
సివిల్స్‌లో మెరిసిన రత్నాలు
● మత్కేపల్లి వాసి చరణ్ తేజకు 231 ర్యాంక్ ● 697వ ర్యాంకు సాధించిన గిరిజన యువకుడు నాగరాజు
చింతకాని: యూపీఎస్‌సీ మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు యువకులు ర్యాంకులు సాధించారు. చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన నర్శింశెట్టి చరణ్ తేజ 231 ర్యాంక్‌ను సాధించడం విశేషం. గ్రామానికి చెందిన నర్శింశెట్టి హరినాధ్‌బాబు – నాగమణి దంపతుల చిన్న కుమారుడు చరణ్ తేజ 10వ తరగతి వరకు హైదరాబాద్‌లోని నారాయణ కాన్సెప్ట్ స్కూల్‌లో, ఇంటర్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో పూర్తిచేశాక జేఈఈలో 88వ ర్యాంకు సాధించి ముంబై ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆతర్వాత తొమ్మిది నెలల పాటు రూ.32 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసినా సివిల్ సాధించాలనే లక్ష్యంతో ఉద్యోగం మానేశాడు.
సొంతంగానే సిద్ధం..
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేశాక చరణ్‌తేజ ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వనరుల ద్వారా సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. 2022లో తొలిసారి పరీక్ష రాసినా ప్రిలిమ్స్‌కు అర్హత సాధించకపోగా 2023లో ఇంటర్వ్యూ దశకు చేరాడు. ఇక మూడో ప్రయత్నంలో ఈసారి ఆలిండియా 231వ ర్యాంక్ సాధించడం విశేషం. ఆయన తల్లిదండ్రులు 25ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడగా తండ్రి హరినాధ్‌బాబు ప్రైవేట్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్‌గా, తల్లి నాగమణి మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. చరణ్ సోదరుడు జైశిక్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా చరణ్‌తేజతో ‘సాక్షి’ మాట్లాడగా సివిల్స్‌లో ఆప్షనల్‌గా గణితం ఎంచుకున్నట్లు వెల్లడించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే సివిల్స్ సాధించానని, ఐఎఫ్‌ఎస్ ఎంచుకోవాలనే భావనతో ఉన్నట్లు తెలిపాడు.