
అమెరికా ఇచ్చే ఉపన్యాసాలను వినాల్సిన అవసరం భారత్‌కు ఎంతమాత్రం లేదు.
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధానిని అవహేళన చేస్తూ మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రభుత్వం గట్టి సమాధానమివ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. అఫ్గానిస్తాన్‌లో పౌరుల భద్రతను పట్టించుకోకుండా నరేంద్ర మోదీ అక్కడ లైబ్రరీ స్థాపనకు సాయం చేస్తానడం విడ్డూరంగా ఉందని ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. అమెరికా అఫ్గనిస్తాన్‌లో ఐదు గంటలకు చేసే ఖర్చుతో ఆ లైబ్రరీ సమానం అంటూ వెటకారపు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై స్పందించిన కాంగ్రెస్ కీలక నేత అహ్మద్ పటేల్ మాట్లాడుతూ...‘ భారత ప్రధాని గురించి అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. 2004 నుంచి అఫ్గనిస్తాన్‌లో రోడ్లు, డ్యాముల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు భారత ప్రభుత్వం దాదాపు 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది. ఈ విషయాలన్నీ ట్రంప్‌నకు ఒకసారి గుర్తుచేస్తే బాగుంటుంది’ అని వ్యాఖ్యానించారు. (ప్రధాని మోదీపై ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు)
భారత ప్రధానిని హేళన చేయడం ఆపండి
‘ప్రియమైన ట్రంప్ గారు.. భారత ప్రధానిని వెక్కిరించడం ఆపండి. అఫ్గనిస్తాన్ విషయంలో అమెరికా ఇచ్చే ఉపన్యాసాలను వినాల్సిన అవసరం భారత్‌కు ఎంతమాత్రం లేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో ఆ దేశ పార్లమెంట్ భవన నిర్మాణానికి భారత్ సాయం చేసింది. మానవతా దృక్పథంతో కూడిన వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యం అవసరమే. మా అఫ్గానీ సోదరసోదరీమణులకు మేము అండగా ఉంటాం’ అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ట్విటర్ వేదికగా ట్రంప్ తీరును విమర్శించారు.
Dear Mr. Trump,
— Randeep Singh Surjewala (@rssurjewala) January 3, 2019
Stop mocking India’s PM
India dosn’t need sermons from the U.S on Afghanistan
Under Dr Manmohan Singh, India helped build Afghan National Assembly
Humanitarian needs to strategic economic partnership, we are one with our Afghani brothers & sisters pic.twitter.com/DlK9BM9XsZ