
యువతకు చాట్‌జీపీటీ సాయం
లవ్ బ్రేకప్.. ఒంటరితనం.. ఆఫీసులో కోపిష్టి బాస్ వేధింపులు.. సహోద్యోగులతో ఇబ్బందులు.. జీవితంలో ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి, ఓపిగ్గా వినేవారొకరు ఉండాలి. తీరా చెప్పాక జడ్జ్ చేయకుండా ఉంటారా? నిష్పాక్షికంగా పరిష్కార మార్గం సూచిస్తారా? అనుమానమే. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా మానసిక వైద్యులను సంప్రదిస్తారు. కానీ ఇప్పుడు ట్రెండు మారుతోంది. ఈ విషయంలో చాట్‌జీపీటీకే జనం ఓటేస్తున్నారు. సమస్యలను వినే మంచి ఫ్రెండ్‌గానే గాక వాటికి పరిష్కారం చూపే కౌన్సిలర్‌గా కూడా భావిస్తున్నారు.
లైఫ్ కౌన్సిలర్‌గా..
27 ఏళ్ల మనీశ్ ఇంజినీర్. ప్రియురాలితో గొడవైంది. అపార్థాలతో బంధానికి బ్రేక్ పడింది. మానసికంగా అలసిపోయి ఓ సాయం వేళ చాట్‌జీపీటీని ఆశ్రయించాడు. సమస్యంతా చెప్పాడు. ఏం చేయాలో పాలుపోవడం లేదన్నాడు. చాట్‌జీపీటీ సమాధానం మనోన్ని ఆశ్చర్యపరిచింది. ‘మీరు చెప్పింది ఆమె వినకపోవడం మిమ్మల్ని బాధిస్తోంది. అదే విషయం ఆమెకు నేరుగా చెప్పారా?’అని అడిగింది. అంతటితో ఆగకుండా ప్రేయసికి సందేశం పంపడంలో మనీశ్‌కు సాయపడింది. ఆమెను నిందించకుండా కేవలం అతని ఫీలింగ్స్ మాత్రమే వ్యక్తపరిచే ప్రశాంతమైన, నిజాయితీతో కూడిన నోట్ అది. అందుకున్న ఆ అమ్మాయి మనీష్‌తో మాట్లాడింది. ఇంకేముంది వారి మధ్య దూరం తగ్గిపోయింది.
వృత్తి సమస్యల్లో సాయం
26 ఏళ్ల అక్షయ్ శ్రీవాస్తవ కంటెంట్ రైటర్, మీడియా ప్రొఫెషనల్. ఆఫీసుకు వెళ్లిరావడానికే నాలుగ్గంటలు పోతోంది. నిద్ర లేదు. కుటుంబంతో గడపడానికి లేదు. ఫిర్యాదులా కాకుండా ఈ విషయాన్ని బాస్‌తో ఎలా చెప్పాలో తేలక చాట్‌జీపీటీని ఆశ్రయించాడు. వాడాల్సిన పదాలతో సహా చక్కని నిర్మాణాత్మక సలహాలిచ్చింది. అప్పటినుంచి అక్షయ్ క్రమం తప్పకుండా చాట్‌బాట్‌ను ఆశ్రయిస్తున్నాడు. ఆయేషాది మరో సమస్య. ఇన్నాళ్లు సహోద్యోగిగా ఉన్న స్నేహితులకే బాస్ అయింది. సాన్నిహిత్యం కోల్పోకుండా వాళ్లతో ఎలా డీల్ చేయాలని చాట్‌జీపీటీనే అడిగింది. అదిచ్చిన సమాధానం ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌లో క్రాష్ కోర్సులా సాయపడింది.
బెటర్ కౌన్సిలర్?
ఒక్కోసారి కౌన్సిలర్ కంటే మెరుగ్గా చాట్‌జీపీటీ ఇచ్చే సమాధానాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. జీవితంలో చాలా కోల్పోయాననే భావన కలుగుతుందనే ప్రశ్నకు.. ‘మార్పు జరిగినప్పుడు అది మామూలే. అభిరుచులను పెంచుకోండి’అని కౌన్సిలర్ చెప్పారు. చాట్‌జీపీటీ మాత్రం, ‘సంతోషపరిచే పనులు చేయండి. చిన్న లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరుకునే ప్రయత్నం చేయండి’అని సూచించింది. స్నేహితులు అర్థం చేసుకోవడం లేదంటే వారితో ఓపెన్‌గా మాట్లాడమని థెరపిస్టు చెబితే, ‘స్నేహితుల్లో అపార్థాలు మామూలే. వారితో నిజాయితీగా మాట్లాడండి’అని చాట్‌జీపీటీ సూచించింది. పని నచ్చడం లేదంటే ఒత్తిళ్లను గుర్తించి పరిష్కారానికి కొత్తగా ప్రయత్నించమని కౌన్సిలర్ చెప్పాడు. చాట్‌జీపీటీ మాత్రం ‘పనిలో పరిమితులను పెట్టుకోండి. హెచ్‌ఆర్ లేదా మెంటార్‌తో మాట్లాడండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి’అని సలహా ఇచ్చింది. భాగస్వామితో విభేదాలపై ఓపెన్‌గా మాట్లాడుకుని, సమస్యకు కారణాలేంటో కనిపెట్టి పరిష్కారానికి కలిసి ప్రయత్నించడన్న చాట్‌జీపీటీ సూచనే మెరుగ్గా ఉందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
ఇదీ చదవండి: హై-ఎండ్ కార్లు.. లగ్జరీ ప్రాపర్టీలు.. కేఎల్ రాహుల్ ఆస్తుల వివరాలు
ప్రత్యామ్నాయం కాబోదు: మానసిక వైద్యులు
మానసిక వైద్యం మనదేశంలో కాస్త ఖరీదైన విషయం. జనంలో అవగాహన లేమి కూడా ఉంది. ఆ సమస్యలకు చాలామంది క్రమంగా ఏఐపై ఆధారపడుతున్నారు. అది జడ్జ్ చేయదు. చెబుతుంటే మధ్యలో అడ్డుకోదు. ఏం చెప్పినా, ఎంతసేపు చెప్పినా, ఎప్పుడు చెప్పినా శ్రద్ధగా వింటుంది. అంతే ఓపిగ్గా సమాధానమూ ఇస్తుంది. దాంతో వ్యక్తిగతం నుంచి వృత్తిపరమైన సలహాల దాకా యూత్ చాట్‌జీపీటీపై ఆధారపడుతోంది. కానీ ఈ చాట్‌బాట్ మానసిక ఇబ్బందులకు మొత్తంగా పరిష్కారం చూపలేదంటున్నారు వైద్యులు. ‘అది తాత్కాలిక ఉపశమనమిచ్చే ఔట్‌లెట్‌లా పనిచేస్తుందంతే. పూర్తిస్థాయి మానసిక చికిత్స ప్రక్రియకు ప్రత్యామ్నాయం కాబోదు. సానుభూతి, అంతర్దష్టి, అవగాహన వాటికుండవు’ అంటున్నారు. అంతేగాక ఏఐ థెరపీ బాట్లతో ముప్పు కూడా ఉంటుందని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ హెచ్చరించింది. ప్రత్యేకించి వాటిని పిల్లలు వాడటంపై ఆందోళన వ్యక్తం చేసింది. మనుషులను అవి మరింత ఒంటరిగా చేస్తాయనీ హెచ్చరించింది.