నా రాజకీయ అనుభవమంత లేదు నీ వయసు.. నాపైనే నిఘా పెడతాడా..? | - | Sakshi
Sakshi News home page

నా రాజకీయ అనుభవమంత లేదు నీ వయసు.. నాపైనే నిఘా పెడతాడా..?

Published Tue, Mar 19 2024 12:50 AM | Last Updated on Tue, Mar 19 2024 1:17 PM

- - Sakshi

 చిత్తూరు టీడీపీలో వర్గపోరు

 మాజీలు.. పెద్దలపై నిఘా పెట్టిన గురజాల? 

 నేతలను పక్కనపెట్టి.. సొంత అజెండా 

 అనుమానంతో అవమానించడంపై సీనియర్ల ఆగ్రహం 

 తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్న నాయకులు

‘‘నా రాజకీయ అనుభవమంత లేదు ఇతని వయసు.. అలాంటిది నాపైనే నిఘా పెడతాడా..? నేను ఎవరితో మాట్లాడుతున్నా.. ఏం చేస్తున్నా..? అని ఆరాలు తీస్తాడా..?’’ ఓ టీడీపీ నాయకుడి ఆగ్రహం.

‘‘అన్నా.. నీ ఒక్కడిపైనే కాదు.. నేనేదో ఆయన నుంచి డబ్బులు ఆశిస్తున్నట్లు నన్నూ అనుమానిస్తున్నాడు..! నన్ను జనం ఎప్పుడో మర్చిపోయారని నా వాళ్లతోనే వ్యాఖ్యానిస్తున్నాడు..! ఇక గమ్ముగా ఉంటే లాభం లేదు. మనమేంటో చూపిస్తే కానీ, అతడికి అసలు సంగతి అర్థం కాదు’’ మరో నేత మనో వేదన..

ఇవి చిత్తూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్‌మోహన్‌ నాయుడు (జీజేఎం)పై సొంత పార్టీకి చెందిన వారు ఓ నాయకుడి ఇంట్లో నిర్వహించిన రహస్య సమావేశంలో మాట్లాడుకున్న మాటలు అని ప్రచారం సాగుతోంది..? పార్టీలోని సీనియర్లను, మాజీలను జీజేఎం నమ్మడం లేదా..? ఇది గ్రహించిన అసమ్మతీయులు ఇటీవల ఓ సీనియర్‌ నాయకుడి ఇంట్లో సమావేశమయ్యారా..? తమను లెక్కచేయని వ్యక్తికి తగిన గుణపాఠం నేర్పాలని కంకణం కట్టుకున్నారా..? ఈ ప్రశ్నలకు జీజేఎం అనుచరులు అవుననే సమాధానం చెబుతున్నారు. రాజకీయాలకు దూరమై ఏళ్లు గడిచిపోయిన మాజీ నేతలను జీజేఎం పక్కకు పెట్టేసినట్టు తెలుస్తోంది. వీళ్ల పనితీరుపై తాను తెప్పించుకున్న సర్వే నివేదికలే ఇందుకు కారణమని సమాచారం. ఈ విషయం పసిగట్టిన అసమ్మతివర్గం పక్కనే నమ్మకంగా ఉంటూ నట్టేట్లో ముంచాలని తీర్మానించినట్లు తెలిసింది.

చిత్తూరు అర్బన్‌ : చిత్తూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపుపై ధీమాగా ఉన్నారు. ప్రజల కోసం సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధైర్యంగా ఉన్నారు. కానీ టీడీపీలో పరిస్థితి అలాకాదు. ఎవరో, ఏమిటో తెలియకుండా ఎవరెవరినో తీసుకొచ్చి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇదే దారిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పచ్చ కండువాలు కప్పుకుంటే.. ఈ పార్టీ పొత్తుపెట్టుకున్న జనసేనలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే చేరిపోయారు. పైగా ఎమ్మెల్సీ, మేయర్‌తో పాటు ఇతర నామినేటెడ్‌ పోస్టులు అనుభవించిన సీనియర్లు తన వెంటే ఉంటూ గెలుపునకు కృషి చేస్తారని ఇన్నాళ్లు జీజేఎం వీళ్లపై నమ్మకం పెట్టుకున్నాడు.

కానీ ఇప్పుడు తన నీడను తప్ప ఎవ్వరినీ నమ్మే పరిస్థితిలో లేడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు, పార్టీలోకి వచ్చే ప్రతీ ఒక్కరికీ పెద్ద మొత్తంలో నగదు ముట్టజెప్పాలని తనపై ఒత్తిడి తెస్తున్నట్లు తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తనతో పాటు ఉన్న నేతల సత్తా ఏమిటో తెలుసుకోవాలని వాళ్లను చూసి ఓట్లేసేవాళ్లు ఎంత మంది ఉన్నారు..? ఎన్నిచోట్ల ప్రభావితం చేస్తారు..? అసలు ఆ నేతలతో పాటు వచ్చే అనుచరగణం ఎంత..? లాంటి విషయాలు తెలుసుకోవడానికి కూడానే ఉంటున్న పలువురి నుంచి విషయాలు రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం.

జనసైనికుల లొల్లి
ఇదికాదన్నట్లు జనసేన పార్టీ నేతలు సైతం చిత్తూరులో తన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు జీజేఎంకు సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. జనసేనలోని ఓ వ్యక్తిని రెబల్‌గా నామినేషన్‌ వేయించనున్నట్లు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ఆ పార్టీ నాయకులు పోస్టులు పెడుతున్నారు. ఇది కూడా చిల్లర కోసమేనంటూ జీజేఎం గుర్తించాడు. వీళ్లతో పాటు కమలంలోని వ్యక్తులతో పెద్దగా ఉపయోగంలేదని తన అనుచరుల వద్ద వాపోయినట్లు తెలిసింది. కేలవం తన నుంచి వచ్చినకాడికి నోట్లు రాల్చుకుందామనే ప్రతీ ఒక్కరూ క్యూ కడుతున్నారని టీడీపీ అభ్యర్థి నిర్దారణకు వచ్చినట్లు సమాచారం.

పక్కనే ఉంటూ..
రైలు.. పట్టాలు ఎక్కకున్నా, రాజకీయ నాయకుడు జనం మధ్య లేకుండా గ్యాప్‌ తీసుకున్నా మరచిపోవడం మామూలే. ఒక్కసారి మరచిపోయిన వ్యక్తిని మళ్లీ జనం నమ్మే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం జీజేఎం తన సొంత పార్టీ నేతలపై నిఘా ఉంచి తెప్పించుకున్న సారాంశం ఇదేనని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో పార్టీలోని పలువురు సీనియర్లు చిత్తూరు నగరంలోని ఓ ప్రధాన నాయకుడి ఇంట్లో రెండు రోజుల క్రితం సమావేశమయినట్లు తెలిసింది. ఈ మీటింగ్‌కు తన అనుచరులను పంపిన జీజేఎం పూర్తి సమాచారం తెలుసుకున్నట్లు సదరు నేతలు కనిపెట్టేశారు.

తమపైనే నిఘా పెట్టడాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. టికెట్‌ కోసం చివరి నిముషం వరకు ప్రయత్నించి, పార్టీ అధిష్టానం మొండిచేయి చూపినా భరించి అభ్యర్థి వెంట నడుస్తుంటే తమపైనే నిఘా పెట్టడం ఎంత వరకు న్యాయమని ఆవేదన వెళ్లగక్కినట్లు సమాచారం. ఇలా ప్రతి ఒక్కరినీ అనుమానించే వ్యక్తికి వెనకే ఉంటూ వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుందో చూపించాలని పచ్చ పెద్దలంతా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఓ ఆసక్తికర అంశం ఏంటంటే.. అసమ్మతి నేతల రహస్య సమావేశంలో చర్చించిన పలు విషయాలను సైతం జీజేఎం తెప్పించుకున్నట్లు తెలిసింది.

తనతోనే ఉంటూ వెన్నుపోటు పొడవాలని చూస్తున్న సొంత పార్టీ నేతలను గుర్తించి, వారిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు జీజేఎం ఎన్నికల ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొంటున్న నేతలు ఎవరెవరితో మాట్లాడుతున్నారు..? ఎవర్ని కలుస్తున్నారో తెలుసుకోవడానికి జీతాలు ఇచ్చి మరి ఓ బృందాన్ని నియమించినట్లు తెలుస్తోంది. చిత్తూరులో పార్టీ ఏమైనా పర్లేదు.. తమ ఉనికికి ప్రమాదం రాకుండా చూసుకోవడానికి ఎవ్వరికై నా వెన్నుపోటు పొడవడానికి అలవాట్టు పడ్డ పెద్దల కత్తులు ఈసారి జీజేఎంను లక్ష్యంగా చేసుకున్నాయి. విషయం తెలిసి కూడా సొంతపార్టీలోని అనుకూల శత్రువులతో వేదికలు పంచుకుంటున్న అభ్యర్థి పైకి నవ్వుతూ కనిపిస్తున్నా.. తాను నమ్మే ఓ యువ నాయకుడి వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement