
రియల్ ఎస్టేట్ రివర్స్ గేర్
మధ్య తరగతికి భారమే
గత ఫిబ్రవరిలో ప్రభుత్వం అనా లోచితంగా భూముల మార్కెట్ విలువలు పెంచడం మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా పరిణమించింది. కరోనా సమయంలో అతలాకుతలమైన మధ్యతరగతి ప్రజల జీవితాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. సొంత ఇంటి కలను సాకారం చేసుకునే దిశగా భూములను కొనుగోలు చేయాలని చూస్తే ధరలు బెంబేలెత్తిస్తున్నాయి.
– గంటా రాజేశ్వరరావు, రియల్ ఎస్టేట్ యూనియన్ జిల్లా కార్యదర్శి
మార్కెట్‌లో తక్కువ.. రికార్డుల్లో ఎక్కువ
సాధారణంగా బహిరంగ మార్కెట్‌లో ధరలు అసాధారణంగా ఉండి ప్రభుత్వ రికార్డుల్లో తక్కువగా ఉంటే ప్రభుత్వం ఆయా ప్రాంతాల డిమాండ్‌ను బట్టి రికార్డుల్లో మార్కెట్ ధరలను పెంచడానికి నిర్ణయం తీసుకుంటుంది. గత ఫిబ్రవరిలో మార్కెట్ వాల్యూ పెంచడంతో బహిరంగ మార్కెట్‌లో కంటే రికార్డుల్లోనే ధర ఎక్కువగా ఉంంది.
– తోటకూర కిషోర్,
రియల్ ఎస్టేట్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో రియల్ ఎస్టేట్ భూం రివర్స్ అయ్యింది. గత ఏడాది కాలంగా కొనుగోలు శక్తి తగ్గిపోవడం, మార్కెట్‌లో నగదు లావాదేవీలు 50 శాతం మేర తగ్గడంతో పాటు.. ఒకేసారి 25 శాతం గవర్నమెంట్ వాల్యూ పెంచడం రియల్ ఎస్టేట్ పతనానికి దారితీశాయి. వందల సంఖ్యలో వెంచర్లు, అపార్ట్‌మెంట్లల్లో ప్లాట్లు విక్రయాల కోసం సిద్ధంగా ఉన్నా కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రజలను ఆకర్షించడానికి లక్కీ డిప్‌లు, లాటరీలు, రెంటల్ భరోసా ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా రియల్ భూంలో కదలిక లేకపోగా సాధారణ స్థాయి క్రయవిక్రయాలు కూడా జరగకపోవడం గమనార్హం. 2024–25లో రూ.495.12 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్ణయించగా రూ.348 కోట్లతో కేవలం 70 శాతం మేర లక్ష్యాన్ని చేరుకుంది. స్ధల క్రయ విక్రయాల కంటే ఇతర రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉన్నాయి. ఏలూరు జిల్లాలోని రియల్ ఎస్టేట్ పూర్తిగా మందగించింది. జిల్లా వ్యాప్తంగా ఏలూరు, కై కలూరు, చింతలపూడి, నూజివీడు, జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీలు, దెందులూరు, కామవరపుకోట మండలాల్లో సుమారు 150కు పైగా లేఅవుట్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో వేల సంఖ్యలో ప్లాట్లు ఉన్నాయి. ఏలూరుతో పాటు మిగిలిన మున్సిపాల్టీల్లో నిర్మాణం పూర్తి చేసుకుని, వివిధ దశల్లో ఉన్న అపార్ట్‌మెంట్లు సుమారు 85కు పైగా ఉన్నాయి. దాదాపు ఏడాది నుంచి క్రయవిక్రయాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో రియల్ మార్కెట్ రోజురోజుకి సంక్షోభంలో చిక్కుకుంటుంది. పోలవరం ప్రాజెక్టు పరిహారం లబ్ధిదారులకు పడటంతో గతంలో జంగారెడ్డిగూడెంలో రియల్ ఎస్టేట్ భూం విపరీతంగా కొనసాగింది. జిల్లా వ్యవసాయ అధారిత జిల్లా కావడంతో పామాయిల్, కోకో తోటల క్రయవిక్రయాలు కూడా గతంలో పెద్ద సంఖ్యలో జరిగాయి. ప్రస్తుతం ఇదంతా పూర్తిగా మందగించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి అభివృద్ధి అంటూ హడావుడి చేస్తుండటం, 25 శాతం మార్కెట్ విలువ పెంచడంతో స్థానికంగా మార్కెట్ పూర్తిగా పతనమైందని రియల్ ఎస్టేట్ వర్గాల వాదన. ఈ పరిణామాల క్రమంలో ఏలూరు జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 2024–25 వార్షిక లక్ష్యం రూ.495.12 కోట్లకుగాను రూ.384.72 కోట్ల ఆదాయం సమకూరింది.
70 శాతం టార్గెట్ పూర్తి : 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 91,642 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటిలో 20,383 విక్రయాల రిజిస్ట్రేషన్లు 18,698 గిఫ్ట్ రిజిస్ట్రేషన్, 25,121 తాకట్టు రిజిస్ట్రేషన్, జనరల్ పవర్, హక్కు విడుదల, పార్టనర్ షిప్ డీడ్, ట్రస్ట్‌ల రిజిస్ట్రేషన్లు, ధార్మిక సంస్ధల రిజిస్ట్రేషన్లు, క్యాన్సిలేషన్ డీడ్, అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్లు, విడాకుల రిజిస్ట్రేషన్లు తదితరాలు అన్ని కలిపి 27,449 జరిగాయి. దీంతో వంద శాతం లక్ష్యానికి 70 శాతం మాత్రమే జరిగింది. వాస్తవానికి మార్కెట్ వాల్యూ పెరగడం, ఇతర రిజిస్ట్రేషన్లు పెరగడంతో టార్గెట్‌లో 20 నుంచి 25 శాతం ఆదాయం పెరిగింది. 2023–24లో జిల్లా వ్యాప్తంగా 1,02,222 రిజిస్ట్రేషన్లు జరగగా, 2024–25 సంవత్సరంలో 91,642 రిజిస్ట్రేషన్లు జరిగాయి.
మందగించిన క్రయవిక్రయాలు
5 నుంచి 25 శాతం మేర పెరిగిన మార్కెట్ విలువ
మార్చి నెలలోనే 46 శాతం తగ్గిన టార్గెట్
పట్టణాలు, నగరాల్లో ధరలు పతనం
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
కార్యాలయం రిజిస్ట్రేషన్ల నిర్దేశించిన పూర్తి చేసిన శాతం
సంఖ్య లక్ష్యం లక్ష్యం
(రూ. కోట్లలో) (రూ. కోట్లలో)
భీమడోలు 9,474 43.94 31.32 71.21
చింతలపూడి 11,437 44.23 27.92 63.13
జంగారెడ్డిగూడెం 9,929 43.06 34.82 80.87
కామవరపుకోట 4,598 24.33 18.08 74.32
పోలవరం 3,421 6.96 6.31 90.65
ఏలూరు 18,162 168.52 110.46 65.55
గణపవరం 4,605 17.67 13.40 75.83
వట్లూరు 4,528 33.19 23.53 70.90
కై కలూరు 4,932 26.32 15.17 57.65
మండవల్లి 1,911 13.44 4.64 34.53
ముదినేపల్లి 2,469 13.37 7.57 56.61
నూజివీడు 14,181 60.03 55.45 92.37
మొత్తం 91,642 495.12 347.72 70.43

రియల్ ఎస్టేట్ రివర్స్ గేర్

రియల్ ఎస్టేట్ రివర్స్ గేర్