సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పుతో పాటు సంస్ధాగత ఎన్నికల్లో పారదర్శకత కోరుతూ దాదాపు 100 మంది పార్టీ నేతలు తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారని పేర్కొన్న సంజయ్ ఝాపై ఆ పార్టీ వేటువేసింది. పార్టీ నుంచి సంజయ్ ఝాను సస్సెండ్ చేసిన అనంతరం ఆయన బీజేపీ ఆదేశాలతో వదంతులు వ్యాప్తి చేస్తున్నారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. సంజయ్ ఝా చెబుతున్నట్టు పార్టీ అధ్యక్షురాలికి అలాంటి లేఖను ఎవరూ రాయలేదని స్పష్టం చేసింది. సంజయ్ తమ పార్టీ సభ్యుడు కాదని, ఫేస్‌బుక్-బీజేపీ సంబంధాల నుంచి దేశం దృష్టిని మరల్చేందుకే ఆయన బీజేపీ ఆదేశాలతో వదంతులను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించింది. సోనియా గాంధీకి 100 మంది కాంగ్రెస్ నేతలు లేఖ రాశారనే వార్తలను ఆ పార్టీ నేతలు ఎవరూ ధ్రువీకరించలేదు.
కాగా పార్టీలో నాయకత్వ మార్పును కోరడంతో పాటు పార్టీ సంస్ధాగత ఎన్నికల్లో పారదర్శకతను కోరుతూ చట్టసభ సభ్యులు సహా దాదాపు 100 మంది పార్టీ నేతలు సోనియా గాంధీకి లేఖరాశారని సంజయ్ ఝా పేర్కొనడం కలకలం రేపింది. సోనియాను ఆశ్రయించిన నేతలంతా పార్టీ దుస్థితిపై కలత చెందారని సంజయ్ వ్యాఖ్యానించారు. కాగా ఫేస్‌బుక్-బీజేపీ సంబంధాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ నేతలు వాట్సాప్ గ్రూప్‌ల్లో ఇలాంటివి ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా ఆరోపించారు. మరోవైపు బీజేపీకి ఫేస్‌బుక్ వత్తాసు పలుకుతోందని, సోషల్ మీడియా వేదికగా విద్వేష ప్రచారం, సందేశాలను పోస్ట్ చేసేందుకు బీజేపీ నేతలను ఎఫ్‌బీ అనుమతిస్తోందన్న వాల్‌స్ర్టీట్ జర్నల్ కథనం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎఫ్‌బీ, వాట్సాప్‌లను బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు ఆరోపించారు. చదవండి : ప్రజాస్వామ్యానికి పరీక్షా సమయం
Comments
Please login to add a commentAdd a comment