
తయారు చేసి విక్రయిస్తే కోట్లు వస్తాయని నమ్మించింది
మహిళ నుంచి పలు దఫాలుగా రూ. 8 లక్షలు కాజేసిన లేడీ
ఆర్‌జీఐఏ పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ
శంషాబాద్: ‘‘అదో స్పెషల్ కాయిన్... కాయిన్ ఎదురుగా పెట్టగానే సూది కూడా లేచి నిలబడుతుంది’’.. ఇలా కాయిన్‌తో అనేక విన్యాసాలు చూపించి దానిని తయారీకి రూ. 4 నుంచి రూ. 6 లక్షలు ఖర్చు చేస్తే.. దానిని కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తారు.. లేడీ టక్కుటమార విద్యలతో పాటు మాటలను నమ్మిన ఓ మహిళ 8 లక్షల రూపాయలు చెల్లించింది.. ఆరు నెలలుగా ఇదిగో అదిగో అంటూ చెప్పుకొస్తున్న ఆ మహిళ మాటలు నమ్మి చివరికి నిండా మునిగింది.
జరిగింది ఇలా...
శంషాబాద్ పట్టణంలోని సాతంరాయి బస్తీకి చెందిన అరుణ(32) అదే బస్తీకి చెందిన ఓ యువకుడి ద్వారా కాయిన్ విషయాన్ని తెలుసుకుంది. కర్నాటక మైసూర్ ప్రాంతానికి చెందిన లక్ష్మీ అనే మహిళ ఈ కాయిన్ వ్యాపారం చేస్తుందని తెలపడంతో గతేడాది అక్టోబర్‌లో అరుణ నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్ ముందు ఉన్న కాఫీ షాపులో కిలేడీ లక్ష్మీని కలిసింది. లక్ష్మీ మరోమారు వీడియోలో కాయిన్ చూపించి దానిని తయారు చేయడానికి సుమారు రూ. 6 లక్షల వరకు ఖర్చువుతుందని తయారు చేసి దానిని అమ్మి కోటి రూపాయాల వరకు ఇస్తానని నమ్మించింది. ఆమె మాటలను నమ్మిన అరుణ నగదు రూపంలో రూ. 90 వేలు ఇవ్వగా పలు దఫాలుగా రూ. 6 లక్షలు చెల్లించింది.
తనిఖీలో
కాయిన్ చేసిన తర్వాత తాను ఉంటున్న హోటల్‌లో తనిఖీలు జరగడంతో దానిని అక్కడే పడేసి వెళ్లాలని బుకాయించింది. తనకు మరో రెండు లక్షల వరకు చెల్లిస్తే ఈ దఫా కాయి తప్పకుండా చేసి విక్రయించి నీ కష్టం అంతా తీర్చేస్తానని నమ్మించింది. దీంతో మరోసారి మోసపోయిన మరో రెండు లక్షల వరకు ఫొన్‌పే ద్వారా చెల్లించింది.
చదవండి: మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీ
ఎయిర్‌పోర్టులో హైడ్రామా...
తాను పూర్తిగా మోసపోయినట్లు గుర్తించిన అరుణ ఎలాగైనా లక్ష్మీని పట్టుకుని పోలీసులకు అప్పగించాలని ఈ నెల 19 మరో వ్యక్తి డబ్బులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రప్పించింది. ఆ రోజు మాట్లాడిన తర్వాత మరుసటిరోజు ఉదయం శనివారం కలుస్తానని చెప్పి నిందితురాలు అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఈ నెల 20 ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన కిలేడీని పట్టుకునేందుకు నానా పాట్లు పడ్డారు. చివరికి పోలీసుల సాయంతో పట్టుబడింది.. తాను డబ్బులు తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని పోలీసుల సమక్షంలోనే నమ్మించింది. ఆ తర్వాత తనతో పాటు కారు ఎక్కాలని చెప్పిన లేడీ చాకచక్యంగా అరుణతో పాటు ఆమెతోపాటు ఉన్న మరో మహిళను తోసేసి తనవెంట వచ్చిన వ్యక్తితో కారుతో వేగంగా ఎయిర్‌పోర్టు నుంచి ఉడాయించింది. దీంతో బాధిత మహిళ బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. అక్కడి పోలీసుల సూచనల మేరకు గురువారం ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బాలరాజు ముందు జరిగిన విషయాన్ని వెల్లడిండించడంతో పాటు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. కిలేడీ ఫొటోలు, ఫోన్‌పే ద్వారా చెల్లింపు చేసిన వాటన్నింటిని, పలు దఫాలుగా జరిగిన సంభాషణల రికార్డింగులు సమర్పిచింది. బాధితురాలి నుంచి ఈ మేరకు పోలీసులు ఫిర్యాదును తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: సీమా హైదర్ పాక్ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్ సంచలన వీడియో