
ఉగ్రదాడి సమయంలో ప్రధాని షూటింగ్‌లో బిజీగా గడిపారన్న కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించడంతో దేశమంతా విషాదంలో మునిగితే ఘటన జరిగిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార చిత్రం షూటింగ్‌లో కొనసాగారని కాంగ్రెస్ ఆరోపించింది. పుల్వామా ఘటనలో మరణించిన జవాన్ల మృతదేహాలను లెక్కిస్తుండగానే, ప్రధాని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో బోటులో విహరిస్తూ ప్రచార చిత్రానికి బాలీవుడ్ స్టార్‌లా ఫోజులిచ్చారని దుయ్యబట్టింది.
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం ప్రధానికి తెలిసినా ప్రచార చిత్రం షూటింగ్‌లో కొనసాగడాన్ని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా తప్పుపట్టారు. ప్రధాని మోదీ రాజధర్మాన్ని విస్మరించారని ఆరోపించారు. ప్రధాని బాధ్యతారహితంగా వ్యవహరించారని, ప్రచార చిత్రంలో పాల్గొనడానికి బదులు ఆయన తక్షణమే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో పాల్గొని ఉండాలని పేర్కొన్నారు. అమరవీరులను అవమానపరిచేలా ప్రధాని మోదీ వ్యహరించారని విమర్శించారు.