
సీజ్ చేసిన టిప్పర్లు
అల్ట్రా టెక్ పరిశ్రమకు సున్నపురాయి సరఫరా చేసే టిప్పర్లు సీజ్
ప్యాకింగ్ ప్లాంట్ నుంచి 40 మంది కార్మికులను వెనక్కి రప్పించిన కాంట్రాక్టర్
లోడింగ్ లేక నిలిచిన సిమెంట్ ట్రాన్స్‌పోర్ట్ లారీలు
ఎమ్మెల్యే అపరిమిత జోక్యంతో నిలిచిపోయిన సిమెంట్ ఉత్పత్తి
ఎమ్మెల్యే ఆదేశాలతో సిమెంట్ పరిశ్రమపైనే ఫిర్యాదులు
సాక్షి ప్రతినిధి, కడప: అల్ట్రా టెక్ సిమెంట్ పరిశ్రమకు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వేధింపులు తప్పడం లేదు. ఎమ్మెల్యే తన చర్యలను సమర్థించుకుంటూనే అనుచరగణాన్ని రెచ్చగొట్టి సిమెంట్ పరిశ్రమపై ఫిర్యాదు చేయించడమే కాకుండా అధికారులను ఉసిగొల్పి ముడిఖనిజం సరఫరా టిప్పర్లను సీజ్ చేయించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఎర్రగుంట్ల సీఐ నరేశ్‌బాబు అల్ట్రా టెక్ పరిశ్రమకు ముడిఖనిజం సరఫరా చేసే ఐదు టిప్పర్లను అధిక లోడు పేరిట సోమవారం సీజ్ చేశారు.
దీంతో ట్రాన్స్‌పోర్టర్ సిమెంట్ పరిశ్రమకు ముడి ఖనిజం సరఫరా నిలిపేశారు. ఆపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రధాన అనుచరుడు, మండల బీజేపీ ఇన్‌చార్జి మధుసూదనరెడ్డి సతీమణి పేరిట నిర్వహిస్తున్న ప్యాకింగ్ ప్లాంట్ పనులు నిలిపేశారు. యాజమాన్యంతో నిమిత్తం లేకుండా 40 మంది కార్మికులను పనుల నుంచి వెనక్కి పిలిపించారు. దీంతో సిమెంట్ సరఫరా చేసే ట్రాన్స్‌పోర్టు లారీలు ఆగిపోగా.. సిమెంట్ ఉత్పత్తి సైతం నిలిచిపోయింది.
40 ఏళ్లలో తొలిసారి టిప్పర్లు సీజ్
40 ఏళ్లలో సిమెంట్ పరిశ్రమలకు ముడి ఖనిజం సరఫరా చేసే టిప్పర్లు అధిక లోడుతో వెళ్తున్నాయన్న ఆరోపణలు కూడా లేవు. గత ఏడాది ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన సీఐ సోమవారం హఠాత్తుగా ఐదు టిప్పర్లను సీజ్ చేశారు. దీనివెనుక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఉన్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మరోవైపు ప్యాకింగ్ ప్లాంట్ నిలిపేయడం పరిశ్రమ యాజమాన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టడమేనని పలువురు విమర్శిస్తున్నారు.
చేతులెత్తేసిన కలెక్టర్
అల్ట్రా టెక్ పరిశ్రమలో ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వలేదని, కాలుష్య నియంత్రణ సక్రమంగా లేదని, చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేదనే వంకతో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన అనుచరుల ద్వారా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు ఫిర్యాదు చేయించారు. వాస్తవంగా అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో 89 శాతం మంది ఉద్యోగులు స్థానికులే ఉన్నారని సమాచారం. మరోవైపు నష్టాల్లో ఉండటంతో ఈ పరిశ్రమను ఐసీఎల్ యాజమాన్యం అల్ట్రా టెక్ సంస్థకు అప్పజెప్పింది. కాలుష్య నియంత్రణ సక్రమంగా పాటిస్తున్నామని పరిశ్రమ ప్రతినిధులు వివరిస్తున్నా కలెక్టర్ శ్రీధర్ నుంచి స్పందన లేదు. తానేమీ చేయలేనంటూ చేతులెత్తిసినట్లు సమాచారం.
క్షమాపణ చెప్పకుంటే నీ దందాలు బయటపెడతా
టీడీపీ అధ్యక్షుడు పల్లాకు తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్ హెచ్చరిక
ఎంవీపీకాలనీ(విశాఖపట్నం): తనను బహిరంగంగా దూషించడంతోపాటు అవమానానికి గురిచేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ డిమాండ్ చేశారు. లేకుంటే ఆయన దందాలను, సెటిల్‌మెంట్లను బయటపెతానని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓ సమస్య విషయమై ఇటీవల పల్లా శ్రీనివాస్‌ను కలవడానికి వెళ్లగా వ్యక్తిగతంగా తనను అవమానపరిచినట్లు బీవీ రామ్ పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ కోసం విశేషకృషి చేసిన తననే అవమానిస్తే మిగతా నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంపై పలువురు టీడీపీ ముఖ్యనాయకులతోపాటు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈనెల 29లోపు పల్లా శ్రీనివాస్ క్షమాపణలు చెప్పకపోతే అధికార మదంతో విర్రవీగుతున్న అతడి భూదందాలు, సెటిల్‌మెంట్లు ఇతర అక్రమాలను బయట పెడతానని స్పష్టం చేశారు.