్యతారహితంగా వ్యవహరించారని, ప్రచార చిత్రంలో పాల్గొనడానికి బదులు ఆయన తక్షణమే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో పాల్గొని ఉండాలని పేర్కొన్నారు. అమరవీరులను అవమానపరిచేలా ప్రధాని మోదీ వ్యహరించారని విమర్శించారు. -
జింద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం
-
రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలాకు షాక్!
చండీగఢ్ : హర్యానాలో జరిగిన జింద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి కృష్ణ మిద్దా గెలుపొందారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన విజయానికి తోడ్పడిన కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పోరులో కాంగ్రెస్ సహా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్డీ), జననాయక్ జనతా పార్టీ(జేజేపీ)ల నుంచి మహామహులు బరిలో దిగినప్పటికీ తాను వారందరినీ ఓడించానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ హర్యానా ప్రజలను అభివృద్ధి పథంలో నడిపిస్తానని పేర్కొన్నారు. కాగా ఐఎన్ఎల్డీ పార్టీకి చెందిన జింద్ సిట్టింగ్ ఎమ్మెల్యే హరిచంద్ మిద్దా మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు కృష్ణ మిద్దా బీజేపీ తరపున బరిలో దిగారు. ఇక కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, ఐఎన్ఎల్డీ నుంచి ఉమ్ సింగ్, కొత్తగా ఏర్పాటైన జేజేపీ నుంచి దిగ్విజయ్ చౌతాలా పోటీ చేశారు. జింద్ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి.. ఉపఎన్నికలో ఓటమి పట్ల రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా స్పందించారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఉపఎన్నిక విజేత కృష్ణ మిద్దా కలిసి జింద్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాధ్యతను నెరవేర్చేందుకు తాను శాయశక్తులా ప్రయత్నించానని, అయితే విజయం మాత్రం దక్కలేదని పేర్కొన్నారు. కాగా రాజస్ధాన్‌లోని రామ్‌గఢ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సఫీయా ఖాన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక హర్యానాలో మాత్రం ఆ పార్టీ ఓడిపోవడంతో పాలక, విపక్షాలకు మిశ్రమ ఫలితాలు దక్కినట్లైంది. గెలుపొందిన బీజేపీ అభ్యర్థి కృష్ణా మిద్దా -
జింద్ ఉప ఎన్నికలో బీజేపీ ముందంజ
చండీగఢ్ : హర్యానాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన జింద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పాలక బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ, జేజేపీల మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ఎన్నికల ఫలితాలూ ఉత్కంఠను రేపుతున్నాయి. తొలి రౌండ్లో ఆధిక్యం కనబరిచిన జేజేపీ, కాంగ్రెస్‌లు ఆ తర్వాత వెనుకంజ వేయగా ఐదో రౌండ్ ముగిసిన అనంతరం బీజేపీ 5737 ఓట్ల ఆధిక్యం సాధించింది. జింద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున దిగ్గజ నేత రణ్‌దీప్ సుర్జీవాలా బరిలో నిలవగా, బీజేపీ తరపున మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మిద్ధా కుమారుడు కృష్ణ మిద్దా పోటీ చేశారు. ఐఎన్‌ఎల్లీ నుంచి ఉమ్ సింగ్, కొత్తగా ఏర్పాటైన జేజేపీ నుంచి దిగ్విజయ్ చౌతాలా రంగంలో నిలిచారు. -
హేళన చేయొద్దు; మోదీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు!
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధానిని అవహేళన చేస్తూ మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రభుత్వం గట్టి సమాధానమివ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. అఫ్గానిస్తాన్‌లో పౌరుల భద్రతను పట్టించుకోకుండా నరేంద్ర మోదీ అక్కడ లైబ్రరీ స్థాపనకు సాయం చేస్తానడం విడ్డూరంగా ఉందని ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. అమెరికా అఫ్గనిస్తాన్‌లో ఐదు గంటలకు చేసే ఖర్చుతో ఆ లైబ్రరీ సమానం అంటూ వెటకారపు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై స్పందించిన కాంగ్రెస్ కీలక నేత అహ్మద్ పటేల్ మాట్లాడుతూ...‘ భారత ప్రధాని గురించి అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. 2004 నుంచి అఫ్గనిస్తాన్‌లో రోడ్లు, డ్యాముల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు భారత ప్రభుత్వం దాదాపు 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది. ఈ విషయాలన్నీ ట్రంప్‌నకు ఒకసారి గుర్తుచేస్తే బాగుంటుంది’ అని వ్యాఖ్యానించారు. (ప్రధాని మోదీపై ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు) భారత ప్రధానిని హేళన చేయడం ఆపండి ‘ప్రియమైన ట్రంప్ గారు.. భారత ప్రధానిని వెక్కిరించడం ఆపండి. అఫ్గనిస్తాన్ విషయంలో అమెరికా ఇచ్చే ఉపన్యాసాలను వినాల్సిన అవసరం భారత్‌కు ఎంతమాత్రం లేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో ఆ దేశ పార్లమెంట్ భవన నిర్మాణానికి భారత్ సాయం చేసింది. మానవతా దృక్పథంతో కూడిన వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యం అవసరమే. మా అఫ్గానీ సోదరసోదరీమణులకు మేము అండగా ఉంటాం’ అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ట్విటర్ వేదికగా ట్రంప్ తీరును విమర్శించారు. Dear Mr. Trump, Stop mocking India’s PM India dosn’t need sermons from the U.S on Afghanistan Under Dr Manmohan Singh, India helped build Afghan National Assembly Humanitarian needs to strategic economic partnership, we are one with our Afghani brothers & sisters pic.twitter.com/DlK9BM9XsZ — Randeep Singh Surjewala (@rssurjewala) January 3, 2019 -
కేసీఆర్ అవినీతి చక్రవర్తి : సూర్జేవాల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అవినీతి చక్రవర్తి అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాల విమర్శించారు. శనివారం కేసీఆర్ ప్రభుత్వం మీద కుంతియా, సూర్జేవాలాలు చార్జీషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సూర్జేవాల మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో అవినీతి, చీటింగ్, కుటుంబ పాలన తప్ప మరొకటి లేదన్నారు. తెలంగాణ ప్రజల పట్ల విశ్వాసఘాతకుడిలాగా కేసీఆర్ వ్యవహరించాడని పేర్కొన్నారు. అవినీతితో కుటుంబం తప్ప మరో ఆలోచన లేకుండా పాలన సాగిందని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంగతే మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ను అత్యంత అవినీతి ప్రభుత్వంగా గిన్నీస్ రికార్డులోకి ఎక్కించవచ్చని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెరాస ప్రైవేట్ లిమిటెడ్‌గా మారిందన్నారు. ఇసుక మాఫియాలో కోట్లు దోచుకున్నారని, పోలీస్ వాహనాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపించారు. కేశవరావు 50 ఎకరాల అటవీ భూమిని అక్రమంగా కొన్నారని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తెరవెనుక చేతులు కలిపాయని అన్నారు. కేసీఆర్‌ను బీజేపీ ఏజెంగా పేర్కొన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తెలంగాణ అమరవీరులకు కేవలం 41కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. మహిళా మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. కేసీఆర్ బీసీ ద్రోహి అని.. దళిత సీఎం ఏమయ్యాడని కేసీఆర్‌ను ప్రశ్నించారు. -
‘అది మీ ఘనత కాదు’
సాక్షి, న్యూఢిల్లీ : ఆరు దశాబ్ధాలుగా దేశానికి తాము చేసిన సేవలను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ తమ ఘనతగా చాటుకుంటున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దేశంలోని 6,49,867 గ్రామాలకు గాను కాంగ్రెస్ పార్టీ 97 శాతం గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించిందని ఆ పార్టీ ప్రతనిధి రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా ట్వీట్ చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షాను ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేస్తూ యూపీఏ పదేళ్ల హయాంలో లక్షకు పైగా గ్రామాలకు విద్యుదీకరణ చేపట్టామన్నారు. గత 60 ఏళ్లలో ఏటా 10,000 గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చిందని, మోదీ ప్రభుత్వం ఏడాదికి కేవలం 4813 గ్రామాలకే విద్యుత్ సౌకర్యం కల్పిస్తోందని సుర్జీవాలా చెప్పుకొచ్చారు.తాము అధికారంకోల్పోయిన మే 2014 నాటికి కేవలం 18,452 గ్రామాలకే విద్యుత్ సౌకర్యం లేదని, ఈ గ్రామాలకు విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు బీజేపీ ప్రభుత్వానికి 46 నెలల సమయం పట్టిందని విమర్శించారు. అసమర్ధతను గొప్పగా చెప్పుకోవడం, కాంగ్రెస్ చేపట్టిన పనులను తమ ఘనతగా చెప్పుకోవడం బీజేపీకి చెల్లిందని ఎద్దేవా చేశారు. -
చైనాకు గట్టి సందేశం ఇవ్వాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: చైనా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రశ్నలను సంధించింది. డోక్లాం సమస్యపై చైనాతో చర్చలు జరిపి ఆ దేశానికి బలమైన సందేశాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సమాచార విభాగం ఇన్చార్జ్ రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. చైనా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు జింపింగ్‌తో మోదీ సమావేశం కానున్నరు. ఈ సమావేశంలో మోదీ డోక్లాం సమస్య గురించి జింపింగ్‌తో చర్చలు జరపాలని ట్విటర్ వేదికగా కోరారు. దక్షిణ డోక్లాం గుండా చైనా నిర్మిస్తున్న రోడ్‌పై మోదీ ఎందుకు మోనంగా ఉన్నారని రణ్‌దీప్ ప్రశ్నించారు. ఇటీవల ఇద్దరు కేంద్రమంత్రులు చైనా పర్యటనకు వెళ్లి డోక్లాం సమస్య గురించి ప్రస్తావించకపోవడాన్ని ఈ సందర్భంగా ఆయన తప్పుపట్టారు. మంత్రులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని, విధినిర్వహణలో మంత్రులు విఫలమయ్యారని మోదీ అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. డోక్లాం సరిహదుల్లో భారత మిలటరీ క్యాంపుకు చైనా దళాలు 10 మీటర్లు ముందుకు దూసుకువచ్చాయని ఈ అంశంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కాగా రెండు రోజుల పర్యటన నిమిత్తం చైనా చేరుకున్న ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జింపింగ్‌తో పలు అంశాలపై చర్చించనున్నారు. చివరి రోజు సమావేశంలో రెండు దేశాల ప్రతినిధులతో మోదీ, జింపింగ్ ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. -
నిజమైన దోషి యోగి: కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నావ్ అత్యాచార ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ ఘటనలో యోగినే నిజమైన దోషి అని ఆ పార్టీ నేత రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యత వహించి యోగి తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలహాబాద్ కోర్టు యూపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. బాధితురాలి బంధువులు సీఎం ఇంటిముందే ఆత్మహత్య యత్నం చేసినా యోగి స్పందించలేదని విమర్శించారు. బీబేపీ పాలనలో రైతులు, మహిళలు, దళితులు కష్టాలు ఎదుర్కొంటున్నారని.. యూపీలో ప్రభుత్వపాలన రావణరాజ్యాన్ని తలపిస్తుందని సుర్జేవాలా మండిపడ్డారు. బీజేపీ నాయకులు నిందితుల పక్షాన నిలుస్తూ బాధితుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారని.. యోగీ కూడా అదే బాటలో నడుస్తున్నారని ఆయన వాఖ్యానించారు. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శశి సింగ్ అనే మహిళను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. బాధితురాలిని ప్రలోభపెట్టి ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్ దగ్గరికి తీసుకెళ్లడంలో శశి సింగ్‌దే కీలక పాత్ర అని ఆరోపణలు రావడంతో అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. -
తల్లిదండ్రుల వివరాలు తెలిస్తేనే..
చండీగఢ్ : హర్యానా ప్రభుత్వం విద్యార్థుల స్కూల్ అడ్మిషన్లకు సంబంధించి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. పిల్లల్ని స్కూల్లో చేర్పించాలంటే 100 పాయింట్లతో కూడిన దరఖాస్తుని పూర్తి చేయాలని మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో వివాదం ఏముందని అనుకుంటున్నారా.. అందులోని అంశాలని పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. మాములుగా పిల్లల్ని పాఠశాలలో చేర్పించాలంటే వారి తల్లిదండ్రుల పేర్లు, చిరునామా సమర్పిస్తే సరిపోతుంది. కానీ హర్యానాలో పిల్లల తల్లిదండ్రులు చట్టవిరుద్ధ వృత్తిలో కొనసాగుతున్నారా, ఆదాయం, పన్ను చెల్లింపుల సంబంధించిన ప్రశ్నలను అప్లికేషన్ ఫామ్‌లో పొందుపర్చారు. అంతేకాకుండా ఆధార్ నంబర్లు, విద్యార్హతలు, మతం, కులం, జన్యుపరమైన లోపాలు వంటివి కూడా దరఖాస్తులో పేర్కొనాలి. హర్యానా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ చర్యపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. బీజేపీ ప్రభుత్వం ప్రజల కుల, మత వివరాలు సేకరించడంలో మునిగిపోయిందని ఆ పార్టీ సీనియర్ నేత రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా ట్విటర్లో ఆరోపించారు. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పిల్లలతో పాటు తల్లిదండ్రులపై నిరంతరం నిఘా ఉంచడానికే అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఈ నిబంధనను వెనక్కి తీసుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
మార్చి 16 నుంచి ప్లీనరీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్లీనరీ ముహూర్తం ఖరారైంది. ఢిల్లీలో వచ్చే నెల 16, 17, 18వ తేదీల్లో జరిగే ఈ సమావేశాల్లో పార్టీ భవిష్యత్ దిశానిర్దేశం ఖరారవుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం సెంట్రల్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని రద్దుచేసి, 34 మందితో కూడిన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శనివారం రాహుల్‌తోపాటు పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లతో కూడిన స్టీరింగ్ కమిటీ సమావేశమై ప్లీనరీ తేదీలను ఖరారు చేసింది. సీడబ్ల్యూసీలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలతోపాటు వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఉంటుందని రాహుల్ చెప్పినట్లు సమాచారం. స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ప్లీనరీకి పీసీసీ ప్రతినిధులతోపాటు, రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయి నాయకులు కలిపి దాదాపు 20వేల మంది హాజరవుతారని అంచనా. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సందర్భంగా నేతలకు రాహుల్ వివరిస్తారు. అయితే, ప్లీనరీలోనే సీడబ్ల్యూసీని ఎన్నుకుంటారా లేక తర్వాత నామినేట్ చేస్తారా అనే విషయంలో సందిగ్ధం ఏర్పడింది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని మొదట్నుంచీ చెబుతున్న రాహుల్ గాంధీ..ఎన్నికల ద్వారా సీడబ్ల్యూసీని ఏర్పాటు చేయాలని భావిస్తుండగా సీనియర్ నేతలు మాత్రం నామినేట్ చేయాలంటూ ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. సీడబ్ల్యూసీలోని 25 మందిలో కనీసం సగం మందిని ఎన్నుకోవాలని పార్టీ నిబంధనలు చెబుతున్నప్పటికీ.. గాంధీ కుటుంబానికి చెందిన వారసులకు పార్టీపై సహజంగా పూర్తి స్థాయి పట్టు ఉండటంతో నామినేట్ చేస్తూ వస్తున్నారు. పీవీ నరసింహారావు, సీతారాం కేసరి హయాంలో మాత్రం సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరిపారు. -
‘మోదీ పీఏగా ఈసీ’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పీఏగా ఎన్నికల కమిషన్ (ఈసీ) వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఓటింగ్ జరుగుతున్న క్రమంలో రోడ్‌షో నిర్వహించిన ప్రధానిపై ఈసీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తప్పుపట్టింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఓటు వేసిన అనంతరం ప్రధాని రోడ్‌షో నిర్వహించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జీవాలా అన్నారు. మోదీపై చర్య తీసుకోకుండా ఈసీ బీజేపీ జేబుసంస్థగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈసీ తీరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రధాని పీఎస్‌గా ప్రవరిస్తున్నారని విమర్శించారు. గుజరాత్ టీవీ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌కు ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఈసీ, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. -
'తుగ్లక్ బాటలో మోదీ, కేసీఆర్‌లు'
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌లు తుగ్లక్ బాటలో నడుస్తున్నారని.. అందువల్లే అభివృద్ధి కుంటుపడిందని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాల ఆరోపించారు. నగరానికి వచ్చిన ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మోడీ, కేసీఆర్ అన్నదమ్ములుగా తయారయ్యారు. ఇద్దరు అభివృద్ధిని పక్కన పెట్టి సొంత పనులు చక్కదిద్దుకుంటున్నారు. నోట్ల రద్దు వల్ల నల్లధనం ఎంత వెనక్కి వచ్చిందో మోదీ ఇంత వరకు చెప్పలేకపోతున్నారు. హడావిడిగా నోట్లు రద్దు చేయడం వల్ల సామాన్యులు ఎన్ని కష్టాలు పడ్డారో ఆయనకేం తెలుసు? రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారు. ప్రజలను పక్కన పెట్టి వారి కోసం ప్రగతిభవన్‌లు, సచివాలయాలు కట్టుకుంటున్నారు. కేసీఆర్ మీద పోరాటానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి' అని పిలుపునిచ్చారు. -
‘పీకే’కు కాంగ్రెస్ పెద్దల మద్దతు
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే)కు కాంగ్రెస్ పార్టీ పెద్దలు బాసటగా నిలిచారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ ఎత్తుగడలు ఫలించకపోవడంతో ఆయన పనితీరుపై విమర్శలు రేగాయి. ఆయన కనిపించడం లేదని, ఆచూకీ చెబితే రూ. 5 లక్షలు ఇస్తామంటూ లక్నోలోని పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు పోస్టర్లు పెట్టారు. యూపీలో తమ పార్టీ విజయం కోసం ప్రశాంత్ కిశోర్ ఎంతో కష్టపడ్డారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జివాలా అన్నారు. ‘ప్రశాంత్ కిశోర్, ఆయన బృందం చేసిన కఠోర శ్రమ, తేడ్పాటుకు కాంగ్రెస్ పార్టీ విలువ ఇస్తుంది. ఆయన వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని తిరస్కరిస్తున్నామ’ని ట్విటర్ ద్వారా తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ప్రశాంత్ కిశోర్ ను వెనకేసుకొచ్చారు. సూర్జివాలా అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రశాంత్ కిశోర్, ఆయన బృందం చేసిన కృషి ఎంతోగానో ఉపయోగపడిందని చాలాసార్లు చెప్పానని అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. యూపీతో పాటు పంజాబ్ కు కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేసిన సంగతి తెలిసిందే. -
'గాడ్సే వారసులనుంచి దేశభక్తి మాకొద్దు'
న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదం విషయంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దేశ భక్తి గురించి తాము గాడ్సే వారసుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన విమర్శలకు ప్రతిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి జాతీయ భావాలకు, జాతీయ భావాలను వ్యతిరేకించే వాళ్లకు మధ్య తేడా తెలియడం లేదని, దేశభక్తి గురించి ఆయనకేం తెలియదని అమిత్ షా అన్నారు. దీనిపై స్పందించిన రణ్ దీప్ తాము దేశ భక్తి గురించి ఎన్డీయే వద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. నేరుగా ఎన్డీయే పేరును ప్రస్తావించకుండా 'ఎవరు మహాత్ముని సిద్ధాంతాన్ని చంపేశారో, ఎవరు నాధురాం గాడ్సే వారుసులో వారి వద్ద నుంచి మేం దేశ భక్తి నిర్వచనాన్ని తెలుసుకోవాలనుకోవడం లేదు' అని ఆయన అన్నారు. -
'వ్యక్తిగత విలువలు వదిలేస్తున్నారు'
న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావుపై ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో చాలామంది వ్యక్తిగత విలువలు వదిలేస్తున్నారని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యనించారు. కావూరి ...బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీని ప్రశంసించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. బీజేపీ ఇప్పటివరకూ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయకపోవటానికి కారణం ఏంటో చెప్పాలని సుర్జీవాలా డిమాండ్ చేశారు. ప్రజలను విడదీయటమే బీజేపీ మేనిఫెస్టో అని ఆయన విమర్శించారు. కాగా రాష్ట్ర విభజనకు నిరసనగా కావూరి సాంబశివరావు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఈమేరకు కావూరి ఆపార్టీ అగ్రనేతలతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.