
బెంగళూరు: భార్యను హత్య చేసిన భర్త, భర్తను హత్య చేసిన భార్య.. ఇవే ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైవాహిక బంధాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారో.. లేక ఆ బంధంలో భారాన్ని మోయలేకపోతున్నారో కానీ ఈ తరహా హత్యోదంతాలు కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి.తాజాగా మరో హత్య వెలుగుచూసింది. బెంగళూరులో టెకీగా పని చేస్తున్న 36 ఏళ్ల వ్యక్తి.. భార్యను హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రాకేష్ రాజేంద్ర ఖేదకర్.. ఒక సాప్ట్ వేర్ కంపెనీలో ప్రొఫెషనల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అయితే భార్యా భర్తల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి గొడవ కారణంగా భార్య గౌరీ అనిల్ షెంబేకర్ (32)ను హత్య చేశాడు . బుధవారం వీరిద్దరూ కలిసి డిన్నర్ చేసే క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే తన చేతిలో ఉన్న కత్తిని భర్తపైకి విసిరింది భార్య. దీంతో భర్త రాజేంద్రకు గాయమైంది. దాంతో సహనాన్ని కోల్పోయిన భర్త.. అదే కత్తితో భార్యపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది.
సూట్ కేస్ లో ప్యాక్ చేసి..
అయితే భార్య మృతదేహాన్ని సూట్ కేస్ లో పార్శిల్ చేసి ఇంటి లోపల పెట్టిన భర్త.. అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని తన అత్త మామలకు ఫోన్ చేసి చెప్పాడు. తాను మీ కూతుర్ని హత్య చేశానంటూ ఫోన్ చేప్పాడు. డెడ్ బాడీని బయట సూట్ కేస్ లో ప్యాక్ చేసినట్లు వెల్లడించాడు. దాంతో ఆ విషయాన్ని మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. అక్కడన్నుంచి కర్ణాటక పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఒక ప్యాక్ చేసి ఉన్న ఒక సూట్ కేస్ కనిపించింది. అందులో మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టంకు పంపగా అది హత్యగా ధృవీకరించారు. మెడపై, చాతీలో కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్ట్ లో వెల్లడైంది.
ఆత్మహత్యకు యత్నం
భార్యను హత్య చేసిన తర్వాత పుణెకు పారిపోయాడు భర్త రాజేంద్ర.. అయితే అక్కడ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతను ఎక్కుడున్నాడో విషయాన్ని ట్రేస్ చేసిన పోలీసులు.. పుణె పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వెళ్లిన పుణె పోలీసులకు అతను అపస్మారక స్థితిలో కనిపించాడు. దాంతో అతన్ని పుణె ఆస్పత్రిలో చేర్చించారు. ఈ సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు పుణెకు చేరుకున్నారు. రాజేంద్ర సృహలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి బెంగళూరు తీసుకురానున్నట్లు పోలీసులు తెలిపారు.
ఏడాది క్రితమే బెంగళూరుకు..
మహారాష్ట్రకు చెందిన వీరిద్దరికి రెండేళ్ల క్రితమే వివాహం జరగ్గా, ఏడాది క్రితమే బెంగళూరుకు వచ్చారు. కొంతకాలంగా వీరి వైవాహిక సాఫీగానే సాగింది. భర్త ఒక ప్రైవేటు కంపెనీ సాప్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడు. ప్రస్తుతం అతను వర్క్ ఫ్రమ్ హోమ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య మాస్ మీడియలో బ్యాచలర్ డిగ్రీ కంప్లీట్ చేసింది.