
100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి...
న్యూఢిల్లీ: బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) వీలు కల్పించే సవరణ బిల్లును వచ్చే వర్షకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుంచనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముసాయిదా బిల్లు సిద్ధమైందని, త్వరలోనే కేబినెట్ ఆమోదం తీసుకోనున్నట్టు తెలిపాయి. కేబినెట్ ఆమోదం అనంతరం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టే ప్రక్రియను ఆర్థిక వ్యవహారాల విభాగం మొదలు పెడుతుందని పేర్కొన్నాయి.
పార్లమెంటు వర్షకాల సమావేశాలు సాధారణంగా జూలైలో ఆరంభం అవుతుంటాయి. ప్రస్తుతం బీమా రంగంలో 74 శాతం మేర ఎఫ్‌డీఐలకు అనుమతి ఉండగా, 100 శాతానికి పెంచే ప్రతిపాదనను 2025–26 బడ్జెట్‌లో ప్రతిపాదించడం గమనార్హం. బీమా సవరణ చట్టంలో ఎఫ్‌డీఐ పెంపుతోపాటు మూలధన నిధుల అవసరాలను తగ్గించడం, కాంపోజిట్ లైసెన్స్ తదితర ప్రతిపాదనలు చోటుచేసుకోనున్నాయి. బ్రోకర్లు సైతం ఒకటికి మించిన బీమా కంపెనీల ఉత్పత్తుల విక్రయానికి అవకాశం లభించనుంది.