సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాకు వచ్చిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటనలో మాజీ విప్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కనిపించలేదు. ఉద్దేశపూర్వకంగా గైర్హాజరయ్యారా? మరేదైనా కారణం ఉందా అన్నది తెలీదు గానీ టీడీపీలో మాత్రం ఇది తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రి పదవి ఆశించి భంగపడిన కూన రవికుమార్ గుర్రుగా ఉండటం వల్లనే రాకపోయి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది.
మంత్రి పదవిపై ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాళింగ సామాజిక వర్గం నుంచి తప్పనిసరిగా కేబినెట్‌లో బెర్త్ ఖాయమని భావించారు. కానీ అంచనాలు తలకిందలయ్యాయి. కింజరాపు ఫ్యామిలీకి ఇచ్చేందుకే మొగ్గు చూపారే తప్ప కూన రవికుమార్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో కాళింగ సామాజిక వర్గమంతా గుర్రుగా ఉంది. ప్రెస్‌మీట్లు, సమావేశాలు పెట్టి నిరసన కూడా తెలియజేశారు. చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తంచేయడమే కాకుండా సమయం వచ్చి నప్పుడు తామేంటో చూపిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాళింగులు ఎన్ని చేసినా ఫలి తం కనిపించడంలేదు. చంద్రబాబు నుంచి సాను కూలత రావడం లేదు. చిన్నా చితకా పదవి ఇచ్చి సరిపుచ్చుకునేలా ఉన్నారు. ఈ క్రమంలో భారీ ఆశలు పెట్టుకున్న కూన రవికుమార్ కూడా ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిస్తే తమకిచ్చే గౌరవమిదా అని ఆయన వర్గీయులు బాధపడుతున్నారు.
కూన రవికుమార్‌తో పాటు కాళింగ సామాజిక వర్గమంతా అసంతృప్తితో ఉన్న వేళ.. జిల్లాలోకి అడుగు పెట్టిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడుకు స్వాగతం పలికేందుకు ఒక వర్గం హాజరు కాలేదు. సోమవారం రాత్రి జరిగిన ఆత్మీయ సభలోనూ పాల్గొనలేదు. మంగళవారం జిల్లా అధికారులతో జరిగిన తొలి సమావేశం ప్రాంగణానికి కూడా రాలేదు. ఏడు రోడ్ల కూడలి వద్ద మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సభకు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ హాజరయ్యారు. కానీ, కూన రవికుమార్, బెందాళం అశోక్ ఎక్కడా కనిపించలేదు. మంగళవారం జెడ్పీలో జరిగిన అధికారుల సమావేశంలో కూడా వీరిద్దరూ పాల్గొనలేదు. కాళింగ సామాజిక వర్గానికి మొండి చేయి చూపారన్న అసంతృప్తితో ఉద్దేశకపూర్వకంగా గైర్హాజరయ్యారా? లేదంటే మరే కారణం చేతో రాలేదా? అన్నది తెలియదు గాని పార్టీ శ్రేణులు మాత్రం కాళింగులకు జరిగిన అవమానం వలనే దూరంగా ఉండి ఉండవచ్చని అని చర్చించుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment