
ఐదుగురు దుర్మరణం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
మృతులంతా కర్ణాటక, తమిళనాడు వాసులు
తిరుపతి జిల్లా కోనపరెడ్డిపల్లిలో ఘోరప్రమాదం
తిరుపతి రూరల్/పాకాల/అమరావతి:
కారు అదుపు తప్పి కంటైనర్‌ను ఢీకొట్టి దాని దిగువన చిక్కుకుపోగా.. గుర్తించని కంటైనర్ డ్రైవర్ కారును ఈడ్చుకుని పోయిన ఘటన తిరుపతి జిల్లా పాకాల మండలం కోనపరెడ్డిపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు కారులో శనివారం తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
సోమవారం వీరంతా ఒకే కారులో తిరిగి వెళుతుండగా.. పాకాల మండలం కోనపరెడ్డిపల్లి వద్ద కారు అదుపుతప్పి ముందు వెళుతున్న కంటైనర్‌ను వెనుకనుంచి ఢీకొట్టి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ విషయాన్ని గమనించని కంటైనర్ డ్రైవర్, కంటైనర్‌తోపాటు కారునూ వంద మీటర్ల దూరం వరకూ లాక్కుని వెళ్లడంతో కారు మొత్తం నుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో కర్ణాటకలోని బెంగుళూరు గౌడన్‌పాళ్యకు చెందిన విజయలక్ష్మి (50), సహాన (34), ఎస్‌ఆర్ రజని (27), ఆర్.లేఖన్ గౌడ (11), తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరుకు చెందిన ఎస్.త్యాగరాజన్ (42) అక్కడికక్కడే మృతి చెందారు.
కర్ణాటకలోని సబ్బనహళ్లికి చెందిన గీతమ్మ, తమిళనాడులోని హోసూరుకు చెందిన టి.క్రిస్‌విన్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. జాతీయ రహదారిపై భారీ శబ్దం రావడంతో సమీప గ్రామాల ప్రజలు ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించి పరుగు పరుగున అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఘటనా స్థలిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి కంటైనర్‌ను సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సీఎం చంద్రబాబు విచారం
ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కర్ణాటక, తమిళనాడు వాసుల కుటుంబీకులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని, చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కలెక్టర్, ఎస్పీలను సీఎం ఆదేశించారు. ఘటనపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి విచారం వ్యక్తం చేస్తూ మెరుగైన సేవలు అందించాలని జిల్లా అధికారులకు సూచించారు.