
ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారు.
సాక్షి, కాకినాడ: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదలతో అతలాకుతలం అయిన మాధవపురం, నాగులాపల్లి, రమణక్కపేట గ్రామాల్లో జరిగిన నష్టాన్ని స్వయంగా రైతులను అడిగి తెలుసున్నారు.


వరద బాధితుల్ని కలిసి వాళ్లకు కలిగిన కష్టం.. జరిగిన నష్టం గురించి తెలుసుకుని జగన్ ఓదార్చారు. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని, కనీసం పునరావాస కేంద్రాలకు కూడా తరలించలేదని బాధితులు జగన్ వద్ద వాపోయారు. ఈ విషయంలో పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: పవన్‌కు పెద్దగా ఏమీ తెలియదు: వైఎస్ జగన్

ఇక.. జగన్ రాకతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ప్రస్తుతం రమణక్కపేటకు జగన్ చేరుకున్నారు. కాసేపట్లో ముంపునకు గురైన పంటపొలాలను ఆయన పరిశీలిస్తారు. అక్కడి రైతులతో మాట్లాడతారు. ఈ పరామర్శలో జగన్ వెంట నియోజకవర్గ ఇంఛార్జి వంగా గీత, స్థానిక నేతలు ఉన్నారు.



ఇదీ చదవండి: బడుగు జీవితాలు పదేళ్లు వెనక్కు!
పోటెత్తిన ఏలేరు వరదతో కాకినాడ జిల్లా అతలాకుతలమైంది. ప్రధానంగా మూడు నియోజకవర్గాలపై ఏలేరు విరుచుకుపడి వివిధ వర్గాల ప్రజలు, రైతులను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. ఏలేరు వరదతో ఒక సీజన్ మొత్తాన్ని కళ్లెదుటే చేజేతులా వదిలేసుకున్నామని ఈ ప్రాంత రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ఏలేరు ప్రాజెక్టుకు పోటెత్తుతుందని ప్రభుత్వం ముందస్తు అంచనాకు రాలేకపోవడంతోనే ఇంతటి విపత్తు సంభవించిందనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.