అహ్మదాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్‌పార్టీ ఘోరంగా దెబ్బతినడంతో డీలా పడిన రాహుల్ గాంధీకి మరో చిక్కొచ్చిపడింది. అహ్మదాబాద్ జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ (ఏడీసీబీ) వేసిన పరువునష్టం దావాలో ఆయన జూలై 12న తమముందు హాజరు కావాల్సిందేనని అహ్మదాబాద్ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. తొలుత మే 27కు ముందే హాజరు కావాలని కోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే, కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు గుజరాతి నుంచి ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేయడంలో ఆలస్యం .. అదే సందర్భంలో మే 27న భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి కావడంతో రాహుల్ శాంతివనానికి వెళ్లడం వంటి కారణాలతో కోర్టు కొంత సడలింపునిచ్చింది. ఈకేసులో రాహుల్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సుర్జేవాలా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అసత్య ఆరోపణలు.. చిక్కులు..
నోట్లరద్దు (నవంబర్ 8, 2016) ప్రకటన వెలువడిన ఐదు రోజుల అనంతరం అహ్మదాబాద్ జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ అక్రమాలకు పాల్పడిందని, రూ.745.59 కోట్ల రద్దయిన నోట్లను మార్పిడి చేసిందని రాహుల్ గాంధీ, సుర్జేవాలా ఆరోపణలు చేశారు. దీనిపై ఏడీసీబీ బ్యాంక్ చైర్మన్ అజయ్ పటేల్, మరో ముగ్గురు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదైంది. అసత్య ఆరోపణలు చేసి బ్యాంక్ నైతికతను దెబ్బతీశారని ఫిర్యాదు దారులు కోర్టుకు విన్నవించగా.. కోర్టు విచారణ చేపట్టింది. ప్రాథమిక సాక్ష్యాధారాల ఆధారంగా రాహుల్, సుర్జేవాలాకు నోటీసులిచ్చింది. అహ్మదాబాద్ జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లలో అమిత్‌షా ఒకరు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment