స్టీరింగ్ కమిటీ భేటీలో సోనియా, రాహుల్
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్లీనరీ ముహూర్తం ఖరారైంది. ఢిల్లీలో వచ్చే నెల 16, 17, 18వ తేదీల్లో జరిగే ఈ సమావేశాల్లో పార్టీ భవిష్యత్ దిశానిర్దేశం ఖరారవుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం సెంట్రల్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని రద్దుచేసి, 34 మందితో కూడిన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శనివారం రాహుల్‌తోపాటు పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లతో కూడిన స్టీరింగ్ కమిటీ సమావేశమై ప్లీనరీ తేదీలను ఖరారు చేసింది.
సీడబ్ల్యూసీలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలతోపాటు వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఉంటుందని రాహుల్ చెప్పినట్లు సమాచారం. స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ప్లీనరీకి పీసీసీ ప్రతినిధులతోపాటు, రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయి నాయకులు కలిపి దాదాపు 20వేల మంది హాజరవుతారని అంచనా. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సందర్భంగా నేతలకు రాహుల్ వివరిస్తారు.
అయితే, ప్లీనరీలోనే సీడబ్ల్యూసీని ఎన్నుకుంటారా లేక తర్వాత నామినేట్ చేస్తారా అనే విషయంలో సందిగ్ధం ఏర్పడింది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని మొదట్నుంచీ చెబుతున్న రాహుల్ గాంధీ..ఎన్నికల ద్వారా సీడబ్ల్యూసీని ఏర్పాటు చేయాలని భావిస్తుండగా సీనియర్ నేతలు మాత్రం నామినేట్ చేయాలంటూ ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. సీడబ్ల్యూసీలోని 25 మందిలో కనీసం సగం మందిని ఎన్నుకోవాలని పార్టీ నిబంధనలు చెబుతున్నప్పటికీ.. గాంధీ కుటుంబానికి చెందిన వారసులకు పార్టీపై సహజంగా పూర్తి స్థాయి పట్టు ఉండటంతో నామినేట్ చేస్తూ వస్తున్నారు. పీవీ నరసింహారావు, సీతారాం కేసరి హయాంలో మాత్రం సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment