'గాడ్సే వారసులనుంచి దేశభక్తి మాకొద్దు'
న్యూఢిల్లీ: జేఎన్యూ వివాదం విషయంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దేశ భక్తి గురించి తాము గాడ్సే వారసుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ సుర్జీవాలా అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన విమర్శలకు ప్రతిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీకి జాతీయ భావాలకు, జాతీయ భావాలను వ్యతిరేకించే వాళ్లకు మధ్య తేడా తెలియడం లేదని, దేశభక్తి గురించి ఆయనకేం తెలియదని అమిత్ షా అన్నారు. దీనిపై స్పందించిన రణ్ దీప్ తాము దేశ భక్తి గురించి ఎన్డీయే వద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. నేరుగా ఎన్డీయే పేరును ప్రస్తావించకుండా 'ఎవరు మహాత్ముని సిద్ధాంతాన్ని చంపేశారో, ఎవరు నాధురాం గాడ్సే వారుసులో వారి వద్ద నుంచి మేం దేశ భక్తి నిర్వచనాన్ని తెలుసుకోవాలనుకోవడం లేదు' అని ఆయన అన్నారు.