
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అంచనాలను మించిన పనితీరు కనపర్చింది. స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 17,616 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ4లో నమోదైన రూ. 16,512 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 6.6 శాతం అధికం. తాజా క్యూ4లో నికర లాభం రూ. 17,072 కోట్లుగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి.
సీక్వెన్షియల్ ప్రాతిపదికన లాభం 5.3 శాతం పెరిగింది. ఆదాయం రూ. 89,488 కోట్లకు పరిమితమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2024–25) గాను రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై బ్యాంకు రూ. 22 డివిడెండ్ ప్రకటించింది. దీనికి జూన్ 27 రికార్డు తేదీగా ఉంటుంది. మరోవైపు, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభం సుమారు 6.8 శాతం పెరిగి రూ. 17,622 కోట్ల నుంచి రూ. 18,835 కోట్లకు చేరింది. 2025 మార్చి 31 నాటికి బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ రూ. 36.17 లక్షల కోట్ల నుంచి రూ. 39.10 లక్షల కోట్లకు చేరింది.
పెరిగిన ఎన్‌పీఏలు..
2024–25 క్యూ4లో స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) నిష్పత్తి 1.33 శాతానికి చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నమోదైన 1.24 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. అటు నికర ఎన్‌పీఏల నిష్పత్తి 0.33 శాతం నుంచి 0.43 శాతానికి పెరిగింది. సీక్వెన్షియల్‌గా డిసెంబర్ క్వార్టర్‌లో నమోదైన 0.46 శాతం పోలిస్తే స్వల్పంగా తగ్గింది. పరిమాణంపరంగా చూస్తే స్థూల ఎన్‌పీఏలు రూ. 31,173 కోట్ల నుంచి రూ. 35,223 కోట్లకు పెరిగాయి. సీక్వెన్షియల్‌గా రూ. 36,019 కోట్ల నుంచి తగ్గాయి.
వడ్డీ ఆదాయం 10 శాతం వృద్ధి..
» నికర వడ్డీ ఆదాయం నాలుగో త్రైమాసికంలో రూ. 29,080 కోట్ల నుంచి సుమారు 10 శాతం పెరిగి రూ. 32,070 కోట్లకు పెరిగింది. డిసెంబర్ క్వార్టర్‌లో నికర వడ్డీ ఆదాయం రూ. 30,650 కోట్లుగా నమోదైంది.
» ఇక నికర వడ్డీ మార్జిన్ 3.54%గా నిల్చింది. ఆదాయ పన్ను రీఫండ్‌కి సంబంధించిన రూ. 700 కోట్ల వడ్డీని మినహాయిస్తే, నికర వడ్డీ మార్జిన్ 3.46%గా ఉంది.
» సమీక్షాకాలంలో ఫీజుల రూపంలో రూ. 8,530 కోట్లు, విదేశీ మారకం .. డెరివేటివ్స్ ఆదా యం కింద రూ. 1,440 కోట్లు, నికర ట్రేడింగ్.. మార్క్‌టు మార్కెట్ ఆదాయం కింద రూ. 390 కోట్లు, ఇతరత్రా రికవరీల రూపంలో రూ. 1,670 కోట్లు వచ్చాయి.
డిపాజిట్లు 16 శాతం అప్ ..
» నాలుగో త్రైమాసికంలో బ్యాంకు డిపాజిట్లు సగటున సుమారు 16 శాతం పెరిగి రూ. 25.28 కోట్లకు చేరాయి. క్రితం క్యూ4లో ఇది రూ. 21.84 లక్షల కోట్లుగాను, అంతక్రితం క్వార్టర్‌లో రూ. 24.53 లక్షల కోట్లుగాను నమోదైంది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన బ్యాంక్ డిపాజిట్లు సగటున 3.1 శాతం పెరిగాయి. కాసా (కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్) డిపాజిట్లు రూ. 7.85 లక్షల కోట్ల నుంచి సుమారు 6 శాతం వృద్ధితో రూ. 8.3 లక్షల కోట్లకు చేరాయి. మార్చి 31 నాటికి మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్ల వాటా 34.8 శాతంగా ఉంది.
» రుణాలు 5.4 శాతం వృద్ధితో రూ. 26.44 లక్షల కోట్లకు చేరాయి. రిటైల్ రుణాలు 9 శాతం, కమర్షియల్ .. గ్రామీణ బ్యాంకింగ్ రుణాలు 12.8 శాతం పెరగ్గా, కార్పొరేట్.. ఇతరత్రా హోల్‌సేల్ రుణాలు 3.6 శాతం తగ్గాయి.