
సీఎం యోగి ఆదిత్యనాథ్ (పాత ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నావ్ అత్యాచార ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ ఘటనలో యోగినే నిజమైన దోషి అని ఆ పార్టీ నేత రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యత వహించి యోగి తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలహాబాద్ కోర్టు యూపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. బాధితురాలి బంధువులు సీఎం ఇంటిముందే ఆత్మహత్య యత్నం చేసినా యోగి స్పందించలేదని విమర్శించారు.
బీబేపీ పాలనలో రైతులు, మహిళలు, దళితులు కష్టాలు ఎదుర్కొంటున్నారని.. యూపీలో ప్రభుత్వపాలన రావణరాజ్యాన్ని తలపిస్తుందని సుర్జేవాలా మండిపడ్డారు. బీజేపీ నాయకులు నిందితుల పక్షాన నిలుస్తూ బాధితుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారని.. యోగీ కూడా అదే బాటలో నడుస్తున్నారని ఆయన వాఖ్యానించారు. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శశి సింగ్ అనే మహిళను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. బాధితురాలిని ప్రలోభపెట్టి ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్ సెంగార్ దగ్గరికి తీసుకెళ్లడంలో శశి సింగ్‌దే కీలక పాత్ర అని ఆరోపణలు రావడంతో అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment