
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో కూటమి ఎమ్మెల్యేకు బిగ్ షాక్ తగిలింది. పల్లెనిద్రలో పాల్గొన్న ఎమ్మెల్యేను ఓ మహిళ ప్రశ్నించారు. ఐదేళ్ల తర్వాత ఓట్ల కోసం మాత్రమే ఎమ్మెల్యే వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, సదరు ఎమ్మెల్యే ఖంగుతిన్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం కోసం ఎమ్మెల్యే కూన రవికుమార్ అక్కడికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో స్థానికురాలు రేవతి.. ఎమ్మెల్యే రవికుమార్‌ను నిలదీసింది. కూటమి పాలనను ఎండగట్టింది. ఈ సందర్బంగా బొమ్మాళి రేవతి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రతీ మహిళకు 15 వందల రూపాయలు ఇస్తానని చంద్రబాబు చెప్పాడు. గెలిచాక ఎందుకు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఆ హామీ ఏమైంది అంటూ ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రశ్నించింది.
అలాగే, కొళాయిల్లో మంచినీరు రావడం లేదు. ఈ విషయమై అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఐదేళ్ల తర్వాత ఓట్ల కోసం మాత్రమే మీరు వస్తున్నారు. అంతేకానీ, పేదల కోసం మీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. అయితే, కొద్దిరోజుల క్రితం ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
