steering comitee meeting
-
మార్చి 16 నుంచి ప్లీనరీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్లీనరీ ముహూర్తం ఖరారైంది. ఢిల్లీలో వచ్చే నెల 16, 17, 18వ తేదీల్లో జరిగే ఈ సమావేశాల్లో పార్టీ భవిష్యత్ దిశానిర్దేశం ఖరారవుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం సెంట్రల్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని రద్దుచేసి, 34 మందితో కూడిన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శనివారం రాహుల్‌తోపాటు పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లతో కూడిన స్టీరింగ్ కమిటీ సమావేశమై ప్లీనరీ తేదీలను ఖరారు చేసింది. సీడబ్ల్యూసీలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలతోపాటు వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఉంటుందని రాహుల్ చెప్పినట్లు సమాచారం. స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ప్లీనరీకి పీసీసీ ప్రతినిధులతోపాటు, రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయి నాయకులు కలిపి దాదాపు 20వేల మంది హాజరవుతారని అంచనా. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సందర్భంగా నేతలకు రాహుల్ వివరిస్తారు. అయితే, ప్లీనరీలోనే సీడబ్ల్యూసీని ఎన్నుకుంటారా లేక తర్వాత నామినేట్ చేస్తారా అనే విషయంలో సందిగ్ధం ఏర్పడింది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని మొదట్నుంచీ చెబుతున్న రాహుల్ గాంధీ..ఎన్నికల ద్వారా సీడబ్ల్యూసీని ఏర్పాటు చేయాలని భావిస్తుండగా సీనియర్ నేతలు మాత్రం నామినేట్ చేయాలంటూ ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. సీడబ్ల్యూసీలోని 25 మందిలో కనీసం సగం మందిని ఎన్నుకోవాలని పార్టీ నిబంధనలు చెబుతున్నప్పటికీ.. గాంధీ కుటుంబానికి చెందిన వారసులకు పార్టీపై సహజంగా పూర్తి స్థాయి పట్టు ఉండటంతో నామినేట్ చేస్తూ వస్తున్నారు. పీవీ నరసింహారావు, సీతారాం కేసరి హయాంలో మాత్రం సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరిపారు. -
మనం ఎటువైపు?
- ప్రజా పక్షమా.. ప్రభుత్వ పక్షమా? - జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీలో చర్చ హైదరాబాద్: ‘ఇంతకూ మనం ఎటువైపున్నాం.. ప్రభుత్వం వైపా లేక ప్రజల వైపున్నామా? ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం రాజకీయంగా కూడా గుర్తింపు లేకుండా పోయింది’ అని టీజేఏసీలో చర్చ మొదలైంది. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన మంగళవారం జేఏసీ స్టీరింగ్ కమిటీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ప్రభుత్వ విధానాలు, జేఏసీ తీరుపై చ ర్చించేందుకు కొందరు జిల్లా కన్వీనర్లు ప్రయత్నించగా వారించిన కోదండరాం మరో ఇరవై రోజుల్లో సమావేశమై పూర్తిస్థాయిలో సమీక్షించుకుందామని అన్నట్లు తెలిసింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇన్నాళ్లూ కొంత స్తబ్ధుగా ఉన్న జేఏసీని మళ్లీ పట్టాలెక్కించడానికి జరగాల్సిన ప్రయత్నాలపైనా చర్చ జరిగింది. ప్రభుత్వ విధానాలపై ఊరికే వ్యాఖ్యలు చేయకుండా, సవివ ర నివేదికలు తయారు చేసి మాట్లాడుదామని స్టీరింగ్ కమిటీ సభ్యులకు కోదండరాం సూచించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో తొందరపడకుండా, ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా, విమర్శలు చేయకుండా ప్రభుత్వ కార్యదర్శికి నివేదికలు ఇవ్వాలని, పట్టించుకోకుంటే ఆ నివేదికలనే ప్రజల మధ్య పెట్టాలన్న చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రభుత్వాన్ని బదనాం చేసే ఉద్దేశంతో కాకుం డా నిర్మాణాత్మక సలహాలివ్వాలన్న నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వర్సిటీ స్థలాల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్న సీఎం కేసీఆర్ హామీపై ఎలాంటి చర్చ జరగలేదంటున్నారు. ఈ విషయంలో స్పష్టత వచ్చేదాకా వేచి చూడాలని అభిప్రాయపడినట్లు తెలిసింది. పెండింగులో ఉన్న విభజనకు సంబంధించిన అంశాలపైనా, పూర్తిస్థాయి స్వయం పాలన సాధించుకోవడంపైనా చర్చ జరిగింది. కాగా తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణ వేడుకలను ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందో, ఎవరికి బాధ్యతలు అప్పజెప్పిందో ఎలాంటి స్పష్టత లేదని కొందరు సభ్యులు ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ ఉత్సవాలకు కమిటీని వేస్తే టీజేఏసీ నేతలకు గుర్తింపు ఇవ్వాలని, ఉత్సవాల కమిటీకి చైర్మన్‌గా కోదండరాంకు బాధ్యతలు అప్పజెప్పాలని ఓ సభ్యుడు అన్నట్లు సమాచారం.