
సుకన్య సమృద్ధి యోజన (SSY) దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చిన్న పొదుపు పథకాలలో ఒకటి. ఆడపిల్లల చదువు, వివాహం కోసం పొదుపు చేసే తల్లిదండ్రులకు ఈ పథకం అధిక వడ్డీ ఇస్తుంది. వచ్చే రాబడులపై కూడా పన్ను ఉండదు. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం కింద భారత ప్రభుత్వం ఈ పథకానికి సార్వభౌమ గ్యారంటీని అందిస్తోంది.
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ తగ్గిస్తున్నారా?
సుకన్య సమృద్ధి యోజన సహా చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి సమీక్షిస్తుంది. ఈ నేపథ్యంలో 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు మారిందా అన్న సందేహం చాలా మందిలో ఉంది. కానీ సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేటును ప్రభుత్వం మార్చలేదు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ పథకం కింద డిపాజిట్లపై సంవత్సరానికి 8.2 శాతం లభిస్తుంది. పోస్టాఫీసు పొదుపు పథకాలలో ఇదే అత్యధికం. ఈ పథకానికే కాదు ప్రస్తుత త్రైమాసికంలో ఏ చిన్న పొదుపు పథకానికి ప్రభుత్వం వడ్డీ రేటును మార్చకపోవడం గమనార్హం.
గరిష్ట, కనిష్ట డిపాజిట్లు..
సుకన్య సమృద్ధి యోజన కింద, డిపాజిట్లు నిర్దిష్ట నిబంధనలకు లోబడి ఉంటాయి. కనీసం రూ.250 ప్రారంభ డిపాజిట్‌తో ఈ ఖాతాను తెరవవచ్చు. కాబట్టి ఇది ఎక్కువ కుటుంబాలకు అందుబాటులో ఉంటుంది. ఖాతా యాక్టివ్‌గా ఉండాలంటే ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ .250 అయినా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ స్కీమ్‌లో ఒక ఆర్థిక సంవత్సానికి గరిష్టంగా రూ .1.5 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. డిపాజిటర్లు తమ సౌలభ్యాన్ని బట్టి ఏకమొత్తంలో లేదా నెలవారీ వాయిదాల ద్వారా పొదుపు జమ చేసుకోవచ్చు.
విత్‌డ్రా ఎప్పుడు?
సుకన్య సమృద్ధి ఖాతా తెరిచిన 21 సంవత్సరాల తరువాత మెచ్యూరిటీ అవుతుంది. ఈ సమయంలో ఖాతాను క్లోజ్ చేసి, వడ్డీతో సహా పూర్తి బ్యాలెన్స్ పొందవచ్చు. ప్రత్యామ్నాయంగా, అమ్మాయి వివాహం తర్వాత లేదా ఆమెకు 18 ఏళ్లు వచ్చాక ఖాతాను మూసివేయవచ్చు. మెచ్యూరిటీ తర్వాతే నిధులు తీసుకునేందుకు వీలున్నప్పటికీ బాలిక చదువు కోసం అంతకుముందే పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంది.
బాలికకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత లేదా పదో తరగతి పూర్తయిన తర్వాత ఏది ముందయితే అది కొంత మేర నిధులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉపసంహరణ మొత్తం గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అందుబాటులో ఉన్న బ్యాలెన్స్‌లో 50% వరకు ఉంటుంది. దీన్ని వన్ టైమ్ ఏకమొత్తంగా లేదా ఐదేళ్లకు మించకుండా సంవత్సరానికి ఒకటి చొప్పున వాయిదాల్లో పొందవచ్చు.