
మీడియాతో మాట్లాడుతున్న రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా
చండీగఢ్ : హర్యానాలో జరిగిన జింద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి కృష్ణ మిద్దా గెలుపొందారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన విజయానికి తోడ్పడిన కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పోరులో కాంగ్రెస్ సహా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్‌ఎల్డీ), జననాయక్ జనతా పార్టీ(జేజేపీ)ల నుంచి మహామహులు బరిలో దిగినప్పటికీ తాను వారందరినీ ఓడించానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ హర్యానా ప్రజలను అభివృద్ధి పథంలో నడిపిస్తానని పేర్కొన్నారు.
కాగా ఐఎన్‌ఎల్డీ పార్టీకి చెందిన జింద్ సిట్టింగ్ ఎమ్మెల్యే హరిచంద్ మిద్దా మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు కృష్ణ మిద్దా బీజేపీ తరపున బరిలో దిగారు. ఇక కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, ఐఎన్‌ఎల్డీ నుంచి ఉమ్ సింగ్, కొత్తగా ఏర్పాటైన జేజేపీ నుంచి దిగ్విజయ్ చౌతాలా పోటీ చేశారు.
జింద్ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి..
ఉపఎన్నికలో ఓటమి పట్ల రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా స్పందించారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఉపఎన్నిక విజేత కృష్ణ మిద్దా కలిసి జింద్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాధ్యతను నెరవేర్చేందుకు తాను శాయశక్తులా ప్రయత్నించానని, అయితే విజయం మాత్రం దక్కలేదని పేర్కొన్నారు.
కాగా రాజస్ధాన్‌లోని రామ్‌గఢ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సఫీయా ఖాన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక హర్యానాలో మాత్రం ఆ పార్టీ ఓడిపోవడంతో పాలక, విపక్షాలకు మిశ్రమ ఫలితాలు దక్కినట్లైంది.
గెలుపొందిన బీజేపీ అభ్యర్థి కృష్ణా మిద్దా
Comments
Please login to add a commentAdd a comment