యడ్యూరప్ప, ఢిల్లీలో మాట్లాడుతున్న రణ్‌దీప్ సూర్జేవాలా
సాక్షి బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గతంలో సీఎం పదవి కోసం బీజేపీ అగ్రనాయకులకు ముడుపులు ఇచ్చారంటూ తాజాగా ఎన్నికల వేళ బయటపడిన డైరీ కాగితాలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మార్మోగుతున్నాయి. ఇదంతా కాంగ్రెస్ కుట్ర అని యడ్యూరప్ప ఆరోపిస్తుంటే, ఈ విషయంపై లోక్‌పాల్‌తో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
‘ద క్యారవాన్’ అనే మేగజీన్ ఈ సంచలన విషయాలను ‘యెడ్డీ డైరీస్’ శీర్షికన కథనంగా ప్రచురించింది. డైరీ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ నేతలంతా అవినీతిపరులేనని ఆరోపించారు. ‘బీజేపీలోని కాపలాదారులంతా దొంగలే’ అంటూ రాహులో ఓ ట్వీట్ చేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ డైరీ అంశంపై లోక్‌పాల్ చేత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. యడ్యూరప్ప బీజేపీ పెద్దలకు లంచాలు ఇవ్వడం నిజమో, అబద్ధమో ప్రధాని చెప్పాలని కోరారు. 2017లో డైరీ దొరికితే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సరైన దర్యాప్తుæ జరగాలని కర్ణాటక సీఎం కుమారస్వామి అన్నారు.
శివకుమార్ ఇంట్లో దొరికాయి
2017లో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఇంట్లో సోదాల సందర్భంగా ఈ డైరీ కాగితాలు ఆదాయపు పన్ను (ఐటీ) విభాగానికి దొరికినట్లు క్యారవాన్ పేర్కొంది. 2009లో కర్ణాటక సీఎం అయ్యేందుకు యడ్యూరప్ప బీజేపీ అగ్రనేతల్లో ఎవరెవరికి లంచాలు ఇచ్చారో, అందుకోసం ఏయే ఎమ్మెల్యే దగ్గర ఆయనెంత తీసుకున్నారో ప్రస్తావిస్తూ యడ్యూరప్ప తన డైరీలో రాసుకున్నట్లుగా ఉందని కథనంలో క్యారవాన్ పేర్కొంది. కర్ణాటక బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజేను తాను కేరళలోని ఓ గుడిలో వివాహం చేసుకున్నట్లుగా కూడా ఆ డైరీలో యడ్యూరప్ప రాసినట్లు ఉందంది.
నకిలీవి అయ్యుండొచ్చు: ఐటీ విభాగం
ఈ కాగితాలపై ఐటీ విభాగం శుక్రవారం స్పందించింది. శివకుమార్ ఇంట్లో తమకు దొరికింది డైరీలోని కొన్ని పేపర్ల జిరాక్స్‌లు మాత్రమేనని స్పష్టం చేసింది. ఆ జిరాక్స్‌లు ఎక్కడి నుంచి వచ్చాయో, వాటి ఒరిజినల్ కాగితాలు ఎక్కడ ఉన్నాయో తెలియదనీ, జిరాక్స్ కాగితాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం హైదరాబాద్‌కు అప్పట్లోనే పంపినా ఒరిజినల్స్ లేనిదే జిరాక్స్‌లతో తామేమీ చెప్పలేమని ఫోరెన్సిక్ విభాగం చెప్పిందని ఐటీ విభాగం ఓ ప్రకటనలో వెల్లడించింది. తాము అప్పుడే యడ్యూరప్పను కూడా పిలిచి విచారించామనీ, ఆ డైరీ తాను రాసింది కాదనీ, అసలు తనకు డైరీ రాసే అలవాటే లేదని ఆయన చెప్పారంది. ఒరిజినల్ కాగితాలు ఎక్కడా లభించనందున ఆ జిరాక్స్‌లు నకిలీవి అయ్యుండొచ్చంది.
ఆ డైరీ నిజం కాదు: యడ్యూరప్ప
డైరీలో తాను రాసినట్లుగా చెబుతున్న విషయాలన్నీ అవాస్తవాలేనని యడ్యూరప్ప కొట్టిపారేశారు. బెంగళూరు డాలర్స్ కాలనీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలవి దివాలాకోరు రాజకీయాలని మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేసి లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ నేతలు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఆ డైరీలోని అంశాలు ఫోర్జరీ చేసినవీ, నకిలీవని ఐటీ అధికారులు నిర్ధారించినట్లు యడ్యూరప్ప చెప్పారు. కాంగ్రెస్ ఆరోపణలకు బీజేపీ ఎదురుదాడి చేసింది. ఆ డైరీ నకిలీదని, డైరీ పేరిట కాంగ్రెస్ చేస్తున్నదంతా నాటకమని, అదంతా ఒక పథకం ప్రకారం సాగుతున్నదని ఆరోపించింది. డైరీలోని చేతిరాత, నకిలీ అని, అది యడ్యూరప్ప సంతకమే కాదని బీజేపీ స్పష్టం చేసింది.
ఎవరెవరికి ఎంతెంత?
క్యారవాన్ కథనం ప్రకారం ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీ కేంద్ర కమిటీకి రూ. 1000 కోట్లు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, రవాణా మంత్రి నితిన్ గడ్కరీలకు చెరో రూ. 150 కోట్లు, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు రూ. 100 కోట్లు, బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలకు చెరో రూ. 50 కోట్లు లంచంగా ఇచ్చినట్లు యడ్యూరప్ప డైరీలో రాసుకున్నారు. పలువురు జడ్జీలకు రూ. 250 కోట్లు, న్యాయవాదులకు రూ. 50 కోట్లు ఇచ్చినట్లు రాసుకొచ్చారు. న్యాయమూర్తులు, న్యాయవాదుల పేర్లను డైరీలో పేర్కొనలేదు. అలాగే గడ్కరీ కొడుకు వివాహ వేడుకలకు రూ. 10 కోట్లు ఖర్చు చేశానని డైరీలో యడ్యూరప్ప రాశారు.
తాను ముఖ్యమంత్రి అవ్వడంలో రాష్ట్ర మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారని డైరీలో యడ్యూరప్ప రాశారు. ఆయన ఆర్థికంగా ఆదుకున్నారని పేర్కొన్నారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మంది ఆర్థిక సాయం చేశారని వారి పేర్లను వివరాలతో సహా రాసుకొచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలు నరేంద్ర స్వామి రూ. 20 కోట్లు, గోళిహట్టి శేఖర్ రూ. 10 కోట్లు, బాలచంద్ర జారకిహోళి రూ. 20 కోట్లు, డి.సుధాకర్ రూ. 20 కోట్లు, శివనగౌడ నాయక్ రూ. 20 కోట్లు, వెంకటరమణప్ప రూ. 20 కోట్లు, నారాయణ స్వామి రూ. 20 కోట్లు, ఆనంద్ అస్నోటికర్ రూ. 20 కోట్లు ఆర్థిక సాయం చేసినట్లు డైరీలో రాసి ఉంది. అయితే వీరంతా తాము ఎలాంటి సాయం చేయలేదని ఒక్కొక్కరిగా చెప్పుకుంటూ వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment