జైపూర్: ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు రాజస్థాన్ కాంగ్రెస్ ఇంఛార్జ్ సుఖ్‌జిందర్ సింగ్ రంధావా. ఎన్నికల ప్రయోజనాల కోసం పుల్వామా దాడిని ఆయనే చేయించి ఉంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 44 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఈ ఉగ్ర ఘటన ఎలా జరిగిందో ఇప్పటివరకు ఇంకా ఏమీ తెలియకపోవడం ఏంటని ప్రశ్నించారు. జైపూర్‌లో కాంగ్రెస్ ధర్నాలో మాట్లాడుతూ రంధావా ఈ వ్యాఖ్యలు చేశారు.
'పంజాబ్‌లో మాపియాను కాంగ్రెస్ అంతం చేసింది. అకాలీదళ్‌ను శాశ్వతంగా లేకుండా చేశాం. తలచుకుంటే మోదీని గద్దె దించలేమా? మా గ్రామం పాకిస్థాన్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కానీ మేము ఆ దేశానికి ఎప్పుడూ భయపడలేదు. ఇంట్లోకి చొరబడి అంతం చేస్తాం అని మోదీ ప్రగల్భాలు పలుకుతారు. అలాంటప్పుడు పుల్వామాలో దాడి ఎలా జరిగింది. దానిపై విచారణ జరపండి. ఈరోజు వరకు ఆ ఘటన ఎలా జరిగిందో తెలియదు. ఎన్నికల ప్రయోజనాల కోసమే ఇది జరగలేదంటారా? అని రంధావా తీవ్ర ఆరోపణలు చేశారు.
అలాగే మోదీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు అందరు కలిసి రావాలని రంధావా పిలుపునిచ్చారు. మోదీ దిగిపోతేనే భారత్‌ను కాపాడగలమన్నారు. ఓకవేళ మోదీనే మళ్లీ అధికారంలో ఉంటే భారత్ పని అయిపోతుందన్నారు. తమకంటే గొప్ప దేశభక్తులు లేరని బీజేపీ నేతలు చెప్పుకుంటారని, అసలు దేశభక్తి అనే పదానికి అర్థం కూడా మోదీకి తెలియదని విమర్శించారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నవారిలో ఒక్క బీజేపీ నేత అయినా ఉన్నాడా? అని ప్రశ్నించారు.
హిండెన్‌బర్గ్ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరపాలని కోరుతూ కాంగ్రెస్ జెపూర్‌లో ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలోనే పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ రంధావా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను నాశనం చేసేందుకు ఈస్ట్ ఇండియా కెంపెనీలాంటి అదానీ సంస్థను మోదీ తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. మోదీ అధికారం నుంచి దిగిపోతే అదానీ కంపెనీ కూడా కనుమరుగు అవుతుందని వ్యాఖ్యానించారు.
బీజేపీ కౌంటర్
రంధావా వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. పుల్వామా ఘటనలో పాకిస్తాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఆయన మాట్లాడారని, కాంగ్రెస్ మరోసారి హద్దులు మీరి మాట్లాడిందని ధ్వజమెత్తింది. సైనికుల త్యాగాలను అవమానించిన ఆయనపై చర్యలు తీసుకుని, పదవి నుంచి తప్పిస్తారా లేదా? సమర్థిస్తారా అని హస్తం పాార్టీని ప్రశ్నించింది.
చదవండి: ప్రియాంక గాంధీ పెయింటింగ్‌కు రూ.2 కోట్లా? కాంగ్రెస్ అవినీతిలో రోజుకో కొత్త మోడల్
Comments
Please login to add a commentAdd a comment