
చండీగఢ్ : హర్యానా ప్రభుత్వం విద్యార్థుల స్కూల్ అడ్మిషన్లకు సంబంధించి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. పిల్లల్ని స్కూల్‌లో చేర్పించాలంటే 100 పాయింట్లతో కూడిన దరఖాస్తుని పూర్తి చేయాలని మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో వివాదం ఏముందని అనుకుంటున్నారా.. అందులోని అంశాలని పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు.
మాములుగా పిల్లల్ని పాఠశాలలో చేర్పించాలంటే వారి తల్లిదండ్రుల పేర్లు, చిరునామా సమర్పిస్తే సరిపోతుంది. కానీ హర్యానాలో పిల్లల తల్లిదండ్రులు చట్టవిరుద్ధ వృత్తిలో కొనసాగుతున్నారా, ఆదాయం, పన్ను చెల్లింపుల సంబంధించిన ప్రశ్నలను అప్లికేషన్ ఫామ్‌లో పొందుపర్చారు. అంతేకాకుండా ఆధార్ నంబర్లు, విద్యార్హతలు, మతం, కులం, జన్యుపరమైన లోపాలు వంటివి కూడా దరఖాస్తులో పేర్కొనాలి. హర్యానా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఈ చర్యపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. బీజేపీ ప్రభుత్వం ప్రజల కుల, మత వివరాలు సేకరించడంలో మునిగిపోయిందని ఆ పార్టీ సీనియర్ నేత రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా ట్విటర్‌లో ఆరోపించారు. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పిల్లలతో పాటు తల్లిదండ్రులపై నిరంతరం నిఘా ఉంచడానికే అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఈ నిబంధనను వెనక్కి తీసుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment