
టెక్ పరిశ్రమలో అనిశ్చితులు ఇప్పట్లో కుదటపడేలా కనిపించడం లేదు. టాప్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం ఇంటెల్ కార్పొరేషన్ భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. తమ వర్క్ ఫోర్స్‌లో 20 శాతానికి పైగా తొలగించాలని యోచిస్తోన్న ఇంటెల్ ఈ వారంలోనే లేఆఫ్‌లను ప్రకటించబోతోంది.
గత మార్చిలో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన లిప్-బు తాన్ నాయకత్వంలో ఇంటెల్ కంపెనీ ఈ వారం 20,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికను ప్రకటించనుందని నివేదికలు సూచిస్తున్నాయి. 2024లో 19 బిలియన్ డాలర్ల నష్టంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇంటెల్, ఈ కోతలతో అధికారిక వ్యవస్థను తగ్గించి, నిర్వహణను సరళీకరించి, ఇంజనీరింగ్-ఆధారిత సంస్కృతిని పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదే మొదటిసారి కాదు...
ఇంటెల్ తన పరిస్థితిని మెరుగుపరచుకునేందుకు ఉద్యోగాల కోతలను చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. 2024 ఆగస్టులో 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో కంపెనీ మొత్తం సంఖ్య 1,08,900కు చేరింది. అంతకుముందు సంవత్సరం 2023లో ఇంటెల్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 124,800 ఉండేది.
రోజుకు 450 మంది తొలగింపు
2025లో 257 టెక్ కంపెనీలు రోజుకు సగటున 450 మంది చొప్పున 50,372 మంది ఉద్యోగులను తొలగించాయని లేఆఫ్స్.ఎఫ్‌వైఐ తెలిపింది. 2024లో 1,115 కంపెనీల్లో 2,38,461 మంది ఉద్యోగులు తొలగింపునకు గురయ్యారు. ఇంటెల్ మాత్రమే కాకుండా గూగుల్ 2025 ఏప్రిల్‌లో తన ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైజెస్ యూనిట్ (ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్)లో వందలాది మందిని తొలగించింది. అంతకు ముందు క్లౌడ్, హెచ్ఆర్ విభాగాల ఉద్యోగుల సంఖ్యలో కోత విధించింది.
మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా వచ్చే మే నెలలో తొలగింపులకు సిద్ధమవుతోంది. ఇంజనీర్-టు-మేనేజర్ నిష్పత్తులను పెంచడానికి మిడిల్ మేనేజర్లు, తక్కువ పనితీరు కనబరిచేవారిని లక్ష్యంగా చేసుకుని, ముఖ్యంగా దాని భద్రతా విభాగంలో ఈ తొలగింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా 2025 ఫిబ్రవరిలో 3,600 మంది ఉద్యోగులను తొలగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాలను క్రమబద్ధీకరించడానికి పనితీరు ఆధారిత తొలగింపులపై దృష్టి సారించింది.