
విద్యా సంస్థల్లో కలవర పెడుతున్న ర్యాగింగ్ మరణాలు
గడిచిన మూడేళ్లలో 51 మంది విద్యార్థులు బలి
కోటాలో ఆత్మహత్యలతో సమానంగా ర్యాగింగ్ మరణాలు
ర్యాగింగ్‌కు హాట్‌స్పాట్‌లుగా వైద్య కళాశాలలు
దేశంలోని విద్యార్థుల సంఖ్యలో 1.1 శాతమే వైద్య కోర్సుల సీట్లు
మెడికల్ కాలేజీల నుంచి వచ్చిన ఫిర్యాదులు 38.6 శాతం
సేవ్ సంస్థ ‘స్టేట్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఇండియా 2022–24’ నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: దేశ విద్యా వ్యవస్థను ర్యాగింగ్ భూతం వెంటాడుతోంది. బంగారు భవిష్యత్తు కోసం కలలు కనే ఎందరో విద్యార్థుల ప్రాణాలను బలి కోరుతోంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ర్యాగింగ్ మాటున మితిమీరిన చేష్టలు చావు కేకలు పెట్టిస్తున్నాయి. ఇవి ఎంతగా ఉన్నాయంటే కోటాలో విద్యార్థుల బలవన్మరణాలతో దాదాపు సమానంగా ర్యాగింగ్ మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వైద్య విద్యా సంస్థల్లో ర్యాగింగ్ ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపిస్తోంది.
సొసైటీ అగైనెస్ట్ వయొలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ (సేవ్) సంస్థ ‘స్టేట్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఇండియా 2022–24’ నివేదిక ప్రకారం.. వర్సిటీలు, కళాశాలల్లో 2022 – 24 మధ్య కాలంలో 51 ర్యాగింగ్ మరణాలు నమోదైనట్టు తేలింది. ఇందులో వైద్య కళాశాలలను ర్యాగింగ్ ఫిర్యాదులకు ‘హాట్‌స్పాట్’లుగా గుర్తించింది. దేశంలోని విద్యార్థుల సంఖ్యలో వైద్య విద్యార్థుల సంఖ్య 1.1 శాతమే. కానీ, మొత్తం ఫిర్యాదుల్లో వైద్య కళాశాలల నుంచి వచ్చినవి 38.6 శాతం.
అందని ఫిర్యాదులు ఎన్నో..
దేశంలోని 1,946 కళాశాలల నుంచి నేషనల్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌లో నమోదైన 3,156 ఫిర్యాదుల ఆధారంగా ఈ నివేదిక కీలక ధోరణులను అంచనా వేసింది. ఇందులో అధిక ప్రమాదకర సంస్థలు, ర్యాగింగ్ సంబంధిత కేసుల తీవ్రతను గుర్తించింది. వాస్తవానికి నివేదికలో ఇచ్చిన ఫిర్యాదులు మూడేళ్లలో కేవలం జాతీయ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌లో నమోదు చేసినవి మాత్రమేనని విశ్లేషకులు తెలిపారు. ఇందులో నమోదవని ఫిర్యాదులు ఇంకా చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయని చెబుతున్నారు.
కళాశాలలకు నేరుగా నమోదయ్యే ఫిర్యాదులు భారీ సంఖ్యలో ఉన్నాయని, కేసు తీవ్రతను బట్టి నేరుగా పోలీసులకు కూడా అందుతాయని వివరించారు. సాధారణంగా తక్కువ సంఖ్యలోని బాధితులు దైర్యంగా ముందుకొచ్చి సమస్యను నివేదిస్తారని, అందుకే చాలా కేసులు బయటకు రావడంలేదని అభిప్రాయపడ్డారు. బాధితుల వ్యక్తిగత గోప్యతను కాపాడటానికి పేరు లేకుండా ఫిర్యాదులను స్వీకరించాలని జాతీయ ర్యాగింగ్ వ్యతిరేక హెల్ప్‌లైన్‌కు ఈ నివేదిక సిఫారసు చేసింది.
వైద్య కళాశాలల్లో ర్యాగింగ్ ఎమర్జెన్సీ..
తాజా నివేదికలో నమోదైన 51 ర్యాగింగ్ మరణాల్లో సుమారు 45.1 శాతం వైద్య కళాశాలల్లో జరిగినవే. వైద్య కళాశాలల్లో 23 మంది ర్యాగింగ్ భూతానికి బలైపోయారు. ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే వైద్య కళాశాలలు, వర్సిటీల్లో 30 శాతం అధికంగా ర్యాగింగ్ మరణాలు నమోదవుతున్నాయని సేవ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య కళాశాలల్లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన సమయం వచ్చిందని హెచ్చరించింది.
ర్యాగింగ్ నియంత్రణ బృందాలు పర్యవేక్షించాలి
ర్యాగింగ్ నియంత్రణకు సేవ్ సంస్థ చేసిన ప్రధాన సూచనల్లో కొన్ని..
» కళాశాలలు అంకితభావంతో కూడిన వ్యక్తులతో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలి
» కొత్తగా కళాశాలల్లో చేరే విద్యార్థులకు సుహృద్భావ వాతావరణంలో విద్యను అందించాలి
» యూజీసీ, ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం కొత్తగా చేరే విద్యార్థులకు ప్రత్యేక హాస్టళ్లలో వసతి కల్పించాలి
» హాస్టళ్లలోని సీసీ కెమెరాల నిఘాను భద్రతా సిబ్బంది, యాంటీ ర్యాగింగ్ కమిటీలు, తల్లిదండ్రులు పర్యవేక్షించాలి
» తీవ్రమైన ర్యాగింగ్ కేసుల్లో సంబంధిత సంస్థలు 24 గంటల్లోగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి
మూడేళ్లలో కోటా ఆత్మహత్యలతో పోలిస్తే..
కోటాలో బలవన్మరణాలసంఖ్య 57
విద్యా సంస్థల్లో ర్యాగింగ్ మరణాల సంఖ్య 51
2022 – 24 మధ్య ర్యాగింగ్ మరణాలు..
2022 14
2023 17
2024 20