
‘పీకే’కు కాంగ్రెస్ పెద్దల మద్దతు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే)కు కాంగ్రెస్ పార్టీ పెద్దలు బాసటగా నిలిచారు.
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే)కు కాంగ్రెస్ పార్టీ పెద్దలు బాసటగా నిలిచారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ ఎత్తుగడలు ఫలించకపోవడంతో ఆయన పనితీరుపై విమర్శలు రేగాయి. ఆయన కనిపించడం లేదని, ఆచూకీ చెబితే రూ. 5 లక్షలు ఇస్తామంటూ లక్నోలోని పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు పోస్టర్లు పెట్టారు. యూపీలో తమ పార్టీ విజయం కోసం ప్రశాంత్ కిశోర్ ఎంతో కష్టపడ్డారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జివాలా అన్నారు. ‘ప్రశాంత్ కిశోర్, ఆయన బృందం చేసిన కఠోర శ్రమ, తేడ్పాటుకు కాంగ్రెస్ పార్టీ విలువ ఇస్తుంది. ఆయన వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని తిరస్కరిస్తున్నామ’ని ట్విటర్ ద్వారా తెలిపారు.
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ప్రశాంత్ కిశోర్ ను వెనకేసుకొచ్చారు. సూర్జివాలా అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రశాంత్ కిశోర్, ఆయన బృందం చేసిన కృషి ఎంతోగానో ఉపయోగపడిందని చాలాసార్లు చెప్పానని అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. యూపీతో పాటు పంజాబ్ కు కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేసిన సంగతి తెలిసిందే.